Winter Health Care: చలికాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా?
Winter Superfoods for Immunity: చలికాలంలో కొందరు తరచూ అనారోగ్యం బారిన పడుతుంటారు. రోగ నిరోధక శక్తి వారిలో తక్కువగా ఉండడమే ఇందుకు కారణంగా ఉండొచ్చు. కొన్ని రకాల ఆహారాల వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
చలికాలంలో సీజనల్ వ్యాధులు, ఇన్‍ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే, కొందరు మాత్రం ఈ కాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. జ్వరం, దగ్గు, జలుబు లాంటి సమస్యలను మాటిమాటికీ ఎదుర్కొంటుంటారు. తగ్గినా మళ్లీమళ్లీ వస్తుంటుంది. వారిలో సరైన రోగ నిరోధక శక్తి లేకపోవడం పోవడం ఇందుకు ప్రధాన కారణంగా ఉండొచ్చు. అలాంటి వారు ఇమ్యూనిటీ పెరిగే ఆహారాలు తప్పక తీసుకోవాలి. అలా రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే ఆహారాలు కొన్ని ఆహారాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
అల్లం
అల్లంలో ఔషధ గుణాలు చాలా ఉంటాయి. అల్లంలో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, జింక్, విటమిన్ సీ, బీ6, మెగ్నిషియం పుష్కలం. యాంటీఇన్‍ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. అందుకే అల్లాన్ని చలికాలంలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తిని ఇది మెరుగుపరుస్తుంది. రోగాలతో పోరాడేందుకు శరీరానికి బాగా తోడ్పడుతుంది. ఆహారాల్లో, పానియాల్లో అల్లం తీసుకోవాలి. అల్లంతో టీలు చేసుకొని తాగితే బాగుంటుంది.
ఉసిరి
ఉసిరిలో విటమిన్ సీ అత్యధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని ఇది చాలా పెంచుతుంది. శీతాకాలంలో ఉసిరిని తప్పకుండా తీసుకోవాలి. ఉసిరిని పచ్చిగా తినొచ్చు.. జ్యూస్‍గా చేసుకొని తాగొచ్చు. ఉసిరితో చేసిన వంటకాలు కూడా తినొచ్చు. ఉసిరి పొడిని నీటిలో కలుపుకొని తాగితే ఇంకా ప్రయోజనాలు ఉంటాయి. ఇమ్యూనిటీని ఉసిరి బాగా పెంచుతుంది.
నారింజ పండు
నారింజ పండులో విటమిన్ సీ అధికం. యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కీలకమైన విటమిన్స్, మినరల్స్ సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని నారింజ పదిలం చేస్తుంది. రోగాలతో శరీరం ఫైట్ చేసేందుకు సపోర్ట్ చేస్తుంది. జలుబు ఉన్నా నారింజ తీసుకోవచ్చు. రోగాలు, ఇన్ఫెక్షన్ల రిస్కును నారింజ తగ్గించగలదు.
ఆకుకూరలు
పాలకూర, మెంతికూరను శీతాకాలంతో రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. ఈ ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్లు, కీలకమైన విటమిన్లు, మినరల్స్, ఐరన్, ఫోలెట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. చలికాలంలో ఆకుకూరలు తినడం చాలా ముఖ్యం.
మునగాకు
మునగాకులో విటమిన్ సీ, ఏ, ఈతో పాటు ముఖ్యమైన మినరల్స్ మెండుగా ఉంటాయి. మునగాకును ఎండబెట్టి పొడిగా చేసి.. నీళ్లలో కలిపి తాగితే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మునగాకుతో వంటలు కూడా చేసుకోవచ్చు. మునగాకు జ్యూస్ కూడా చేసుకోవచ్చు.
పసుపును ఇలా..
ప్రతీ వంటింట్లో ఉండే పసుపు చాలా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. యాంటీఇన్‍ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి. శీతాకాలంలో పసుపు వేసుకొని టీలు చేసుకుంటే మేలు. అల్లం, పసుపు, నీరు వేసి మరిగించుకొని టీ తయారు చేసుకొని తాగితే రోగ నిరోధక శక్తికి మేలు జరుగుతుంది. పసుపును మరిన్ని పానియాల్లోనూ యాడ్ చేసుకోవచ్చు. వంటకాల్లోనూ కాస్త ఎక్కువ వేసుకోవచ్చు.
పండ్లు, కూరగాయలు
శీతాకాలంలో పోషకాలు ఉండే ఆహారాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ కాలంలో కూరగాయాలు, పండ్లు ఎక్కువగా తినాలి. వీటిల్లోని విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు.. రోగాలు, ఇన్ఫెక్షన్లతో శరీరం దీటుగా పోరాడే శక్తిని పెంచుతాయి.