దీపావళి అంటేనే ప్రత్యేకంగా స్వీట్లను పంచే పండగ. దీపావళినాడు ఇంట్లోనే చాలా సులువుగా ఎలాంటి స్వీట్లు వండాలో తెలుసుకోండి. ఇక్కడ మేము కొబ్బరి కోవా, బాదం బాసుంది రెసిపీలు ఇచ్చాము. ఈ రెండూ చేయడం చాలా సులువు. రుచిలో కూడా ఈ అద్భుతంగా ఉంటాయి. లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా సమర్పించవచ్చు.
కోవా - ఒకటిన్నర కప్పు
తాజా కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పు
బెల్లం తురుము - ముప్పావు కప్పు
పంచదార - ఐదు స్పూన్లు
యాలకుల పొడి - అర స్పూను
నెయ్యి - ఒక స్పూను
1. స్టవ్ మీద కళాయి పెట్టి కొబ్బరిని, బెల్లాన్ని వేసి వేయించాలి.
2. బెల్లం కరిగి కొబ్బరితో కలిసి మందంగా మారేవరకు ఉంచాలి.
3. ఆ సమయంలోనే నెయ్యిని, యాలకుల పొడిని కూడా వేసి ఓసారి కలుపుకోవాలి.
4. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లార్చాలి. ఈ బెల్లం మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు మిక్సీలో పంచదారని వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
6. స్టవ్ మీద కళాయి పెట్టి కోవా ముద్దను వేయాలి.
7. దీన్ని చిన్న మంట మీద ఐదు నిమిషాలు పాటు వేయించాలి.
8. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఆ కోవాలో ఒక గిన్నెలోకి వేసి చల్లారనివ్వాలి.
9. ఆ కోవాలోనే పంచదార పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
10. కాస్త వేడిగా ఉన్నప్పుడే పంచదారను కలిపితే పంచదార త్వరగా కోవాలో కలిసిపోతుంది.
11. ఇప్పుడు చేతులకి నెయ్యి రాసుకొని కోవా పిండిని చిన్న ముద్దలా చేసుకోవాలి.
12. ఒక ముద్దను తీసుకొని చేతితోనే చిన్న పూరీలా ఒత్తుకోవాలి.
13. మధ్యలో కొబ్బరి లడ్డూని పెట్టి చుట్టూ అంచులను మూసేసి చేత్తోనే లడ్డూల్లా చుట్టుకోవాలి.
14. అంతే టేస్టీ కొబ్బరి కోవా రెడీ అయినట్టే.
15. దీన్ని చేయడం చాలా సులువు. పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. ఈ స్వీట్ రెసిపీని దీపావళి నాడు అమ్మవారికి సమర్పించి ప్రసాదంలా పంచండి.
బాదం పప్పులు - ఒక కప్పు
పంచదార - అరకప్పు
కోవా - 50 గ్రాములు
యాలకుల పొడి - ఒక స్పూను
పాలు - అర లీటరు
1. ఈ బాదం బాసుంది రెసిపీని చేయడానికి ముందుగా రాత్రి పూటే బాదంపప్పు నానబెట్టాలి.
2. ఉదయం లేచాక బాదం తొక్కను తీసేసి వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. పాలను ముందే మరిగించి పెట్టుకోవాలి.
4. ఈ పాలను బాదం పేస్ట్ లో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీలో రుబ్బుకోవాలి.
5. స్టవ్ మీద కళాయి పెట్టి మిగిలిన పాలను కూడా వేయాలి.
6. ఆ పాలు మరుగుతున్నప్పుడే బాదం పేస్ట్ ను వేసి కలుపుకోవాలి.
7. అందులోనే కోవా, పంచదార, యాలకుల పొడి పోసి చిన్న మంట మీద వేడి చేయాలి.
8. ఈ మొత్తం మిశ్రమం చిక్కబడే దాకా ఉంచాలి.
9. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారపెట్టాలి.
10. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి ఫ్రిజ్లో రెండు గంటల పాటు ఉంచాలి. ఆ తర్వాత సర్వ్ చేయాలి.
11. పైన గార్నిషింగ్ కోసం పిస్తా తరుగు, బాదం తరుగు, జీడిపప్పులు తరుగును వేసుకోవచ్చు. ప్రసాదంగా నివేదించాలనుకుంటే దీని వేడి తగ్గాక నేరుగా పూజలో నైవేద్యంగా పెట్టవచ్చు.