Operation Chabutra : అర్ధరాత్రి వేళ 'ఆపరేషన్ చబుత్ర' - ఆకతాయిల ఆటకట్టించిన నల్గొండ పోలీసులు
ఆపరేషన్ చబుత్ర తో నల్గొండ జిల్లా పోలీసులు ఆకతాయిల ఆటకట్టించారు.అర్థరాత్రి వేళ పకడ్బందీగా ఆపరేషన్ చబుత్రను చేపట్టారు. ఆవారా గా తిరుగుతున్న 84 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. 48 బైకులు, 5 కార్లు, 3 ఆటోలు, 80 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 24 డ్రంకెన్ డ్రైవ్ కేస్ లు నమోదయ్యాయి.
అర్ధరాత్రి పూట ఆవారాగా తిరుగుతున్న ఆకతాయిల ఆటకట్టించేందుకు నల్గొండ పోలీసులు కొత్త ఆపరేషన్ మొదలు పెట్టారు. ఆపరేషన్ చబుత్ర పేరున చేపట్టిన ఆపరేషన్ లో అర్ధరాత్రిళ్లు ఆరుబయట అరుగుల మీద కూర్చొని బాతాకానీలు కొడుతున్న ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు.
మంగళవారం అర్థరాత్రి నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి, వన్ టౌన్, టూ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నలుగురు సిఐలు, 12 మంది ఎస్సైలు, 80 మంది కానిస్టేబుల్ మొత్తం 10 చెకింగ్ బృందాలుగా, 10 పెట్రోలింగ్ పార్టీలుగా నల్గొండ పట్టణాన్ని అష్టదిగ్బంధం చేశారు. రోడ్లపై అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతూ అనుమానాస్పదంగా ఉన్న 84 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ చేశారు. వీరందరి నుంచి 48 బైకులు, 5 కార్లు, 3 ఆటోలు, 80 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన 24 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.
ఆవారా ఆకతాయిలకు కౌన్సిలింగ్
అర్ధరాత్రి అరుగుల (చబుత్ర) మీద బాతకానీలు కొడుతూ, రోడ్లమీద ఇష్టానుసారం బైకులపై తిరుగుతూ కాలనీ వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. తప్ప తాగి వాహనాలపై తిరుగుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ.. గొడవలు సృష్టిస్తున్న, అనుమానస్పదంగా రోడ్లపై తిరుగుతున్న వారిని ఉపేక్షించమని పోలీసు అధికారులు హెచ్చరించారు. అలాగే ఇప్పుడు జరుగుతున్న నేరాల్లో ముఖ్యంగా మైనర్లు, 30 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లే అధికంగా ఉంటున్నారని, వీళ్లకు కౌన్సిలింగ్ ఇస్తామని ప్రకటించారు.
‘‘ నల్గొండ పట్టణాన్ని నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. దీనికి పట్టణ వాసులు సహకరించాలి..’’ అని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి కోరారు. మంగళవారం రాత్రి పట్టుబడిన వారందరినీ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని టిటిఐ సెంటర్ లో వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి సమయంలో ఎలాంటి కారణం లేకుండా ఆవారాగా తిరగడం, తాగి వాహనం నడపడం వల్ల జరిగే నష్టాల గురించి మరో సారి కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )
సంబంధిత కథనం