TS AP Weather: తుఫానుగా మారనున్న తీవ్రవాయుగుండం... మరో 4 రోజుల పాటు వర్షాలు!-weather updates of andhrapradesh and telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ap Weather: తుఫానుగా మారనున్న తీవ్రవాయుగుండం... మరో 4 రోజుల పాటు వర్షాలు!

TS AP Weather: తుఫానుగా మారనున్న తీవ్రవాయుగుండం... మరో 4 రోజుల పాటు వర్షాలు!

HT Telugu Desk HT Telugu
May 10, 2023 04:12 PM IST

Weather Updates Telugu States: తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన ఇచ్చింది వాతావరణశాఖ. తుపాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Weather Updates Telangana and Andhrapradesh: తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా... గడిచిన రెండు రోజులుగా మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే ఇదిలా ఉంటే… మరోసారి వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఐఎండీ అంచనాల ప్రకారం… బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉంది. అది క్రమంగా రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగానూ,ఎల్లుండికి అతి తీవ్రమైన తుఫానుగానూ మారుతుందని హెచ్చరిచింది. ఆ తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ శనివారం నుంచి స్వల్పంగా బలహీనపడుతూ , ఆదివారం మధ్యాహ్నానికి కాక్స్ బజార్ (బంగ్లాదేశ్) మరియు క్యుక్ప్యు (మయన్మార్) మధ్య ఆగ్నేయ బంగ్లాదేశ్ మరియు ఉత్తర మయన్మార్ వద్ద తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించింది.

మరోసారి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో40 కిలోమీటర్ల వేగంతో వచ్చే వర్షాలు, గాలులు మరో 5 రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొంది. వారం చివరిలో ఉరుములతో కూడిన జల్లులతో పాటు ఈదురుగాలులు లేదా వడగళ్ళు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా మ్యాన్ హోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక రెండు మూడు రోజులుగా పొడి వాతావరణాన్ని ఎదుర్కొంటున్న హైదరాబాద్ నగర వాసులకు ఈ వర్షపాతం ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణంలోని మార్పుల కారణంగా ఉక్కపోత ఎక్కువగా ఉంది.

ఇక బుధవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌ నగర్‌, హయత్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి.

Whats_app_banner