IPL Expensive Players: ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్ -10 క్రికెటర్లు.. కోహ్లీ, రోహిత్, ధోనీకి నో ప్లేస్
Most expensive players in IPL history: ఐపీఎల్ 2025 మెగా వేలం సరికొత్త రికార్డులు నెలకొల్పింది. 16 ఏళ్ల వేలం చరిత్రని తిరగరాస్తూ భారత క్రికెటర్ రిషబ్ పంత్ ఎవరూ ఊహించని ధరకి అమ్ముడుపోయాడు. అలానే టాప్-10లోనే భారత్ క్రికెటర్ల హవానే ఎక్కువ.
Expensive players in IPL history: అబుదాబి వేదికగా రెండు రోజులు ఆసక్తిగా జరిగిన ఐపీఎల్ 2025 ఆటగాళ్ల వేలం ముగిసింది. భారత క్రికెటర్లపై కోట్ల వర్షం కురిపించిన ఫ్రాంఛైజీలు.. విదేశీ ఫాస్ట్ బౌలర్లు, ఆల్‌రౌండర్ల కోసం భారీగా ఖర్చు చేశాయి. 2008 నుంచి ఐపీఎల్ వేలం జరుగుతుండగా.. 16 ఏళ్ల వేలం రికార్డ్స్‌ను ఐపీఎల్ 2025 వేలం బద్ధలు కొట్టింది.
టాప్-2లో పంత్, శ్రేయాస్
ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు సగం మంది భారత క్రికెటర్లే ఉన్నారు. అంతేకాదు టాప్-2లో కూడా భారత ఆటగాళ్లే ఉండటం గమనార్హం. గత ఏడాది వరకూ ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లతో టాప్‌లో ఉండగా.. గత ఆదివారం ఐపీఎల్ 2025 వేలంలో రూ.27 కోట్లకి అమ్ముడుపోయిన రిషబ్ పంత్ ఆ రికార్డ్‌ను బద్ధలు కొట్టాడు.
సగం ధర కోల్పోయిన స్టార్క్
రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చిన రిషబ్ పంత్‌ను.. అన్ని ఫ్రాంఛైజీలతో పోటీపడిన లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకి కొనుగోలు చేసింది. ఇదే వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ని పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది అత్యధిక ధరకి అమ్ముడుపోయిన మిచెల్ స్టార్క్‌ని ఈ ఏడాది వేలంలో రూ.11.75 కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
అనూహ్యంగా పెరిగిన అయ్యర్ ధర
ఓవరాల్‌గా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకి అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాలో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, మిచెల్ స్టార్క్ టాప్-3లో నిలవగా.. మళ్లీ నెం.4లో భారత క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ నిలిచాడు. ఈ ఏడాది వేలంలో వెంకటేశ్ అయ్యర్‌ను రూ.23.75 కోట్లకి కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా భారీగా పందేరం
జాబితాలో ఐదో స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఉన్నాడు. అతడ్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. గత సీజన్‌లో రూ.20.50 కోట్లకి కొనుగోలు చేసింది. ఆరో స్థానంలో సామ్ కరన్ రూ.18.5 కోట్లతో నిలవగా.. పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ 2023 ఐపీఎల్ వేలంలో ఆ ధరకి కొనుగోలు చేసింది.
లిస్ట్‌లో 7,8 స్థానాల్లో మళ్లీ భారత క్రికెటర్లే నిలిచారు. ఐపీఎల్ 2025 వేలంలో యుజ్వేందర్ చాహల్, అర్షదీప్ సింగ్‌ను రూ.18 కోట్లు చొప్పున పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత 9వ స్థానంలో కామెరూన్ గ్రీన్ రూ.17.50 కోట్లతో ఉండగా.. ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. బెన్‌స్టోక్స్ రూ.16.25 కోట్లతో పదో స్థానంలో ఉన్నాడు. అతడ్ని 2023లో చెన్నై సూపర్ కింగ్స్ ఆ ధరకి కొనుగోలు చేసింది.
ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు
- 1. రిషబ్ పంత్ రూ.27 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్ - 2025)
- 2.శ్రేయాస్ అయ్యర్ రూ. 26.75 కోట్లు (పంజాబ్ కింగ్స్ - 2025)
- 3.మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్ - 2024)
- 4.వెంకటేష్ అయ్యర్ రూ.23.75 కోట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్ -2025)
- 5. పాట్ కమిన్స్ రూ.20.50 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్ -2024)
- 6. సామ్ కరన్ రూ.18.5 కోట్లు (పంజాబ్ కింగ్స్ -2023)
- 7. అర్షదీప్ సింగ్ రూ.18 కోట్లు (పంజాబ్ కింగ్స్ -2025)
- 8. యుజ్వేంద్ర చాహల్ రూ. 18 కోట్లు (పంజాబ్ కింగ్స్ - 2025)
- 9. కామెరూన్ గ్రీన్ రూ.17.50 కోట్లు (ముంబయి ఇండియన్స్ - 2023)
- 10. బెన్ స్టోక్స్ రూ.16.25 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్ - 2023)