Rice Vada: మినప్పప్పు గారెలే కాదు, ఒకసారి రైస్ గారెలు వండి చూడండి కొబ్బరి చట్నీతో అదిరిపోతాయి
Rice Vada: ప్రతి ఇంట్లో అన్నం మిగిలిపోవడం జరుగుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఆ అన్నాన్ని పడేయకుండా రైస్ గారెలు చేసేందుకు ప్రయత్నించండి. దీని రెసిపీ చాలా సులువు.
గారెలు అంటే ఇష్టమా? ఓసారి కొత్తగా రైస్ గారెలు తిని చూడండి. అంటే వండిన అన్నంతో చేసే గారెలు ఇవి. ప్రతిసారీ మినప్పప్పు గారెలు తిని బోర్ కొడితే క్రంచీగా, క్రిస్పీగా ఉండే రైస్ వడ ప్రయత్నించండి. అన్నం మిగిలిపోయినప్పుడు వాటిని గారెల్లా మార్చుకొని వేసుకోవచ్చు. దీని రెసిపీ ఎలాగో తెలుసుకుంటే ఎప్పుడు అన్నం వృధా చేయాల్సిన అవసరం రాదు. అన్నం తినాలనిపించినప్పుడు కూడా వండిన అన్నాన్ని గారెల్లా మార్చుకోవచ్చు. రైస్ వడ రెసిపీ ఎలాగో తెలుసుకుందాం.
రైస్ గారెలు రెసిపీకి కావలసిన పదార్థాలు
వండిన అన్నం - రెండు కప్పులు
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
కరివేపాకులు తరుగు - ఒక స్పూను
జీలకర్ర - అర స్పూను
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
టమోటోలు తరుగు - పావు కప్పు
క్యాప్సికం తరుగు - పావుకప్పు
క్యాబేజీ తరుగు - పావు కప్పు
కారం - ఒక స్పూన్
పెరుగు - ఒక కప్పు
కొబ్బరి తురుము - ఒక కప్పు
అల్లం పచ్చిమిర్చి పేస్టు - రెండు స్పూన్లు
రైస్ గారెలు రెసిపీ
1. ఒక గిన్నెలో పెరుగు వేయాలి. ఆ పెరుగులోనే మిగిలిపోయిన అన్నాన్ని కూడా వేయాలి.
2. అన్నం మరీ గట్టిగా ఉంటే మిక్సీలో వేసి ఒకసారి మెత్తగా రుబ్బుకొని ఇందులో వేస్తే మంచిది.
3. దీన్ని గారెల పిండిలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కలపాలి.
4. అలాగే టమోటో తరుగును, క్యాప్సికం తరుగును, క్యాబేజీ తరుగను, అల్లం పచ్చిమిర్చి పేస్ట్‌ను, కారం, కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, కరివేపాకుల తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
5. ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.
7. ఆ నూనె వేడెక్కాక పిండి మిశ్రమం నుంచి కొంత ముద్దను తీసి గారెల్లా వత్తుకుని నూనెలో రెండు వైపులా కాల్చుకోవాలి.
8. అంతే టేస్టీ అన్నం గారెలు రెడీ అయినట్టే.
9. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది.
10. ఇందులో ఉన్నవన్నీ తేలికపాటి పదార్థాలే కాబట్టి ఇవి త్వరగా ఉడికిపోతాయి.
11. ఎక్కువ సేపు ఉంచితే నల్లగా మారిపోయే అవకాశం ఉంది.
12. మినప్పప్పుతో పోలిస్తే వండిన అన్నం త్వరగా నూనెలో వేగిపోతుంది.
13. కాబట్టి రెండు మూడు నిమిషాలకే గారెలను అందులోంచి తీసేయడం ఉత్తమం.
రాత్రిపూట అన్నం మిగిలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉదయం పూట దాన్ని తినేందుకు ఎవరూ ఇష్టపడరు. అలాంటప్పుడు అన్నంతో ఇలా రైస్ గారెలు చేసేందుకు ప్రయత్నించండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేసుకుని తింటే మీకు వీటి రుచి తెలుస్తుంది.
టాపిక్