Warangal and Hanmakonda: ఎట్టకేలకు హనుమకొండ, వరంగల్ జడ్పీల ఏర్పాటు, అర్బన్, రూరల్ జిల్లా పరిషత్తుల్లో మార్పులు-hanumakonda and warangal zps have been formed changes have been made in urban and rural zilla parishads ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal And Hanmakonda: ఎట్టకేలకు హనుమకొండ, వరంగల్ జడ్పీల ఏర్పాటు, అర్బన్, రూరల్ జిల్లా పరిషత్తుల్లో మార్పులు

Warangal and Hanmakonda: ఎట్టకేలకు హనుమకొండ, వరంగల్ జడ్పీల ఏర్పాటు, అర్బన్, రూరల్ జిల్లా పరిషత్తుల్లో మార్పులు

HT Telugu Desk HT Telugu
Nov 27, 2024 09:35 AM IST

Warangal and Hanmakonda: వరంగల్‌ జిల్లాలో జడ్పీల గందరగోళానికి తెరపడింది. హనుమకొండ జడ్పీ వరంగల్ అర్బన్ గా, వరంగల్ జడ్పీ వరంగల్ రూరల్ గా కొనసాగింది. దీంతో ప్రజలు, ప్రజా ప్రతినిధులతో పాటు ఆఫీసర్లలో కూడా గందరగోళం నెలకొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 హనుమకొండ, వరంగల్ జడ్పీల ఏర్పాటు
హనుమకొండ, వరంగల్ జడ్పీల ఏర్పాటు

Warangal and Hanmakonda: రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు హనుమకొండ, వరంగల్ జిల్లా ప్రజా పరిషత్తులను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలు ఏర్పాటు చేయగా.. ఆ తరువాత కొంత కాలానికి మండలాల మార్పులు, చేర్పులతో వాటి పేర్లు హనుమకొండ, వరంగల్ జిల్లాలుగా మార్చిన విషయం తెలిసిందే.

కానీ జడ్పీల్లో మార్పులు చేయకపోవడంతో ఇన్ని రోజులు హనుమకొండ జడ్పీ వరంగల్ అర్బన్ గా, వరంగల్ జడ్పీ వరంగల్ రూరల్ గా కొనసాగింది. దీంతో ప్రజలు, ప్రజా ప్రతినిధులతో పాటు ఆఫీసర్లలో కూడా గందరగోళం నెలకొంది. ఇప్పటికే జిల్లా ప్రజా పరిషత్తు పాలకవర్గాల గడువు ముగిసిపోవడం, తొందర్లోనే మళ్లీ ఎన్నికలు నిర్వహించనున్న తరుణంలో ప్రభుత్వం మారిన మండలాల పరిధిలోనే హనుమకొండ, వరంగల్ జిల్లా ప్రజా పరిషత్తులను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి జీవో ఎంఎస్ నెంబర్ 68ను విడుదల చేసింది.

ఇన్నిరోజులు రెండు జడ్పీల్లో గందరగోళం

రాష్ట్ర ప్రభుత్వం 2016లో జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఇందులో ఉమ్మడి వరంగల్ ను మొదట ఐదు జిల్లాలుగా విభజించింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను ఏర్పాటు చేయగా.. 2019లో మరోసారి జిల్లాల పునర్విభజన చేపట్టి ములుగు జిల్లాను కూడా ఏర్పాటు చేసింది.

ఉమ్మడి వరంగల్ లో ఆరు జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఇదిలాఉంటే వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల ఏర్పాటు సమయంలోనే కొంత అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రెండు జిల్లాలను ఒకటిగా చేయాలనే డిమాండ్లు వినిపించాయి. కానీ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల పేరునైనా మార్చాలనే వాదనలు వినిపించాయి.

దీంతో 2021 జూన్ లో హనుమకొండలో నిర్మించిన కలెక్టరేట్ ఓపెనింగ్ కోసం వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్.. రెండు జిల్లాల పేరును మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2021 ఆగస్టు 12న మండలాల మార్పులు, చేర్పులతో వరంగల్ అర్బన్ జిల్లాను హనుమకొండ జిల్లాగా, వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా మారుస్తూ ఆ వెంటనే ఉత్తర్వులు కూడా ఇచ్చారు. కానీ మండలాలు మారినా జడ్పీల విభజన జరగకపోవడంతో హనుమకొండ జడ్పీ వరంగల్ అర్బన్ గా, వరంగల్ జడ్పీ వరంగల్ రూరల్ గానే కొనసాగుతూ వచ్చాయి. దీంతో కొంతమేర గందరగోళం ఏర్పడింది.

ఎట్టకేలకు లైన్ క్లియర్

వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ రెండు జిల్లాల పరిధిలో మొత్తంగా 27 మండలాలు ఉన్నాయి. కాగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ నుంచి హనుమకొండ, వరంగల్ జిల్లాల ఏర్పాటు సమయంలో 14 మండలాలతో హనుమకొండ రెవెన్యూ జిల్లాగా ఏర్పాటైంది. 13 మండలాలతో వరంగల్ రూరల్ జిల్లా ఆవిర్భవించింది.

కానీ అప్పటికే జిల్లా పరిషత్తు పాలక మండళ్లు కొనసాగుతుండగా, ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయకుండానే పాత పద్దతిలోనే జడ్పీలను కొనసాగించింది. వాస్తవానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి హనుమకొండ జిల్లాలో వచ్చే రెండు మండలాలు, వరంగల్ జిల్లాకు చెందిన రెండు మండలాలను మినహాయించి ప్రత్యేకంగా 12 మండలాలతో హనుమకొండ, 11 మండలాలతో వరంగల్ జడ్పీలను ఏర్పాటు చేయాల్సి ఉంది.

కానీ ఇన్నిరోజులు జాప్యం జరగడంతో గందరగోళం కొనసాగింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో రెండు జిల్లా పరిషత్తుల్లో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. ప్రత్యేకంగా హనుమకొండ, వరంగల్ జిల్లా పరిషత్తులపై కూడా స్పష్టత వచ్చింది.

హనుమకొండలో 12, వరంగల్ లో 11 మండలాలు

హనుమకొండ జిల్లా పరిధిలో హనుమకొండ, కాజీపేట మండలాలు, వరంగల్ జిల్లా పరిధిలోని వరంగల్, ఖిలావరంగల్ మండలాలు పూర్తిగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయి. ఆ మండలాలు పోనూ హనుమకొండ జిల్లా పరిధిలో 12, వరంగల్ జిల్లా పరిధిలో 11 మండలాలు ఉన్నాయి. ఇప్పుడు అవే మండలాలలో జడ్పీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

దాని ప్రకారం హనుమకొండ జిల్లా పరిషత్తు పరిధిలో 12 మండలాలు ఉండగా.. అందులో ఐనవోలు, హసన్ పర్తి, ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర, శాయంపేట మండలాలు ఉన్నాయి. వరంగల్ జడ్పీ పరిధిలో 11 మండలాలు ఉండగా.. అందులో గీసుకొండ, సంగెం, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ మండలాలున్నాయి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner