Phone Tapping Case: ఉమ్మడి నల్గొండ జిల్లా చుట్టూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు-phone tapping case around joint nalgonda district notices to three former mlas ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Phone Tapping Case: ఉమ్మడి నల్గొండ జిల్లా చుట్టూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు

Phone Tapping Case: ఉమ్మడి నల్గొండ జిల్లా చుట్టూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు

HT Telugu Desk HT Telugu
Nov 13, 2024 09:25 AM IST

Phone Tapping Case: ఉమ్మడి నల్గొండ జిల్లా చుట్టూ ఫోన్‌ ట్యాప్‌ కేసు దర్యాప్తు సాగుతోంది.జిల్లాకు చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.గురువారం పోలీసుల ఎదుట నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరు కానున్నారు. భువనగిరి, కోదాడ మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు అందాయి.

నల్గొండ మాజీ ఎమ్మెల్యేల చుట్టూ ఫోన్ ట్యాపింగ్ కేసు
నల్గొండ మాజీ ఎమ్మెల్యేల చుట్టూ ఫోన్ ట్యాపింగ్ కేసు

Phone Tapping Case: పదేళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్న అప్పటి పాలక పక్షం, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మాజీ ఎమ్మెల్యేలు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. రాష్ట్రాన్ని కుదుపు కుదిపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇన్నాళ్లూ ఇది కేవలం పోలీసు అధికారులకే పరిమితం అవుతుందనుకున్నా.. తాజాగా, ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్న బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలకూ నోటీసులు జారీ అవుతున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నిక సమయం నుంచే ఫోన్ ట్యాపింగ్ పై నాటి బీఆర్ఎస్ పాలకులు బాగానే ఆధారపడ్డారని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇపుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి నల్గొండ జిల్లా నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది.

జిల్లాకు చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్న ఎస్.ఐ.బి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గతంలో నల్గొండ ఎస్పీగా పనిచేసిన వారే. ఇదే కేసులో ప్రస్తుతం జైళ్ళోనే ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న జిల్లాలో వివిధ స్థాయిలో సర్వీసులో పనిచేసిన వారే. వీటికి తోడు 2021 ఆఖరులో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు కళ్లెం వేసేందుకు ముఖ్య నాయకుల ఫోన్లన్నీ ట్యాప్ చేశారన్న ఆరోపణల నేపథ్యం... జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), పైళ్ల శేఖర్ రెడ్డి (భువనగిరి), బొల్లం మల్లయ్య యాదవ్ (కోదాడ) లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

వీరిలో చిరుమర్తి లింగయ్యకు తొలుత నోటీసు ఇవ్వగా, ఆయన గురువారం (14వ తేదీ) పోలీసు ఎదుట హాజరు కానున్నారు. జిల్లాలో మునుగోడు ఎన్నికల సమయంలో మొదలైన ట్యాపింగ్ వ్యవహారం 2023 శాసన సభ ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో అమలైందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న తో నిత్యం ఫోన్ సంభాషణలు జరిపిన వారిలో గుర్తించిన మాజీ ఎమ్మెల్యేలలో తొలుత జిల్లాకు చెందిన ముగ్గురితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే , ప్రభుత్వ మాజీ విప్ గువ్వల బాలరాజు పేరు కూడా బయటకు రావడంతో నోటీసులు ఇచ్చారు.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో వెలుగులోకి ఫోన్ ట్యాపింగ్

మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలోనే బీజేపీ తమ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్లాన్ చేసిందని బీఆర్ఎస్ పసిగట్టి బీజేపీ నాయకులను ట్రాప్ చేసింది. వీరి సంభాషణలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా రికార్డు చేయడంతో పాటు, ఉచ్చు పన్ని ఓ ఫాం హౌజ్ కు బీజేపీ నాయకలు, ఢిల్లీకి చెందిన మధ్యవర్తులు అక్కడకు వచ్చేలా చేసి రికార్డు చేసి పోలీసు దాడులు చేయించింది.

మునుగోడు ఉప ఎన్నిక రావడానికి ప్రధాన కారణం బీజేపీ అన్న కారణంతో , బీజేపీ దూకుడుకు ఆ ఎన్నికల్లో బ్రేక్ వేసేందుకు ప్లాన్ చేసింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రాజీనామా చేయించడం ద్వారా ఉప ఎన్నికుకు బీజేపీ పథక రచన చేసింది. అప్పటికే తెలంగాణలో జరిగిన హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా గెలవడం ద్వారా, కొందరు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుపోవడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకుంది.

ఈ కారణంగానే ఒక వైపు బీజేపీ ప్లాన్ తిప్పికొట్టి ఆ పార్టీని డిఫెన్స్ లో పడేసేలా ఫాం హౌజ్ ఆపరేషన్ అమలు చేసింది. మునుగోడు లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ లను అడ్డుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ పార్టీ నేతల కదలికలపై నిఘా పెట్టింది.

2023 ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్..?

తెలంగాణలో కాంగ్రెస్ కు మంచి పట్టున్న జిల్లాల్లో నల్గొండ ముఖ్యమైంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కూడా ఆ పార్టీ తన మిత్రపక్షం సీపీఐతో కలిపి 6 స్థానాలు, అంటే సగం నియోజకవర్గాలు దక్కించుకుంది. 2018 ఎన్నికల్లో సైతం 3 చోట్ల గెలిచి సత్తా చాటడందో పాటు ఉమ్మడి జిల్లాల్లోని రెండు లోక్ సభా నియోజకవర్గాలనూ కైవసం చేసుకుంది.

దీంతో 2023 ఎన్నికల్లో ఆ పార్టీని అడ్డుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ పై ఎక్కువగా ఆధారపడినట్టు కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదనపు ఎస్పీ తిరుపతన్నతో నిత్యం టచ్ లో ఉండి ప్లాన్ అమలు చేసిన వారిలో ఇపుడు ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. ఆయన తన ఫోన్లోని సమాచారాన్ని అంతా డిలెట్ చేసినా.. పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఆయన ఫోన్ నుంచి తిరిగి సమాచారాన్ని రాబట్టారు.

దీంతో ఈ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల సంభాషణల విషయం బయటకు వచ్చిందంటున్నారు. ప్రతిపక్ష నేతల కదలిలకలను గమనించడం, విపక్ష పార్టీల అభ్యర్థుల డబ్బు రవాణాను బ్రేక్ చేయడం, తమ డబ్బులను గ్రామ స్థాయి వరకు ఎలాంటి తనిఖీలు, ఇబ్బందుల్లేకుండా పంపిణీ చేసుకోవడం వంటి పనులను జిల్లా బీఆర్ఎస్ కు చెందిన కొందరు నాయకులు పూర్తి చేశారని విధితమవుతోంది. అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకే పరిమితం అవుతుందా..? ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉందా..? అన్న ప్రశ్నలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

( రిపోర్టింగ్: క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )

Whats_app_banner