Kitchen Tips: వంటగదిలోని పప్పులకు త్వరగా పురుగులు పట్టేస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి-are the pulses in the kitchen getting infested quickly follow these tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kitchen Tips: వంటగదిలోని పప్పులకు త్వరగా పురుగులు పట్టేస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి

Kitchen Tips: వంటగదిలోని పప్పులకు త్వరగా పురుగులు పట్టేస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి

Haritha Chappa HT Telugu
Nov 27, 2024 08:30 AM IST

Kitchen Tips: ఇంట్లో నిల్వ ఉంచిన పప్పులకు పురుగుల పట్టే సమస్య ఎక్కువ మంది ఎదుర్కొంటున్నదే. కందిపప్పు, శనగ పప్పు, పెసరపప్పు, బీన్స్, నట్స్ వంటి వాటికి పురుగులు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

పప్పులను నిల్వ చేసే పద్ధతి
పప్పులను నిల్వ చేసే పద్ధతి (pixabay)

ఇంటికి కావాల్సిన సరుకులను నెలకోసారి ఒకేసారి కొని పెట్టుకుంటారు ఎంతో మంది. కందిపప్పు, శెనగపప్పు, పెసరపప్పు, నట్స్, సీడ్స్, రాజ్మా వంటి బీన్స్ ను కొంటూ ఉంటారు. ఇవి లేనిదే వంట కూడా పూర్తికాదు, అయితే, నిల్వ చేసిన కొద్దిరోజులకే పప్పు డబ్బాల్లో పురుగులు కనిపిస్తూ ఉంటాయి. బీన్స్ వంటి వాటికి త్వరగా పురుగు పట్టేస్తుంది. పప్పుధాన్యాలలో పురుగులు పట్టడం వల్ల తినాలన్న ఆసక్తి కూడా రాదు. వాటిని శుభ్రపరిచేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అయితే, నిల్వ చేసిన పప్పులను పురుగుల నుండి దూరంగా ఉంచేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. కొన్ని వంటింటి చిట్కాలు పాటించడం ద్వారా పప్పు దినుసులు ఎక్కువ కాలం పాటూ తాజాగా నిల్వ ఉండేలా చేసుకోవచ్చు. వాటికి పురుగులు పట్టకుండా జాగ్రత్త పడవచ్చు. దీనికి ఎక్కువ ఖర్చు కూడా కాదు.

లవంగాలు

లవంగాలను పప్పులో వేసి కలపడం వల్ల కూడా పురుగులు పట్టవు. పైగా పప్పు మంచి సువాసన వస్తుంది. ముఖ్యంగా బీన్స్ వంటి రకాల్లో లవంగాలను కలపవచ్చు. లవంగాల నుంచి బలమైన వాసనకు అక్కడ పురుగు చేరలేదు. పప్పుధాన్యాలు ఉన్న కంటైనర్లో పప్పులతో పాటు సుమారు పది లవంగాలను వేసి కలిపేయండి. లవంగాలు సహజంగా కీటకాలను దూరంగా ఉంచడానికి, పప్పులు, కాయధాన్యాలను తాజాగా ఉంచటానికి సహాయపడతాయి.

వేపాకులు

వేపాకుల్లో చీడపీడలను దూరంగా ఉంచే గుణం ఉంటుంది. కొన్ని వేప ఆకులను ఎండబెట్టి ఆకుల్లోని తేమ పూర్తిగా పోయాక పప్పుల డబ్బాలో వేయండి. వేపాకులకు పురుగులను నిరోధించే సహజ గుణం ఉంటుంది. వేప ఆకుల మాదిరిగానే కరివేపాకులను కూడా వాడవచ్చు. వీటిిలో ఆ గొప్ప ఔషధ గుణం ఉంది.

వెల్లుల్లిలో

వెల్లుల్లి రెబ్బలను ఉపయోగించి కూడా పప్పులను కాపాడుకోవచ్చు. చిన్న చిన్న పురుగులు ఏర్పడకుండా వెల్లుల్లి నివారిస్తుంది. పొట్టు తీసిన వెల్లుల్లి రేకులను పప్పుల డబ్బాలో వేయాలి.పెద్ద సైజు కంటైనర్ లో పప్పు కోసం సుమారు అయిదు వెల్లుల్లి రెబ్బలు వేస్తే సరిపోతుంది. వెల్లుల్లి రెబ్బలు ఎండిపోగానే మళ్లీ వాటిని మార్చాలి. పచ్చి వెల్లుల్లిలోనే ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి.

ఎండు మిర్చిని ఉపయోగించి కూడా పప్పుదినుసుల్లో తెగుళ్ల బెడదను పొగొట్టుకోవచ్చు. ఎండుమిర్చిని పప్పులను నిల్వ ఉంచిన కంటైనర్లలో వేస్తే పురుగులు రావు. ఎండుమిర్చి నుంచి వచ్చే మంట పురుగులకు అలెర్జీలాగా అనిపిస్తుంది.

పప్పుధాన్యాలకు పురుగు పట్టకుండా ఉండేందుకు మార్కెట్లో కొన్ని రకాల కృత్రిమంగా తయారుచేసిన మాత్రలు అందుబాటులో ఉన్నాయి. అవి కిరాణా దుకాణాల్లో లభిస్తాయి. అవి మంచి ఫలితాలను ఇస్తాయి. వాటిని కొని పప్పుధాన్యాలు ఉన్న డబ్బాల్లో వేయాలి. అయితే ఈ మాత్రలు దేనితో తయారవుతాయో చూడాలి.

పప్పు దినుసుల్లో ఇప్పటికే పురుగు పట్టేస్తే వాటిని ఎర్రటి ఎండలో ఆరబెట్టాలి. అలా ఎండబెట్టి దానిపై ఒక పలుచటి వస్త్రాన్ని కప్పాలి. ఇలా చేయడం వల్ల పప్పుకు నేరుగా సూర్యరశ్మి తగలదు. కాబట్టి పప్పు చిన్న చిన్న ముక్కలుగా బద్దలవ్వకుండా ఉంటుంది. అలాగే వేడికి పురుగులు తొలగిపోతాయి. పప్పుధాన్యాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచాల్సి వస్తే పురుగు పట్టకపోయినా కూడా నెలకోసారి ఎండలో ఆరబెట్టడం మంచిది. ఇది పప్పుదినుసుల్లో తేమ చేరకుండా అడ్డుకుంటుంది. తద్వారా పురుగు పట్టకుండా నిరోధించవచ్చు.

Whats_app_banner