Dhanush Divorce: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోయారు.. విడాకులు మంజూరు చేసిన కోర్టు.. 20 ఏళ్ల బంధానికి తెర
Dhanush Divorce: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోయారు. ఇక కలిసి ఉండలేమని వాళ్లు చెప్పడంతో కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో వీళ్ల మధ్య ఉన్న 20 ఏళ్ల వివాహ బంధానికి తెరపడింది.
Dhanush Divorce: తమిళ స్టార్ హీరో ధనుష్, మరో సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఇప్పుడు అధికారికంగా విడిపోయారు. వాళ్లకు విడాకులు మంజూరు కావడంతో ఈ జంట ఇక తమ రెండు దశాబ్దాల బంధానికి తెరదించింది. బుధవారం (నవంబర్ 27) చెన్నై ఫ్యామిలీ కోర్టు ధనుష్, ఐశ్వర్యలకు విడాకులు మంజూరు చేయడం గమనార్హం.
గతంలోనే మూడుసార్లు ఈ కేసును విచారించిన చెన్నై ఫ్యామిలీ కోర్టు.. చివరికి బుధవారం (నవంబర్ 27) విడాకులు మంజూరు చేసినట్లు సన్ టీవీ రిపోర్టు వెల్లడించింది. గతంలో మూడుసార్లూ ధనుష్, ఐశ్వర్య విచారణకు హాజరు కాలేదు. అయితే గత వారం ఐశ్వర్య మాత్రం వచ్చింది. అప్పుడు కేసును వాయిదా వేసిన చెన్నై ఫ్యామిలీ కోర్టు.. విడాకులకు అంగీకరించింది.
ధనుష్, ఐశ్వర్య పెళ్లి
తమిళ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కూతురైన ఐశ్వర్య 2004లో పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు ఇద్దరు కొడుకులు లింగా, యాత్ర ఉన్నారు. ఇద్దరం విడిపోతున్నట్లు చెప్పిన తర్వాత కూడా తమ పిల్లలతోనే వాళ్లు కలిసి ఉంటున్నారు. తాము విడిపోతున్న విషయాన్ని ఎక్స్ అకౌంట్ ద్వారా ధనుష్ జనవరి 17, 2022న అనౌన్స్ చేశాడు.
"స్నేహితులుగా, జంటగా, పేరెంట్స్ గా, శ్రేయోభిలాషులుగా కలిసి ఉంటూ 18 ఏళ్లు గడిచాయి. ఇన్నేళ్లూ ఒకరినొకరం అర్థం చేసుకుంటూ, సర్దుకుంటూ గడిపాం. కానీ ఈరోజు మా దారులు వేరవుతున్నాయి" అని ధనుష్ ట్వీట్ చేశాడు. అదే మెసేజ్ ను అటు ఐశ్వర్య కూడా షేర్ చేసింది.
ధనుష్ వర్సెస్ నయనతార
ధనుష్, నయనతార మధ్య వివాదం మరింత ముదిరింది. ది హిందూలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. నయనతారపై మద్రాస్ హైకోర్టులో ధనుష్ సివిల్ సూట్ దాఖలు చేశాడు. అతనికి చెందిన వుండెర్‌బర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నయనతార, విఘ్నేష్ శివన్ లపై ఈ సూట్ వేసింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యుమెంటరీలో తమ మూవీ నానుమ్ రౌడీ దా నుంచి కొన్ని విజువల్స్ వాడుకున్నట్లు అందులో పేర్కొంది.
ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ చూసుకునే లాస్ గాటోస్ ప్రొడక్షన్ పై దావా వేసేలా అనుమతి ఇవ్వాలని కూడా మద్రాస్ హైకోర్టును ధనుష్ కంపెనీ కోరింది. ఇద్దరి వాదనలు విన్న కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. నయనతార వచ్చే విచారణ తేదీలోపు ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.