Leafy Vegetable Curry: పాలకూర, తోటకూరలతో వండే కూరల్లో చిన్న చేదు వస్తోందా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
Leafy Vegetable Curry: ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రతిరోజూ ఆకుకూరలు తిన్నా మంచిదే. కానీ అవి వండాక చిన్న చేదు రావడం, పచ్చి వాసన వస్తుండడంతో ఎక్కువ మంది ఇష్టపడడం లేదు.
శీతాకాలం ప్రారంభం రకరకాల ఆకుకూరలు పండుతాయి. ముఖ్యంగా పాలకూర, తోటకూర అధికంగా పండుతుంది. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇవే కాదు, వివిధ రకాల ఆకుకూరలు మార్కెట్లోకి రావడం ప్రారంభమవుతాయి. తాజా ఆకుకూరలతో వండిన కూరలు తినడం వల్ల శరీరానికి, మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సీజన్ లో పాలకూర అధికంగా తింటారు. భారతదేశమంతా ఈ ఆకుకూరను ఎక్కువగానే తింటారు. కానీ ఇష్టంగా తినేవారి సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే అవి వండాక కాస్త చేదుగా అనిపిస్తుంది. పచ్చి వాసన కూడా వస్తుంది. అందుకే దాన్ని పెద్దగా ఇష్టపడరు.
పాలకూర, తోటకూర వంటివి ఆకుకూరలను వండాక… మిగతా కూరల్లాగా టేస్టీగా ఉండవు. ఇవి చేదుగా మారడం లేదా వాటి రంగు మారడం జరుగుతుంది. వాటిని తినాలనిపించదు కూడా. ఆకుకూరలు వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే అవి పిల్లలకు, పెద్దలకు నచ్చేలా వండవచ్చు.
1) పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు ఘాటైన రుచిని కలిగి ఉంటాయి. దీన్ని సరిగా తయారు చేయకపోతే కాస్త చేదుగా మారుతుంది. ఈ సందర్భంలో, దాని రుచిని సమతుల్యం చేయడానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లిని రుబ్బి నూనెలో వేయించుకున్న తరువాత ఆకుకూరను వేసి వండితే రుచిగా ఉంటుంది.
2) ఆకుకూరలు వండినప్పుడు వాటి రుచితో పాటు, కొన్నిసార్లు దాని రంగు కూడా మారుతుంది. ఈ సందర్భంలో, ఆకుకూరల మృదువైన ఆకృతి, స్థిరత్వం కోసం కొంచెం కార్న్ ఫ్లోర్ కలపండి. ఇది ఆకుకూరలను చిక్కగా చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఈ కూరను బాగా ఉడికించడం కూడా చాలా ముఖ్యం. ఆకుకూరలను తక్కువ మంట మీద 20 నుండి 25 నిమిషాలు ఉడకబెట్టడం అవసరం. పెద్ద పరిమాణంలో తయారు చేస్తే, దానిని ఉడికించడానికి కనీసం ఒక గంట పడుతుంది. ఆకూకూరలు ఎక్కువ సేపు చిన్న మంటపై ఉడికిస్తే దాని రుచి మరింత పెరుగుతుంది.
3) ఆకుకూరల్లో ఆమ్లం ఉంటుంది. ఈ సందర్భంలో, ఆకుకూరలను వండడానికి ముందు నానబెట్టండి. ఆ తరువాత నూనెలో వేసి వేయించాక… ఆకుకూరల రంగు చెడిపోకుండా ఉండాలంటే దీనిపైన మూతపెట్టి చిన్న మంట మీద ఉడికించడం ఉత్తమం.
4. ఆకుకూరలు వండేటప్పుడు అందులో చిటికెడు పసుపు కలపాలి. పసుపులో కర్కుమిన్ ఉంటుంది, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది వంటకం రంగును పెంచుతుంది. అది సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
5. ఆకుకూరలు వండేప్పుడు ఉప్పు వేయని వైట్ బటర్ ను జోడించడం మంచిది. బటర్ కలిపిన తర్వాత కాసేపు మరిగించాలి. ఇది కూరలకు మంచి వాసనను, రుచిని అందిస్తుంది.
పైన చెప్పిన చిట్కాలతో పాలకూర, తోటకూరలను వండి చూడండి… మీకు కచ్చితంగా తేడా తెలుస్తుంది. మంచి రుచిగా కూర వస్తుంది.