Spiritual Powerful Tips: మోడరన్ బిజీ జీవితంలో దేవుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు నాలుగు సులువైన మార్గాలు!
Spiritual Powerful Tips: ఈ కొన్ని అంశాలను మీ దైనందిక జీవితంలో తూ.చా తప్పకుండా పాటించి అలవాటుగా మార్చుకోండి. ఇకపై మీకు దేవుడికి ఒక లోతైన బంధాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
బిజీ మోడరన్ జీవితంలో కష్టాలు లేకుండా గడిపిన రోజేదంటే వేళ్ల మీద లెక్కపెట్టేయొచ్చు అనుకుంటున్నారా? నిత్యం చికాకులు, చిక్కులతో సతమతమవుతూ గజిబిజిగా కాలం గడిపేస్తున్నారా? అటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మీకు మార్గం చూపించేది, ఉపశమనం కలిగించేది దేవుడొక్కడే అని అర్థమైనా భక్తి మార్గాన్ని చేరుకోలేకపోతున్నారా? అయితే ఇది మీ కోసమే. ఉరుకుల పరుగుల జీవితం నుంచి, టెక్నాలజీ డైవర్షన్‌ల నుంచి, బాధ్యతల సుడిగుండాల నుంచి ఉపశమనం పొందేందుకు దేవుడికి దగ్గరవలాని అంతా అనుకుంటారు. కానీ అందరికీ అలా కుదరకపోవచ్చు. మీరు ఆరాధించే ఆ దేవుడకి మీరు మరింత దగ్గరవడం కోసం ఈ చిన్న పాటి చిట్కాలు పాటించి ఆయన అనుగ్రహం పొందండి. జీవితంలోని గందరగోళాన్ని తరిమికొట్టి మీ ఇష్ట దైవాన్ని ప్రసన్నం చేసేందుకు మీకు సహాయపడే ఈ చిట్కాలేంటో చూసేద్దాం..
ప్రార్థన లేదా ధ్యానం:
ఆధ్మాత్మిక ప్రయాణానికి తొలి మెట్టు ప్రార్థన లేదా ధ్యానం. ప్రతి రోజూ ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకుని ఆ సమయంలో ఇష్ట దైవ ప్రార్థన లేదా ధ్యానం చేయండి. ఉదయం, భోజన విరామ సమయమైన మధ్యాహ్నం లేదా పడుకునే ముందు ఇలా ఎప్పుడైనా పరవాలేదు. కానీ, రోజూ ఒకే సమయాన్ని కేటాయించుకుని, క్రమం తప్పకుండా అదే సమయంలో ధ్యానం చేయడం, ప్రార్థించడం అలవాటు చేసుకోండి. ఇది మీకు ఆధ్మాత్మిక సంబంధం నెలకొల్పడంలో, శాంతిని కనుగొనడంలో కీలకమవుతుంది.
చదవడం లేదా వినడం:
సమాజాన్ని ప్రతిబింబించే పుస్తకాలను కొద్ది రోజులు పక్కకు పెట్టేయండి. దానికి బదులుగా ఆధ్మాత్మికతతో కూడిన గ్రంథాలను రోజుకు కనీసం 15 నుంచి 20 పేజీలు చదవండి. అవి సరిపోలేదంటే, ఖాళీ సమయాల్లో మీకు ప్రేరణ కలిగేందుకు ఆధ్మాత్మిక పాటలు, ప్రోత్సాహకమైన పాడ్ కాస్ట్ లు వింటే దేవునితో సంబంధం మరింత బలపడుతుంది. ఒత్తిడి, చిక్కుల నుంచి కాస్త ఊరట, ఉపశమనం కలుగుతాయి.
కృతజ్ఞత/ఆరాధన:
వీలు కుదిరినప్పుడు ప్రార్థన లేదా పూజ చేయడం, ఖాళీగా ఉన్న సమయాల్లో మంత్రాలను జపిస్తుండటం, జపమాల సహాయంతో జపం చేయడం వంటివి చేస్తుండండి. దేవుడు మనకు ఇచ్చిన వాటితో కృతజ్ఞతాపూర్వకంగా మెసలుకోవడం లాంటివి మరిచిపోకండి. మీలో ఉన్న దైవ భావనను ప్రతిబించేలా మిమ్మల్ని మీరు మలుచుకొండి.
సేవ లేదా ప్రేమ:
మానవత్వంతో మెలిగి ఇతరులను ప్రేమించడం అలవాటు చేసుకోండి. దేవునితో కనెక్ట్ అవడానికి అత్యంత అర్థవంతమైన మార్గాలలో ఇదొకటి. దాంతో పాటు దానాలు చేయడం అలవాటు చేసుకోండి. స్వచ్ఛందంగా ఆహారాన్ని అందించడం, బట్టలు విరాళంగా పంచిపెట్టడం, ఆర్థిక సహాయం అందించడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటివి చేస్తూ ఉండండి. దయతో కూడిన చర్యలు ఇతరులకు ఉపయోగపడటమే కాకుండా మిమ్మల్ని దైవ అనుగ్రహానికి చేరువ చేస్తాయి.
(గమనిక: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా సత్యం, ఖచ్చితమైనదని మేము చెప్పడంలేదు. వేరు వేరు వెబ్ సైట్లు, నిపుణుల సలహాల మేరకు వీటిని పొందుపరుస్తున్నాం. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు దీనికి బాధ్యత వహించదు. వీటిని పాటించేముందు సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి.)