Fever and Chicken: జ్వరంతో ఉంటే చికెన్ తినడం ప్రమాదకరమా? అలా తింటే పచ్చకామెర్లు వస్తాయా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు
Fever and Chicken: చాలామంది జ్వరం ఉన్నప్పుడు చికెన్ తినేందుకు వెనకాడతారు. అలా తింటే పచ్చకామెర్లు వస్తాయని నమ్ముతారు. ఇది ఎంతవరకు నిజమో ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చికెన్ ఇప్పుడు ప్రధాన ఆహారంగా మారింది. ఎంతోమంది చికెన్ వంటకాలను ఇష్టపడుతున్నారు. అయితే జ్వరం వస్తే మాత్రం చికెన్ తినకూడదనే నమ్మకం ఎక్కువమందిలో ఉంది. ఇలా తింటే పచ్చకామెర్లు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నమ్ముతారు. పూర్వకాలం నుంచి కొన్ని నమ్మకాలు అలా ఉండిపోయాయి. దీనికి ఆరోగ్య నిపుణులు సరైన సమాధానాన్ని అందిస్తున్నారు.
మీకు జ్వరం ఉన్నప్పటికీ తినాలనిపిస్తే చికెన్ కూరను తినవచ్చు. ఎలాంటి సమస్యా లేదు, పైగా జ్వరం ఉన్నప్పుడు చికెన్ తినడం వల్ల మీ రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. చికెన్ లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అయితే జ్వరంగా ఉన్నప్పుడు చికెన్ తినకూడదని చెప్పడానికి మరో కారణం ఉంది. శరీరం బలహీన పడడం వల్ల జీర్ణక్రియ కూడా నీరసపడుతుంది. ఇది జీర్ణక్రియను మందగించేలా చేస్తుంది. ఆ సమయంలో చికెన్ తింటే సరిగా అరుగుతుందో లేదో అన్న అనుమానం ఎంతో మందిలో ఉంటుంది. అందుకే జ్వరంగా ఉన్నప్పుడు చికెన్ తినే వారి సంఖ్య చాలా తక్కువ.
చికెన్ తినే పద్ధతి ఇది
జ్వరంతో ఉన్నప్పుడు మీకు తినే శక్తి ఉంటే హ్యాపీగా చికెన్ తినవచ్చు. అయితే జ్వరం వచ్చినప్పుడు చికెన్ ను కాస్త ప్రత్యేకంగా వండుకోవాలి. కారాన్ని, మసాలాను తగ్గించుకోవాలి. వేపుళ్ళ రూపంలో కాకుండా కూరలాగా ఉడకబెట్టి వండి తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఎక్కువ నూనెలో వేయించి మసాలాలు దట్టించి తింటే అది అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇతరత్రా సమస్యలు కూడా రావచ్చు. వీలైతే చికెన్ సూపును తయారు చేసుకుని తినేందుకు ప్రయత్నించండి. ఇందులో సూపుతో పాటు చికెన్ ముక్కలు కూడా ఉంటాయి. ఇలా చికెన్ సూప్ జ్వరంతో తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రోటీన్, ఫైబర్‌తో నిండుగా ఉండే ఈ చికెన్ సూప్ ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది.
జ్వరంగా ఉన్నప్పుడు నాలుక చప్పబడిపోతుంది. అలాంటివారు కారం, మసాలా తక్కువగా వేసుకుని చికెన్ కూరను తినాలి. అలా తింటే త్వరగా జ్వరం నుంచి బయటపడతారు.
జ్వరం వచ్చిన సమయంలో వీలైనంతవరకు ఇంట్లో వండిన చికెన్ వంటకాలకే ప్రాధాన్యత ఇవ్వండి. అంతేకానీ బయటనుంచి ఆర్డర్లో పెట్టుకొని తినేందుకు ప్రయత్నించకండి. వారు ఎలాంటి పదార్థాలను వేసి వండుతారో చెప్పడం కష్టం. అయితే చికెన్ తినడానికి పచ్చకామెర్లు రావడానికి మాత్రం మధ్య ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యకరమైన ఆహారంలో చికెన్ కూడా ఒకటి. కాబట్టి మీరు ఎప్పుడైనా దీనిని తినవచ్చు. కాకపోతే దాన్ని మీరు ఎలా తింటున్నారు అన్నదే మ్యాటర్. కారం మసాలా తగ్గిస్తే చికెన్ వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
జ్వరం వచ్చినప్పుడు నీరు స్థాయిలు తగ్గకుండా చూసుకోవాలి. ద్రవపదార్థాలను అధికంగా తీసుకోవాలి. రసం, సాంబారు వంటివి వేడివేడిగా తింటూ ఉండాలి. అల్లం టీ తాగడం వల్ల కూడా మీకు ఉపశమనంగా అనిపిస్తుంది. ప్రోటీన్ లోపం రాకుండా మాత్రం చికెన్ సూప్ వంటివి తాగుతూ ఉండాలి. మజ్జిగను అధికంగా తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. జ్వరం త్వరగా తగ్గిపోతుంది.
టాపిక్