Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌పై అంపైర్‌కి ఫిర్యాదు చేసిన న్యూజిలాండ్ ప్లేయర్లు, పిలిచి మరీ వార్నింగ్
IND vs NZ 3rd Test: టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌పై అంపైర్‌కి న్యూజిలాండ్ బ్యాటర్లు ఫిర్యాదు చేశారు. దాంతో అంపైర్ పిలిచి మరీ సర్ఫరాజ్ ఖాన్‌కి వార్నింగ్ ఇచ్చాడు.
భారత్, న్యూజిలాండ్ మధ్య వాంఖడే వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజే (శుక్రవారం) వివాదం రాజుకుంది. భారత్ యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌పై న్యూజిలాండ్ ప్లేయర్లు ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇలింగ్ వర్త్‌కి ఫిర్యాదు చేశారు. దాంతో సర్ఫరాజ్ ఖాన్‌ను పిలిపించిన అంపైర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 235 పరుగులకే ఆలౌటవగా.. నిన్న ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 86/4తో కష్టాల్లో నిలిచింది. భారత్ జట్టు ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్ (31 బ్యాటింగ్), రిషబ్ పంత్ (1 బ్యాటింగ్) ఉన్నారు.
నోరుజారిన సర్ఫరాజ్
మ్యాచ్‌లో మొదటి రోజు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ బ్యాటర్లను సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్ చేస్తూ కనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువగా సిల్లీ పాయింట్‌లో ఫీల్డింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్.. ఏదో ఒకటి మాట్లాడుతూ న్యూజిలాండ్ బ్యాటర్ల ఏకాగ్రతని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. దాంతో సర్ఫరాజ్ ఖాన్ తమని ఇబ్బంది పెడుతున్నాడని ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇలింగ్ వర్త్‌కి న్యూజిలాండ్ ప్లేయర్లు డార్లీ మిచెల్, విల్ యంగ్ ఫిర్యాదు చేశారు.
రోహిత్ వచ్చినా వెనక్కి తగ్గని అంపైర్
న్యూజిలాండ్ బ్యాటర్ల ఫిర్యాదు చేసిన వెంటనే సర్ఫరాజ్ ఖాన్‌ను పిలిచిన అంపైర్ రిచర్డ్ ఇలింగ్ వర్త్ గట్టిగా వార్నింగ్ ఇస్తూ కనిపించాడు. అదే సమయంలో అక్కడికి విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వచ్చారు. ఈ ఇద్దరూ సర్ఫరాజ్ ఖాన్‌కి మద్దతుగా నిలిచినా.. అంపైర్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంకోసారి ఇలా నోరుజారితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అంపైర్ వార్నింగ్ తర్వాత న్యూజిలాండ్ బ్యాటర్ డార్లీ మిచెల్ దగ్గరికి వెళ్లిన రోహిత్ శర్మ.. సర్ఫరాజ్ ఖాన్ తరఫున అతనితో మాట్లాడాడు. దాంతో సమస్య సర్దుమణిగింది.
స్లెడ్జింగ్‌లో కోహ్లీ, పంత్ ఎక్స్‌ఫర్ట్స్
వాస్తవానికి మైదానంలో ఇలా ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కి దిగడం కొత్తేమీ కాదు. ఆస్ట్రేలియా టీమ్ ప్రతి జట్టుపైనా స్లెడ్జింగ్‌కి దిగుతుంటుంది. భారత్ జట్టులో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఇలా స్లెడ్జింగ్‌కి దిగడంలో ముందుంటారు. అయితే.. దానికి పరిమితి ఉంటుంది. కానీ సర్ఫరాజ్ ఖాన్ ఆ లిమిట్‌ను క్రాస్ చేయడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు తప్పనిసరి పరిస్థితుల్లో అంపైర్లకి ఫిర్యాదు చేశారు.
నిజానికి న్యూజిలాండ్ టీమ్ ఆటగాళ్లు ఇలా స్లెడ్జింగ్‌కి దూరంగా ఉంటారు. మైదానంలో గొడవలు, వివాదాలు ఆ టీమ్‌కి చాలా తక్కువ. ఆ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొన్నేళ్ల పాటు ఆ జట్టుని అత్యంత క్రమశిక్షణతో నడిపించాడు. ఇప్పుడు అతను టీమ్‌లో లేకపోయినా.. న్యూజిలాండ్ టీమ్ గీత దాటి ప్రవర్తించడం చాలా అరుదు.
సర్ఫరాజ్ ఎందుకు స్లెడ్జింగ్‌కి దిగాడంటే?
సర్ఫరాజ్ ఖాన్ కూడా ఇలా మైదానంలో నోరుజారడానికి ఒక కారణం ఉంది. న్యూజిలాండ్ టీమ్ 72/3తో నిలిచిన దశలో క్రీజులో నిలదొక్కుకున్న విల్ యంగ్ (71), డార్లీ మిచెల్ (82) జోడి భారత్ జట్టుకి దాదాపు 24 ఓవర్లు వికెట్ ఇవ్వలేదు. దాంతో స్లెడ్జింగ్ ద్వారా ఈ ఇద్దరి ఏకాగ్రతని దెబ్బతీయాలని సర్ఫరాజ్ ఖాన్ ప్రయత్నించాడు. దాంతో ప్లాన్ బెడిసికొట్టింది.