New Telugu Movie on OTT: చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి నిఖిల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే?
Appudo Ippudo Eppudo OTT: థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే నిఖిల్ సిద్ధార్థ కొత్త సినిమా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఇంతకీ ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోందంటే?
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మూవీ చడీచప్పుడు లేకుండా ఓటీటీలో ప్రత్యక్షమైంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 8న థియేటర్లలో రిలీజైంది. కానీ.. తొలిరోజు ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. రెండు రోజులలోనే డిజాస్టర్‌గా మిగిలిపోయి థియేటర్లలో మాయమైపోయింది. కానీ.. బుధవారం ఓటీటీలో ప్రత్యక్షమై.. ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది.
నిఖిల్ సిద్ధార్థకి జోడీగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలో రుక్మిణీ వసంత్, దివ్యాంశ కౌశిక్ నటించారు. అలానే జాన్ విజయ్, అజయ్, హర్ష చెముడు, సత్య, సుదర్శన్ తదితరులు ఈ మూవీలో ఉన్నా.. ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌కాగా.. కార్తీక్ సంగీతం అందించారు.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కథ ఏంటంటే?
రేసర్ కావాలని కలలు కనే రిషి (నిఖిల్ సిద్ధార్థ్).. తార (రుక్మిణి వసంత్)ని ప్రేమిస్తాడు. కానీ.. తార అతని ప్రేమని ఒప్పుకోదు. దాంతో తన రేసర్ కల సాధన కోసం లండన్‌కి రిషి వెళ్లి అక్కడ తులసి (దివ్యాంశ కౌశిక్)ను ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడి గుడికి వెళ్తే..అక్కడ తులసి మాయమవుతుంది. తులసి ఎక్కడికి వెళ్లింది? తొలుత రిషిని రిజెక్ట్ చేసిన తార లండన్‌కి ఎందుకొస్తుంది? అక్కడ లోకన్ డాన్ బద్రీ నారాయణ్ (జాన్ విజయ్) ఎందుకు రిషి వెంట పడతాడు అనేది కథ.
ప్రేమ కథకి క్రైమ్ థ్రిల్లర్‌ను జోడించి దర్శకుడు చెప్పాలని ప్రయత్నించారు. కానీ.. ఈ క్రమంలో వచ్చే వరుస ట్విస్ట్‌లు.. ప్రేక్షకులకి థ్రిల్ ఇవ్వకపోగా తికమక పెట్టేస్తాయి. కథ, కథనంలో బలం లేకపోవడంతో.. ప్రేక్షకుల ఆదరణకి నోచుకోలేకపోయింది. దాంతో విడుదలైన రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ థియేటర్ల నుంచి మాయమైపోయింది.
వాస్తవానికి నిఖిల్ సిద్ధార్థ కార్తికేయ -2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ.. ఆ మూవీ తర్వాత వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్‌గా మిగులుతున్నాయి. ఈ మూవీ కంటే ముందు వచ్చిన స్పై మూవీ కూడా తేలిపోయింది.
ఓటీటీలో నిఖిల్ క్రేజ్
థియేటర్లలో ఫెయిలైన నిఖిల్ సినిమాలు ఓటీటీలో మాత్రం బాగా ఆదరణకి నోచుకుంటున్నాయి. అందుకే కాబోలు.. థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోనే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాని ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‌కి ఉంచేసింది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టపడే వారు చూడొచ్చు.