Warangal SR University : ఎస్ఆర్ యూనివర్శిటీలో గంజాయి గ్యాంగ్స్..! నలుగురు విద్యార్థులు అరెస్ట్, అసలేం జరుగుతోంది..
వరంగల్ లోని ఎస్ఆర్ యూనివర్శిటీలో గంజాయి గుప్పుమంటోంది. తాజాగా గంజాయి తాగుతూ నలుగురు విద్యార్థులు యాంటీ నార్కోటిక్ టీమ్ పోలీస్ టీమ్ కు చిక్కారు. వారి నుంచి దాదాపు 24 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని హసన్ పర్తి పోలీసులకు అప్పగించారు.
వరంగల్ లోని ఎస్ఆర్ యూనివర్శిటీలో గంజాయి ఘాటు గుప్పుమంటోంది. వర్సిటీలో పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు విద్యార్థులు ఆకతాయిలుగా మారుతుండగా.. పట్టించుకోవాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతోనే విద్యార్థులు చదువులు పక్కన పెట్టి మద్యం, గంజాయి మత్తుకు అలవాటు పడుతున్నారు.
కొద్దిరోజుల కిందట ఎస్ఆర్ యూనివర్శిటీకి చెందిన కొందరు విద్యార్థులు వర్సిటీ సమీపంలోని ఓ హోటల్ వ్యక్తితో గొడవ పడగ.. తాజాగా గంజాయి తాగుతూ నలుగురు విద్యార్థులు యాంటీ నార్కోటిక్ టీమ్ పోలీస్ ఆఫీసర్లకు చిక్కారు. దీంతో పోలీసులు వారిపై వివిధ సెక్షన్లతో పాటు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. హసన్ పర్తి పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
హనుమకొండ జిల్లా పరిధి అనంతసాగర్ లోని ఎస్ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీ లో కొంతమంది విద్యార్థులు గంజాయి మత్తుకు అలవాటు పడ్డారు. కొద్ది రోజులుగా యూనివర్సిటీ సమీపంలోని ఓపెన్ ప్లేస్ ని అడ్డాగా చేసుకుని గంజాయి దమ్ము లాగుతూ మత్తులో తూగుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు స్థానికులు గమనించి ఇదివరకే పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి సమయంలో ఎస్ఆర్ యూనివర్శిటీకి చెందిన కొందరు విద్యార్థులు గంజాయి తాగుతున్నట్టు యాంటీ నార్కోటిక్ టీమ్ సీఐ సురేష్ కు సమాచారం అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో పాటు హసన్ పర్తి పోలీసుల సమన్వయంతో అక్కడికి వెళ్లారు. అక్కడ యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయి తాగుతున్నట్టు గుర్తించారు.
నలుగురు విద్యార్థులు అరెస్టు
స్టూడెంట్స్ గంజాయి తాగుతున్నట్టు గుర్తించి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు గంజాయి తాగుతున్న వారిని బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ నాగుల శివసాయి, ఫైనల్ ఇయర్ కు చెందిన దాసరి సాత్విక్ రెడ్డి, గజ్జి దినేష్, సెకండ్ ఇయర్ కు చెందిన చింతల దక్షయ్ రెడ్డి గా గుర్తించారు. వారి నుంచి దాదాపు 24 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి తదుపరి విచారణ నిమిత్తం హసన్ పర్తి పోలీసులకు అప్పగించారు. దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు హసన్ పర్తి సీఐ చేరాలు తెలిపారు.
మత్తులో సీనియర్ పై దాడి
యూనివర్శిటీలో కొందరు విద్యార్థులు గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల మొదటి వారంలో ఈ తరహా ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్సిటీ హాస్టల్ లో ఉంటున్న ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఒకరు రాత్రి గంజాయి తాగి హాస్టల్ లోని సీనియర్లను బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డాడు. దీంతో సీనియర్లు కూడా ఎదురుదాడికి దిగగా.. యూనివర్శిటీలో అలజడి చెలరేగింది.
దీంతో అప్పటికే నిద్ర పోయిన స్టూడెంట్స్ హాస్టల్ రూమ్స్ నుంచి బయటకు రావడంతో హాస్టల్ లో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. వర్సిటీకి చెందిన సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ స్టూడెంట్స్ మత్తులో ఉండటం, సెక్యూరిటీ సిబ్బందిని కూడా లెక్క చేయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హసన్ పర్తి సీఐ చేరాలు, ఇతర సిబ్బంది హుటాహుటిన యూనివర్శిటీకి వెళ్లి గంజాయి మత్తులో ఉన్న విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం అతడిని చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఎర్రగట్టుగుట్ట సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం విషయాన్ని బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచారు. కానీ స్టూడెంట్ల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో యూనివర్సిటీ అసలు వ్యవహారం రచ్చలెక్కినట్లైంది.
తరచూ వివాదాల్లోకి యూనివర్సిటీ
ప్రైవేట్ వర్సిటీల్లో పేరుగాంచిన ఎస్ఆర్ యూనివర్శిటీ తరచూ వివాదాల్లోకి ఎక్కుతోంది. ఇప్పటికే వర్సిటీలో ర్యాగింగ్ వ్యవహారం అప్పట్లో కలకలం రేపగా.. ఇంకో ఘటనలో విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి గ్యాంగ్ వార్ కు దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ ఏడాది జనవరిలో అగ్రికల్చర్ బీటెక్ సెకండ్ ఇయర్ చదివే దీప్తి రాథోడ్ అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత బీబీఏ స్టూడెంట్ దిలీప్ కుమార్ ను ఐదుగురు సీనియర్లు ర్యాగింగ్ చేయగా.. బాధితుడు ఆ ఐదుగురితో పాటు యూనివర్సిటీ యాజమాన్యంపైనా హసన్ పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా ఏదో ఒక రకంగా తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న ఎస్ఆర్ యూనివర్శిటీలో ఇప్పుడు గంజాయి మూలాలు బయట పడటంతో మరోసారి వర్సిటీ పరిస్థితిని కళ్ళకు కట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా వర్సిటీలో ఇంకొందరు విద్యార్థులు కూడా గంజాయి కి అలవాటు పడి తరచూ బీభత్సం సృష్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా పోలీస్ ఉన్నతాధికారులు ఎస్ఆర్ యూనివర్సిటీ పై ఫోకస్ పెట్టి స్టూడెంట్లకు అవగాహన కల్పించడంతో పాటు లిక్కర్, గంజాయి మత్తుకు బానిస అవకుండా చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే యూనివర్సిటీ తరచూ వివాదాల్లోకి ఎక్కుతోందనే వాదనలు వినిపిస్తుండగా.. ఇకనైనా మేనేజ్ మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి...!
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).
సంబంధిత కథనం