APSRTC : ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. విశాఖ‌ప‌ట్నం నుంచి శబరిమలకు ప్ర‌త్యేక బ‌స్సులు.. ప్యాకేజీలు ఇవే-special buses from visakhapatnam to sabarimala under the auspices of apsrtc ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc : ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. విశాఖ‌ప‌ట్నం నుంచి శబరిమలకు ప్ర‌త్యేక బ‌స్సులు.. ప్యాకేజీలు ఇవే

APSRTC : ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. విశాఖ‌ప‌ట్నం నుంచి శబరిమలకు ప్ర‌త్యేక బ‌స్సులు.. ప్యాకేజీలు ఇవే

HT Telugu Desk HT Telugu
Nov 26, 2024 01:38 PM IST

APSRTC : అయ్య‌ప్ప భ‌క్తుల‌కు ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. శ‌బ‌రిమ‌ల‌కు ప్ర‌త్యేక బ‌స్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు ర‌కాల ప్యాకేజీల‌ను నిర్ణ‌యించామ‌ని, ఇందులో ఇంద్ర‌, సూప‌ర్ ల‌గ్జ‌రీ, అల్ట్రా డీల‌క్స్ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని అధికారులు చెప్పారు.

ఏపీఎస్ఆర్టీసీ
ఏపీఎస్ఆర్టీసీ

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం.. ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం రీజియన్ నుంచి శబరిమలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్ర‌తి ఏడాది విశాఖ‌ప‌ట్నం నుంచి ప్ర‌త్యేక బ‌స్సులు శ‌బ‌రిమ‌ల‌కు వేస్తున్నామ‌ని ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఈ ఏడాది కూడా శబరిమలకు ప్రత్యేక 5, 6, 7 రోజుల టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. ఆయా ప్యాకేజీల‌ను ఆధారంగా బ‌స్సులు ప్ర‌యాణించే మార్గంలో ఉన్న ఆలయాల కవరేజీలో వ్యత్యాసం ఉంటుంద‌ని వివరించారు.

5 రోజుల ప్యాకేజీ

ఐదు రోజుల ప్యాకేజీలో విజయవాడ, మేల్‌మ‌రువ‌త్తూర్‌, ఎరుమేలి, పంబ మీదుగా యాత్ర సన్నిధానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, విజయవాడలను కవర్ చేస్తుంది. ఒక్కొక్క‌రి టిక్కెట్ ధ‌ర సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ స‌ర్వీసుల‌కు రూ.6,600, ఇంద్ర స‌ర్వీసుకు రూ.8,500గా నిర్ణ‌యించారు.

6 రోజుల ప్యాకేజీ

ఆరు రోజుల ప్యాకేజీలో విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేలి, పంబ మీదుగా యాత్ర సన్నిధానం చేరుకుంటుంది. తిరిగి ప్ర‌యాణంలో తిరుపతి, శ్రీ కాళహస్తి, విజయవాడ, అన్నవరం ఆలయాలలో దర్శనం లభిస్తుంది. ఒక్కొక్క‌రి టిక్కెట్ ధ‌ర సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ స‌ర్వీసుల‌కు రూ.7,000, ఇంద్ర స‌ర్వీసుకు రూ.9,000గా నిర్ణ‌యించారు.

7 రోజుల ప్యాకేజీ

ఏడు రోజుల ప్యాకేజీలో విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేలి, పంబ మీదుగా యాత్ర సన్నిధానం చేరుకుంటుంది. తిరిగి ప్ర‌యాణంలో మదురై, రామేశ్వరం, తిరుపతి, శ్రీ కాళహస్తి, విజయవాడ, ద్వారపూడి, అన్నవరంలలో దర్శనం చేసుకోవచ్చు. ఒక్కొక్క‌రి టిక్కెట్ ధ‌ర సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ స‌ర్వీసుల‌కు రూ. 7,600, ఇంద్ర స‌ర్వీసుకు రూ.10,000గా నిర్ణయించారు.

అద్దె బ‌స్సులు..

అయ్య‌ప్ప స్వాముల కోసం శ‌బ‌రిమ‌ల క్షేత్రానికి ప్ర‌త్యేకంగా బ‌స్సులు న‌డుపుతున్నట్లు ఆర్టీసీ అధికారి గంగాధ‌ర‌రావు వివరించారు. అద్దె బ‌స్సులను కూడా అందుబాటులోకి తెచ్చామ‌ని చెప్పారు. 30 నుంచి 40 మంది అయ్య‌ప్ప స్వాములు ఉంటే, ముందుగానే బుక్ చేసుకోవ‌చ్చ‌ని, వారికి ప్ర‌త్యేకంగా ఒక బ‌స్సు కేటాయిస్తామ‌ని స్పష్టం చేశారు. గ‌తేడాది 5 బ‌స్సులు మాత్ర‌మే న‌డిపామ‌ని, ఈ ఏడాది 7 బ‌స్సులు ప్ర‌స్తుతానికి బుక్ అయ్యాయ‌ని వెల్లడించారు. మ‌రికొన్ని బ‌స్సులు బుక్ అయ్యేందుకు అవ‌కాశం ఉంద‌న్నారు. పూర్తి వివరాలకు విశాఖపట్నం డిపో మేనేజర్ 99592 25594, 90522 27083 ఫోన్ నంబర్లలో సంప్ర‌దించాలని సూచించారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner