Telangana Weather Updates : గజగజ వణికిస్తున్న చలి - డిసెంబర్ 1 నుంచి తెలంగాణలో వర్షాలు..!
Telangana Weather News : తెలంగాణలో చలి తీవ్రత మరింతగా పెరుగుతోంది. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నవంబర్ 30వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉండగా.. డిసెంబర్ 1వ తేదీ నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత మరింతగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో పది డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి కొన్ని రోజులుఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఇదిలా ఉంటే ఏజెన్సీ ప్రాంతాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. ఉదయం వేళలో పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
మంగళవారం ఆదిలాబాద్ లో అత్యల్పంగా 9.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మెదక్ లో 10.6 డిగ్రీల సెల్సియస్, పటాన్ చెరులో 11.2, రాజేంద్రనగర్ లో 12. 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఖమ్మంలో 31.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణలో ఇప్పటివరకు అత్యల్పంగా సోమవారం రాత్రి బేల మండల కేంద్రంలో 9.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ, రేపు కూడా పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
వైద్యారోగ్యశాఖ సూచనలు..
చలి తీవ్రతతో పాటు వాతావరణ పరిస్థితుల్లో మార్పుల దృష్ట్యా…తెలంగాణ ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలకు అవకాశం ఉంటుందని పేర్కొంది. జాగ్రత్తలను సూచించింది. తీవ్రమైన చలికి గురికావడం వల్ల హైపోథెర్మియాతో పాటు ఇమ్మర్షన్, పెర్నియో వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
గర్భిణిలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు ప్రస్తుత సీజన్ లో అతి జాగ్రత్తగా ఉండాలని వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది. చలి గాలిలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది,సరిపడా నీరు, పౌష్టికాహారం తీసుకోవాలని వివరించింది. జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి నీళ్లు కారటం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు. విటమిన్ సీ ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవాలని స్పష్టం చేసింది.
తెలంగాణకు వర్ష సూచన:
ప్రస్తుతం తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నవంబర్ 30వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
ఇక డిసెంబర్ 1వ తేదీ నుంచి తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. డిసెంబర్ 2, 3 తేదీల్లో కూడా వానలు పడొచ్చని పేర్కొంది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.