Rohit Sharma Ishan Kishan: క్రికెట్ ఫీల్డ్ లో రోహిత్ శర్మ చాలా వింతగా వ్యవహరిస్తుంటాడు. అతని కంటే ముందు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి ఎప్పుడూ దూకుడుగా, ఆవేశంగా కనిపించేవాడు. కానీ రోహిత్ అలా కాదు. ప్రశాంతంగా కనిపిస్తూనే సడెన్ గా మారిపోతుంటాడు. ఎప్పుడెలా మారతాడో చెప్పలేం. ఒక్కోసారి సరదాగా, మరోసారి ఆగ్రహంగా కనిపిస్తుంటాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆటలోనూ రోహిత్ అలాంటిదే ఎవరూ ఊహించని ఓ ఎమోషన్ చూపించాడు. అయితే ఈసారి అతడు చేసిన పని ఎవరికీ సరదాగా అనిపించలేదు. ఓ కెప్టెన్ అయి ఉండి ఇలా చేస్తావా అంటూ అతనిపై అభిమానులు మండిపడుతున్నారు.
తొలి రోజు ఆట సందర్భంగా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను కొట్టబోయాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ మ్యాచ్ లో కూడా బెంచ్ కే పరిమితమైన ఇషాన్.. మధ్యలో ఓసారి డ్రింక్స్ మోసుకొచ్చాడు. అతడు అందించిన బాటిల్ తో నీళ్లు తాగిన రోహిత్.. తిరిగి ఇషాన్ కు ఇవ్వబోగా అది కాస్తా కిందపడిపోయింది. ఆ సమయంలో అతడు తిరిగి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లే తొందరలో ఉన్నాడు.
కిందపడిన బాటిల్ ను తీసుకోవడానికి అతడు తిరిగి రాగా.. రోహిత్ అతన్ని కొట్టబోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోహిత్ సరదాగానే అలా చేయబోయినా.. అతడు చేసిన పని అభిమానులకు నచ్చలేదు. ఓ సహచర క్రికెటర్ పై చేయి చేసుకోవడానికి ప్రయత్నించడమేంటి.. అతన్ని అగౌరవపరచడమేంటి అని ప్రశ్నిస్తున్నారు.
ఇషాన్ ఏమైనా నీ పనోడా అంటూ ఓ యూజర్ రోహిత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరికొందరు అభిమానులు మాత్రం రోహిత్ ను వెనకేసుకొచ్చారు. అతడేదో సరదాగా అలా చేశాడని, అంతమాత్రానికే ఆడిపోసుకోవడం సరికాదని అంటున్నారు. నిజానికి ఇషాన్ తో రోహిత్ ఎప్పుడూ ఇలాగే ఉంటాడు. గతంలో ఇషాన్ పై రోహిత్ సరదాగా ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియోలు, ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సంబంధిత కథనం