Teenmar Mallanna: నల్గొండ కాంగ్రెస్‌లో.. తీన్మార్ మల్లన్న చిచ్చు, మిర్యాలగూడ కాంగ్రెస్ బీసీ లీడర్ల తిరుగుబాటు-teenmar mallanna dispute in miryalaguda congress bc leaders revolt ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Teenmar Mallanna: నల్గొండ కాంగ్రెస్‌లో.. తీన్మార్ మల్లన్న చిచ్చు, మిర్యాలగూడ కాంగ్రెస్ బీసీ లీడర్ల తిరుగుబాటు

Teenmar Mallanna: నల్గొండ కాంగ్రెస్‌లో.. తీన్మార్ మల్లన్న చిచ్చు, మిర్యాలగూడ కాంగ్రెస్ బీసీ లీడర్ల తిరుగుబాటు

HT Telugu Desk HT Telugu
Nov 06, 2024 05:34 AM IST

Teenmar Mallanna: నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఆదివారం మిర్యాలగూడలో జరిగిన బీసీ గర్జన సభలో చేసిన ప్రసంగం కాంగ్రెస్‌ పార్టీలో దుమారం లేపుతోంది. ఆయన ఒకవైపు బీసీ నినాదం వినిపిస్తూనే మరోవైపు కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు.

తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై నల్లగొండ జిల్లాలో ఆందోళన
తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై నల్లగొండ జిల్లాలో ఆందోళన

Teenmar Mallanna: తీన్మార్‌ మల్లన్న బీసీ నినాదం వినిపిస్తూనే మరోవైపు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, మిర్యాలగూడ స్థానిక ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి పై తీవ్రమైన విమర్శలు చేయడం కలకలం రేపింది.

ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరి ఓసి సిఎం కావాలని , మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని తాను దగ్గరుండి ఓడించి బీసీలను గెలిపిస్తానని పేర్కొన్నారు. బీసీ గర్జన సభ సహజంగానే కాంగ్రెస్‌ల చర్చనీయాంశమైంది.

స్వపక్షంలో .. విపక్షం

గత కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తున్నారు. మిర్యాలగూడ బహిరంగ సభ వేదికపై నుంచే ఆయన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కూడా విమర్శలు చేశారు. పొంగులేటికీ ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి సమకూరాయని, కాంట్రాక్టులను పొంది పందికొక్కులా దోచుకు తిన్నారంటూ తీవ్రమైన ఆరోపణ చేశారు.

దీనిపై సోమవారం నల్గొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ నాయకులంతా దగ్గరుండి పనిచేస్తేనే కాంగ్రెస్ బీఫా‌‌మ్ పై ఎమ్మెల్సీగా మల్లన్న విజయం సాధించారని, పార్టీ నేతలపై ఆయన చేసిన ఆరోపణలు సమంజసం కాదని పేర్కొన్నారు.

మిర్యాలగూడ కాంగ్రెస్‌ బీసీ నేతల ఎదురు దాడి

మంగళవారం మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ లని బీసీ నేతలు అంతా తీన్మార్ మల్లన్న చర్యను తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద ర్యాలీనే తీశారు. పీసీసీ నాయకత్వం మల్లన్న పై చర్యలు తీసుకోవాలని, జిల్లా కాంగ్రెస్‌లో, సీనియర్ నేతలు కుందూరు జానారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లను విమర్శించడం సరికాదని మిర్యాలగూడ కాంగ్రెస్త బీసీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారంతా మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశమై ర్యాలీని జరిపి తమ నిరసన వ్యక్తం చేశారు.

తీన్మార్ మల్లన్నకు సీఎం రేవంత్ మందలింపు..?

మరోవైపు మిర్యాలగూడ బహిరంగ సభను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం మల్లన్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం . పార్టీలో ఉంటూ స్వపక్షంలో విపక్షంలో వ్యవహరిస్తూ పార్టీ సీనియర్ నేతలను విమర్శిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న చర్చ కూడా జరిగిందని సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను మందలించినట్లుగా మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. పట్టపద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో తనను ఓడించడానికి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ప్రయత్నించారని, అయినా తాను బీసీ బిడ్డల ఓట్లతో మాత్రమే గెలిచానని ప్రకటించుకుని ఇక్కడి కాంగ్రెస్ నాయకుల పనితీరును తప్పుపట్టారు .

అదే మాదిరిగా ఏ ఎన్నికల్లోనైనా తనకు ఓసీ ఓట్లు అక్కరలేదని, 56 శాతంగా ఉన్న బీసీల ఓట్లతో తాను గెలుస్తానని పేర్కొన్నారు. బీసీల ఓట్లు అక్కరలేదు, తాము ఓసి ఓట్లతో గెలుస్తామని ఓసీనేతలు ప్రకటించగలరా అని సవాల్ కూడా చేశారు. ఒక విధంగా ఆయన కాంగ్రెస్‌లో ఉంటూ, కాంగ్రెస్ నేతలని దూషిస్తూ సవాలు చేసిన వ్యవహారం చర్చనీయాంశమైంది.

ఈ అంశాలన్నింటి నేపథ్యంలోనే మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ బీసీ నాయకులు తమ పార్టీ నేతలపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాలన్నీ ప్రస్తుతం నల్గొండ కాంగ్రెస్ లో బీసీ నాయకుల మధ్య చిచ్చుపెట్టినట్టు కనిపిస్తున్నదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ , హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )

Whats_app_banner