AP Cyclone Rains : ఏపీపై ఫెంగల్ తుపాను ఎఫెక్ట్, రానున్న మూడ్రోజులు అతి భారీవర్షాలు
AP Cyclone Rains : నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఇవాళ రాత్రికి తుపానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. తుపాను ప్రభావంతో రేపటి నుంచి మూడ్రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం బుధవారం రాత్రికి తుపానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆ తదుపరి 2 రోజులలో శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. తుపాను ప్రభావంతో గురు,శుక్ర,శనివారాల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మూడు రోజులు మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తీవ్రవాయుగండం గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీవ్రవాయుగుండం ప్రస్తుతానికి ట్రంకోమలీకి తూర్పుగా 1100 కిమీ, నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కి.మీ, పుదుచ్చేరికి 450 కి.మీ, చైన్నైకి 530 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వాయువ్య దిశగా కదులుతున్న తీవ్రవాయుగుండం బుధవారం రాత్రికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. శనివారం మత్స్యకారులు సముద్రంల్లోకి వేటకు వెళ్లరాదని సూచించారు. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 55-65 కి.మీ గరిష్టంగా 75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిచారు.
భారీ వర్షాలు నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయం పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రైతులు పంట పొలాల్లో అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని కోరారు.
రానున్న నాలుగు రోజులు వాతావరణం ఇలా
నవంబర్ 28, గురువారం :
నెల్లూరు, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 29, శుక్రవారం
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 30, శనివారం
నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికాపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
డిసెంబర్ 1, ఆదివారం
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.