Jasprit Bumrah: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నెం.1గా జస్‌ప్రీత్ బుమ్రా.. విరాట్ కోహ్లీ, యశస్వి జైశ్వాల్ కూడా పైపైకి
ICC Test Rankings: పెర్త్ టెస్టులో 8 వికెట్లు పడగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ నెం.1గా నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో సెంచరీలు బాదిన కోహ్లీ, యశస్వి జైశ్వాల్‌కి పైకి ఎగబాకారు. కానీ.. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం..?
ICC Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ మళ్లీ నెం.1 స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా ఇటీవల ముగిసిన తొలి టెస్టులో 8 వికెట్లు పడగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలుపైకి ఎగబాకి 883 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్‌గా కూడా బుమ్రా నిలిచాడు.
అశ్విన్, జడేజాలకీ మెరుగైన ర్యాంక్‌లు
దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ (872), ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ (860) ఒక్కో స్థానం కిందకి దిగజారారు. పెర్త్ టెస్టులో ఆడకపోయినా.. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో చోటుని నిలబెట్టుకున్నారు. పెర్త్ టెస్టులో మొత్తం ఐదు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి 25వ స్థానానికి చేరుకున్నాడు.
ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 2 స్థానాలు పైకి ఎగబాకి.. రెండో స్థానానికి చేరుకున్నాడు. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాపై యశస్వి జైశ్వాల్ (161పరుగులు) భారీ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ 903 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు.
కోహ్లీతో పాటు రాహుల్ కూడా పైపైకి
భారత్ నుంచి రిషబ్ పంత్ మాత్రమే యశస్వితో కలిసి టాప్-10లో చోటు దక్కించుకోగా.. పెర్త్ టెస్టులో సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ ఏకంగా 9 స్థానాలు పైకి ఎగబాకి 13వ ర్యాంక్‌కి చేరుకున్నాడు. ఈ ఏడాదిలో విరాట్ కోహ్లీకి ఇదే తొలి శతకం. అలానే హాఫ్ సెంచరీ బాదిన కేఎల్ రాహుల్ కూడా 13 స్థానాలు ఎగబాకి 49వ స్థానంలో నిలిచాడు.
గాయంతో ఆస్ట్రేలియాపై పెర్త్ టెస్టులో ఆడని శుభమన్ గిల్ ఒక స్థానాన్ని కోల్పోయాడు. 18 నుంచి గిల్ 17వ స్థానానికి పడిపోయాడు. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడలేకపోయినా ర్యాంకింగ్స్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.. అతను 26వ స్థానంలోనే ఉన్నాడు.
అడిలైడ్ టెస్టుకి రోహిత్, గిల్ రీఎంట్రీ
భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. పెర్త్ టెస్టులో ఏకంగా 295 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా.. ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-0తో ఆధిక్యంలో ఉంది. అడిలైడ్ టెస్టుకి రోహిత్ శర్మ, శుభమన్ గిల్ కూడా రీఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో పెర్త్ టెస్టులో ఫెయిలైన దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్‌పై వేటు పడే అవకాశం ఉంది.