Siddipet : చెడు వ్యసనాలకు బానిసలై గంజాయి విక్రయం.. జైలుకు వెళ్లొచ్చిన మారని తీరు.. మళ్లీ అరెస్టు-youths arrested for selling ganja in siddipet and they addicted to bad habits ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet : చెడు వ్యసనాలకు బానిసలై గంజాయి విక్రయం.. జైలుకు వెళ్లొచ్చిన మారని తీరు.. మళ్లీ అరెస్టు

Siddipet : చెడు వ్యసనాలకు బానిసలై గంజాయి విక్రయం.. జైలుకు వెళ్లొచ్చిన మారని తీరు.. మళ్లీ అరెస్టు

HT Telugu Desk HT Telugu
Nov 28, 2024 05:16 PM IST

Siddipet : చెడు వ్యసనాలకు బానిసలై ముగ్గురు యువకులు.. డబ్బు సంపాదించడం కోసం గంజాయి విక్రయించాలని నిర్ణయించుకొన్నారు. కూలీలకు, యువకులకు రెట్టింపు ధరకు గంజాయి విక్రయిస్తూ ఒకసారి జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. అయినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు.

వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ

గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అమ్మదీపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అరికెల శేఖర్ (23), అదే గ్రామానికి చెందిన బోయిని నరేష్(23), సుక్కసారి భాను ప్రసాద్(21) ముగ్గురు స్నేహితులు. వీరు అలవాట్లకు బానిసలై సులువుగా డబ్బులు సంపాదించడం కోసం గంజాయి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు కలిసి ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్లలో నివసిస్తున్నారు.

ఈ ముగ్గురు కలిసి సిద్దిపేట పరిసర ప్రాంతాలలో ద్విచక్రవాహనాలను దొంగతనం చేశారు. అదే మోటార్ సైకిల్‌పై భద్రాచలం జిల్లా సీలేరుకు వెళ్లి వర్ధన్ వద్ద 2, 3 సార్లు గంజాయి తీసుకొచ్చారు. గజ్వేల్, అమ్మదీపూర్ చుట్టూపక్కల గ్రామాల కూలీలకు, యువకులకు రెట్టింపు ధరకు విక్రయించారు. దీంతో వీరిని 8 నెలల కిందట గంజాయి అమ్మడానికి వెళ్తుండగా.. సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు.

మారని తీరు..

జైలుకు వెళ్లి వచ్చినా.. వారి తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో వారం రోజుల కిందట శేఖర్, నరేష్ గంజాయి తీసుకుని రావడానికి సీలేరు వెళ్తున్నామని వారి స్నేహితుడు భాను ప్రకాష్‌కు ఫోన్ చేశారు. భానుప్రకాష్ పని ఉందని, గంజాయి కావాలని రూ. 7000 శేఖర్‌కు ఫోన్ పే ద్వారా పంపించాడు.

ఈ క్రమంలో శేఖర్, నరేష్ ఇద్దరు కలిసి స్నేహితుడు బైక్‌పై సీలేరుకు వెళ్లి వర్ధన్ అనే వ్యక్తి వద్ద రూ. 30,800 ఇచ్చి 20 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. మోటార్ సైకిల్‌పై వస్తే ఎవరైనా పోలీసులు పట్టుకుంటారని భావించి శేఖర్.. ఒక బ్యాగులో 10 కిలోల గంజాయి పెట్టుకొని హైదరాబాద్ వరకు బస్సులో వచ్చాడు. అక్కడి నుండి ఊరికి వచ్చి ఎవరైనా చూస్తారని అనుమానంతో ఊరు బయట గ్రామ శివారులో మల్లన్న సాగర్ కట్ట వద్ద గంజాయిని దాచి పెట్టాడు.

గంజాయి కావాలని భాను ప్రసాద్ రాగానే.. అక్కడికి వెళ్లి అందులో నుండి అతనికి 2 కిలోల గంజాయిని ఇచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు చాకచక్యంగా శేఖర్, భానుప్రసాద్ అనే ఇద్దరిని పట్టుకొని విచారణ చేపట్టారు. నిందితుల వద్ద నుండి 10 కిలోల గంజాయి, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నరేష్, వర్ధన్ పరారీలో ఉన్నారు. త్వరలో ఇద్దరు నిందితులను పట్టుకుంటామని ఏసీపీ పురుషోత్తం రెడ్డి స్పష్టం చేశారు.

(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner