Cauliflower: కాలీఫ్లవర్ వండే ముందు ఇలా క్లీన్ చేశారంటే చిన్న చిన్న పురుగులు కూడా తొలగిపోతాయి
Cauliflower: కాలీఫ్లవర్ వండాలంటే భయపడేవారు ఎంతోమంది. దీనికి కారణం కాలీఫ్లవర్ లో ఉండే చిన్న చిన్న పురుగులు వాటిని ఎలా శుభ్రపరచాలో తెలియక ఇబ్బంది పడతారు.
కాలిఫ్లవర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దాన్ని వండాలంటే ఎంతో మందికి భయం. కాలీఫ్లవర్‌ని వండడం సులువే, కానీ దాన్ని శుభ్రపరచడమే కష్టం. కాలీఫ్లవర్‌లో చిన్న చిన్న పురుగులు చేరిపోతాయి. వాటిని జాగ్రత్తగా తీయాలంటే గంట పైనే సమయం పడుతుంది. అలా పువ్వంతా ఏరిన తర్వాతే వాటిని వండాల్సి ఉంటుంది. అందుకే అంత సమయాన్ని కేటాయించలేక ఎంతో మంది కాలీఫ్లవర్ వండటమే మానేస్తున్నారు. చిన్న చిట్కాల ద్వారా కాలీఫ్లవర్ లోని పురుగులను, బ్యాక్టీరియాలను, పరాన్న జీవులను తొలగించవచ్చు .
కాలీఫ్లవర్ ఎప్పుడు తెచ్చినా కూడా ఇక్కడ మేము చెప్పిన పద్ధతుల్లో క్లీన్ చేస్తే మీకు కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు కూడా తొలగిపోతాయి. కాలీఫ్లవర్ ను ఖచ్చితంగా శుభ్రం చేశాకే వండాలి. కాలీఫ్లవర్ లో చిన్న కీటకాలు, బ్యాక్టీరియా, ధూళి చాలా సులువుగా ఇరుక్కుపోతుంది. అందుకే దాన్ని శుభ్రం చేయకుండా ఉండకూడదు.
కాలీ ఫ్లవర్ క్లీనింగ్ చిట్కాలు
కాలీఫ్లవర్ లోని చిన్న చిన్న కీటకాలను తొలగించేందుకు ముందు ఒక గిన్నెలో నీరు వేయండి ఆ నీటిలో ఉప్పును కలపండి కాలీఫ్లవర్ ను అందులో వేయండి ఈ కాలీఫ్లవర్ మునిగేలా నీళ్లు ఉండాలి అప్పుడే అందులోని ఉన్న పురుగులు పైకి తేలిపోతాయి అలా తేలినప్పుడు ఆ పురుగులను తీసేయవచ్చు కాలీఫ్లవర్ను తలకిందులుగా ఈ చల్లటి ఉప్పు నీటిలో పావుగంట సేపు నానబెడితే అది శుభ్రపడిపోతుంది
గోరువెచ్చగా ఉండే నీటిని తీసుకొని అందులో పసుపు, ఉప్పు వేసి బాగా కలపండి. అలాగే కాలీఫ్లవర్ ని కూడా అందులో వేయండి. కాసేపటికే పురుగులు అవే బయటకు వచ్చేస్తాయి. మరికొన్ని తేలిపోతాయి. తీసి పడేయచ్చు.
కాలీఫ్లవర్ ను పెద్దపెద్ద పుష్పగుచ్చాల్లాగా కోసుకోవాలి. కొళాయి నీటిని వదిలి ఈ కాలీఫ్లవర్ ముక్కలను చేత్తో పట్టుకొని కాసేపు అలా ఉంచాలి. ఆ నీటి ధాటికి పురుగులన్నీ ప్రవాహంలో కొట్టుకొని పోతాయి.
మార్కెట్లో కూరగాయలను వాష్ చేసేందుకు ప్రత్యేకమైన ఉత్పత్తులు లభిస్తున్నాయి. వెజిటబుల్ వాష్ కొని వాటితో ఈ కాలీఫ్లవర్ ను శుభ్రపరచవచ్చు. ఈ వెజిటబుల్ వాష్‌ను నీళ్ళల్లో కలిపి కాలీఫ్లవర్ ను అందులో ఉంచి క్లీన్ చేయవచ్చు. లేదా వెజిటేబుల్ వాష్ ను ఈ కాలీఫ్లవర్ పై స్ప్రే చేస్తే కంటికి కనిపించని మురికి, పురుగు మందుల అవశేషాలు కూడా తొలగిపోతాయి. కొళాయి కింద ఈ కాలీఫ్లవర్ ను పెట్టి నీటిని వదలాలి. అప్పుడు కాలీఫ్లవర్‌లో ఉన్న అన్ని రకాల మురికి పోతుంది.
ఒక గిన్నెలో నీరు వేసి ఆ నీటిలో ఉప్పును కలపాలి. దాన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. మీరు బాగా వేడెక్కాక స్టవ్ కట్టేయాలి. ఆ తర్వాత కాలీఫ్లవర్ ను చిన్న ముక్కలుగా తరుక్కొని వాటిని అందులో వేయాలి. వేసినా కూడా కంటికి కనిపించని పరాన్న జీవులు, బ్యాక్టీరియాలు అన్నీ నశిస్తాయి. మళ్ళీ సాధారణ నీటిలో వేసి, వీటిని కడిగి తర్వాత వండేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎలాంటి బ్యాక్టీరియాలు, పరాన్న జీవులు ఆహారంలో ఉండవు.
ఒక గిన్నెలో నీళ్లు వేసి పది ఐస్ క్యూబ్స్ ను వేయండి. అందులో కాలీఫ్లవర్ ను నాలుగైదు ముక్కలుగా చేసి వేయండి. ఆ చల్లదనానికి పురుగులు మరణించి పైకి తేలిపోతాయి. ఆ తర్వాత వాటిని బయటకు తీసి కూరకు సరిపడే పరిమాణంలో చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వండుకుంటే ఉత్తమంగా ఉంటుంది.
పైన చెప్పిన పద్ధతుల్లో కాలీఫ్లవర్ ను వండుకోవాలి. అంతేకానీ పురుగులకు, పరాన్న జీవులకు, మురికికి భయపడి దాన్ని తినకుండా వదిలేయకూడదు. ఎందుకంటే దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.
కాలీ ఫ్లవర్లోని పోషకాలు
కాలీఫ్లవర్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువ. అంతేకాదు ఇది సీజనల్గా దొరికే కూరగాయ అంటే చలికాలంలోనే ఇది ఎక్కువగా లభిస్తుంది. క్రూసిఫెరస్ కూరగాయల కుటుంబానికి చెందిన ఈ కాలీఫ్లవర్ లో విటమిన్ లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకుంటాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి ఇది ఎంతో ప్రభావంతో పనిచేస్తుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా విటమిన్లు ఎంతో అవసరం. కాలీఫ్లవర్ లో మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు అన్నీ మన శరీరానికి అత్యవసరమైనవి.