IPL 2025 Auction: పృథ్వీ షాని ముందే హెచ్చరించిన ఢిల్లీ క్యాపిటల్స్.. కానీ పట్టించుకోని ఓపెనర్ ఇప్పుడు పశ్చాతాపం
Prithvi Shaw IPL 2025 Auction: పృథ్వీ షా ఒకే ఓవర్‌లో వరుసగా 4,4,4,4,4,4 ఫోర్లు కొట్టగల సామర్థ్యం ఉన్న బ్యాటర్. కానీ.. ఐపీఎల్ 2025 వేలంలో రూ.75 లక్షల ధరకే వస్తున్నా ఏ ఫ్రాంఛైజీ పట్టించుకోలేదు. కారణం ఏంటంటే?
భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన పృథ్వీ షా.. జూనియర్ సచిన్‌గా కితాబులు అందుకున్నాడు. కానీ.. క్రమశిక్షణారాహిత్యం,ఫిట్‌నెస్, ఫామ్ లేమి కారణంగా ఈ యంగ్ క్రికెటర్ కెరీర్ గాడితప్పింది. ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు బౌండరీలు కొట్టగల సామర్థ్యం ఉన్న పృథ్వీ షా.. రూ.75 లక్షల కనీస ధరతో ఐపీఎల్ 2025 వేలానికి వచ్చినా.. ఏ ఫ్రాంఛైజీ అతడ్ని పట్టించుకోలేదు. ఐపీఎల్ 2022 నుంచి 2024 వరకూ పృథ్వీ షాకి రూ.7.5 కోట్లు చొప్పున ఢిల్లీ క్యాపిటల్స్ ఇవ్వడం గమనార్హం.
వేటు వేయబోయి.. మళ్లీ అవకాశాలు
కానీ.. పృథ్వీ షా తనకి అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేదని.. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ అసిస్టెంట్ కోచ్ మహ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి ఎన్నో మ్యాచ్‌ల్లో పృథ్వీ షాని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించడంపై చర్చించామని గుర్తు చేసుకున్న కైఫ్.. ఆ తర్వాత మళ్లీ మనసు మార్చుకుని అవకాశమిచ్చామని చెప్పుకొచ్చాడు.
భారత అండర్-19 ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్‌గా వెలుగులోకి వచ్చిన పృథ్వీ షా.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. వాస్తవానికి పృథ్వీ షా ఫామ్‌లో ఉండి ఉంటే.. వేలానికి ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేది కాదు. కనీసం రూ.14 కోట్లతో రిటేన్ చేసుకునేది. కానీ..వేలానికి వదిలేయడంతో ఢిల్లీ జట్టుతో అతని ఏడేళ్ల బంధానికి తెరపడింది.
ఒకే ఓవర్లో ఆరు బౌండరీలు కొట్టిన రికార్డ్
మహ్మద్ కైఫ్ ఏం చెప్పాడంటే.. ‘‘పృథ్వీ షా పవర్ ప్లే స్పెషలిస్ట్ బ్యాటర్. అతను ఒకే ఓవర్లో ఆరు బౌండరీలు కొట్టగలే సామర్థ్యం ఉంది. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్ సుదీర్ఘకాలం అతనికి మద్దతు ఇచ్చింది. శివమ్ మావిపై ఒకసారి ఇలానే ఒకే ఓవర్‌లో 6 ఫోర్లు కొట్టాడు. మ్యాచ్‌ల్లో పృథ్వీ షా పెద్ద స్కోరు చేయగలిగితే మేము ఖచ్చితంగా గెలుస్తాము. నిజానికి మేము చాలా సార్లు తుది జట్టులోకి అతడ్ని ఎంచుకోవాలా వద్దా అని చర్చించాము. కొన్ని సార్లు మ్యాచ్‌కి ముందు రోజు రాత్రి అతనిపై వేటు వేయాలని నిర్ణయించుకున్నాం. కానీ.. టాస్‌కి ముందు ఈ రోజు స్కోర్ చేయగలడని ఆశించి అవకాశాలు ఇచ్చేవాళ్లం. అయితే అతనితో విసిగిపోయి ఢిల్లీ క్యాపిటల్స్ వేలానికి వదిలేసింది’’ అని చెప్పుకొచ్చాడు.
పృథ్వీ షా రీఎంట్రీ ఇవ్వాలంటే?
పృథ్వీ షా ముందు ఉన్నది ఒకటే దారి.. దేశవాళీ క్రికెట్‌లో ఆడి ఫిట్‌నెస్‌తో పాటు పరుగులు చేసి ఫామ్ నిరూపించుకోవడం. గతంలో సర్ఫరాజ్ ఖాన్ కూడా ఇలానే అవమానాల్ని ఎదుర్కొన్నాడు. కానీ.. ఇప్పుడు భారత్ టెస్టు జట్టులో రెగ్యులర్ ప్లేయర్ అయిపోయాడు. ఫామ్, ఫిట్‌నెస్ పరంగానే కాదు.. క్రమశిక్షణ విషయంలోనూ పృథ్వీ షాపై ఫిర్యాదులు ఉన్నాయి. వీధి గొడవలు, ప్రాక్టీస్‌కి డుమ్మా కొట్టడం, శరీర బరువుని అదుపులో ఉంచుకోకపోవడం .. దాని కారణంగా ఫీల్డింగ్‌లో నిర్లక్ష్యం.. ఇవన్నీ పృథ్వీ షా దిద్దుకోవాల్సి ఉంది. ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్లు కూడా పృథ్వీ షాకి సూచిస్తున్నారు.