Brother Review: బ్రదర్ రివ్యూ - ఓజీ హీరోయిన్ నటించిన లేటెస్ట్ తమిళ్ మూవీ ఎలా ఉందంటే?
Brother Review:జయం రవి, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన కోలీవుడ్ మూవీ బ్రదర్ ఇటీవలే థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎమ్ రాజేష్ దర్శకత్వంలో ఫ్యామిలీ డ్రామా కథతో ఈ మూవీ రూపొందింది.
Brother Review: జయం రవి, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ మూవీ బ్రదర్ ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు ఎమ్ రాజేష్ దర్శకత్వం వహించాడు. రావురమేష్, భూమిక కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎలా ఉందంటే?
బ్రదర్ మూవీ కథ ఏంటంటే?
కార్తీక్ (జయం రవి) నిజాయితీ పరుడైన యువకుడు. తన కళ్ల ముందు అన్యాయం జరిగితే ఎంతటివారినైనా ఎదురిస్తుంటాడు. ఆ ప్రశ్నించేతత్వం వల్లే లా డిగ్రీని చివరి ఏడాదిలో వదిలేయాల్సివస్తుంది. తాను ఉండే అపార్ట్‌మెంట్ కమిటీ మెంబర్స్‌తో జరిగిన గొడవలో కార్తీక్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. కొడుకు గురించి అతిగా ఆలోచించి కార్తీక్ తండ్రి కుమారస్వామి హాస్పిటల్ పాలవుతాడు.
కార్తీక్ అక్కడే ఉంటే తండ్రి ఆరోగ్యం మరింత దెబ్బతింటుందని భావించిన అతడి అక్క ఆనంది (భూమిక చావ్లా) తన వెంట ఊటీ తీసుకుపోతుంది. ఆనంది మావయ్య శివగురునాథన్ (రావురమేష్) కలెక్టర్‌గా పనిచేస్తాడు.
భర్త అరవింద్ (నటరాజ సుబ్రమణియన్) ఫారెస్ట్ ఆఫీసర్. క్రమశిక్షణకు విలువనిచ్చే ఫ్యామిలీ. ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ నుంచి నిద్ర వరకు అన్నింటికి టైమ్‌టేబుల్ ఫిక్స్‌చేసుకొని దానిని ఫాలో అవుతుంటారు. అరవింద్ చెల్లెలు అర్చనతో (ప్రియాంక మోహన్) పాటు ఆనంది...కార్తీక్‌కు జాబ్స్ ఇప్పిస్తారు. కానీ గొడవలు పడి మొదటిరోజే ఉద్యోగం పోగొట్టుకుంటాడు కార్తీక్.
అరవింద్‌ను దారిలో పెట్టాలని ఫిక్సైన శివగురునాథన్ తన ఆఫీస్‌కు తీసుకెళతాడు. కానీ ఓ ఊరివాళ్ల సమస్యను పరిష్కరించడం కోసం శివగురునాథన్‌కు నచ్చని పనిచేస్తాడు కార్తీక్. ఆ విషయంలో కార్తీక్‌తో పాటు ఆనంది పెంపకాన్ని, వారి తల్లిదండ్రులను తక్కువచేసి మాట్లాడుతాడు శివగురునాథన్.
తమకు సారీ చెప్పేవరకు ఇంట్లో అడుగుపెట్టమని శివగురునాథన్, అరవింద్‌లతో కార్తీక్, ఆనంది ఛాలెంజ్ చేసి బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత ఏమైంది? తన వల్ల దూరమైన అక్క, బావలను కార్తీక్ తిరిగి ఎలా కలిపాడు?
శివ గురునాథన్ ఫ్యామిలీ రూల్స్ కారణంగా కార్తీక్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? కార్తీక్ మంచితనాన్నిఆనంది అత్తింటి వారు అర్థం చేసుకున్నారా? కార్తీక్, అర్చన పెళ్లికి శివగురునాథన్ అంగీకరించాడా? కార్తీక్ పుట్టుక గురించి కుమారస్వామి బయటపెట్టిన నిజం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.
మాస్, యాక్షన్ సినిమాలదే హవా…
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మాస్, యాక్షన్, యూత్‌ఫుల్ సినిమాల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. సక్సెస్ రేటు ఈ కథలకే ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీ కథలతో సినిమాలు చేసే దర్శకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. కుటుంబ అనుబంధాలు, అప్యాయతలతో కూడిన ఎలాంటి అశ్లీలతకు తావులేని సినిమాలు అరుదైపోయాయి. ఫ్యామిలీ కథలతో స్టార్ హీరోలు సినిమాలు చేయడం లేదనే అపవాదను దూరం చేయాలని అనుకున్నాడు కోలీవుడ్ హీరో జయం రవి. ఐడియా బాగున్నా...ఆచరణలో మాత్రం బ్రదర్ తేడా కొట్టేసింది...
నో డ్రామా...ఎమోషన్స్...
ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో కథ కంటే పాత్రల మధ్య ఎమోషన్‌ను బాగా రక్తికట్టాలి. ఆడియెన్స్ తమను తామూ కథ, పాత్రల్లో ఊహించుకునేంతగా డ్రామాను పండించేలా సన్నివేశాలు రాసుకోవాలి. అప్పుడే ఈ కుటుంబ కథలు వర్కవుట్ అవుతాయి. బ్రదర్‌లో అలాంటి మ్యాజిక్ ఎక్కడ కనిపించదు. అరే ఇది భలే ఉందే అని అనుకునే సీన్ ఒక్కటి కూడా దర్శకుడు రాసుకోలేకపోయాడు. సినిమా మొత్తం ఆర్టిఫీషియల్ సీన్స్‌తో డైలీ సీరియల్‌ను తలపిస్తుంది.
యాక్షన్, కామెడీ...
కార్తీక్ చేసే గొడవల వల్ల కుటుంబసభ్యులు ఎదుర్కొనే సమస్యలను ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటూ వెళ్లిపోయాడు డైరెక్టర్. వాటిలో నుంచి కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఏది సరిగా రాబట్టుకోలేదు. కావాలనే సిట్యూవేషన్‌ను క్రియేట్ చేసి సీన్స్ రాసుకున్నట్లుగా ఉంటాయి ఆ ఎపిసోడ్స్...
ఆనందిని అత్తింటికి దగ్గర చేసేందుకు కార్తీక్ వేసిన ప్లాన్స్ మొత్తం సిల్లీగా సాగుతాయి. వాటి కంటే డైలీ సీరియల్‌లో వచ్చే మలుపులే కాస్తంత బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. తండ్రి మాట జవదాటని అరవింద్.. స్కూల్ డ్రామా సీన్ తో ఒక్కసారిగా మారిపోవడం కామెడీగా అనిపిస్తుంది.
మైనస్ లే ఎక్కువ…
రావురమేష్‌ను విలన్‌గా ప్రొజెక్ట్ చేసే సీన్స్, అతడి రూల్స్ వల్ల ఫ్యామిలీ మెంబర్స్ పడే సంఘర్షణను సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయాడు. ఆనంది, కార్తీక్ బాండింగ్ సీన్స్‌ను ఎస్టాబ్లిష్ చేసే సీన్ ఒక్కటి కనిపించదు. లవ్‌స్టోరీ కూడా సోసోగానే ఉంది. వీటీవీ గణేష్ కామెడీ నవ్వించలేకపోయింది. చెప్పుకుంటూ పోతే బ్రదర్‌లో ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువగా ఉన్నాయి.
కొత్తదనం మిస్…
కార్తీక్ పాత్రలో జయం రవి కామెడీ టైమింగ్ బాగుంది. ఎమోషనల్ సీన్స్‌లో ఓకే అనిపించాడు. కానీ నటుడిగా కొత్తదనం, ఛాలెంజెస్ మాత్రం ఈ క్యారెక్టర్‌లో కనిపించవు. హీరోయిన్‌కు తక్కువ...క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కు ఎక్కువ అన్నట్లుగా ప్రియాంక అరుళ్ మోహన్ పాత్ర సాగుతుంది. రూల్స్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చే తండ్రి పాత్రలను రావురమేష్ తెలుగులో చాలానే చేశాడు. భూమిక, శరణ్యతో పాటు మిగిలిన క్యారెక్టర్స్ రొటీన్‌గానే ఉన్నాయి.
ఔట్‌డేటెట్ ఫ్యామిలీ డ్రామా…
బ్రదర్ ఔట్‌డేటెట్ ఫ్యామిలీ డ్రామా మూవీ. డైలీ సీరియల్‌ను తలపించే ఎమోషన్స్, సీన్స్‌తో ఓపికకు పరీక్షగా నిలుస్తుంది.
టాపిక్