Nirmal Ethanol Factory : ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయండి-నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు
Nirmal Ethanol Factory : నిర్మల్ జిల్లాలోని ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారం కీలక ములుపు తిరిగింది. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామస్థులతో చర్చించిన కలెక్టర్... ఫ్యాక్టరీ పనులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై సీఎంతో మరోసారి చర్చిస్తామన్నారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. రెండు రోజులుగా ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలంటూ దిలావర్పర్ తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజల తీవ్ర ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ నిరసన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు, నాలుగు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను తప్పకుండా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. మేరకు ఫ్యాక్టరీ పనులు తక్షణమే నిలిపివేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
గత ప్రభుత్వం దిలావర్పూర్ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. అప్పటి నుంచి గ్రామస్తులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఫాక్టరీ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేస్తుండటంతో.. మంగళవారం గ్రామస్తులు మరోసారి ఫ్యాక్టరీ రద్దు చేయాలని రోడ్డెక్కారు. దాదాపు 10 గంటలకు పైగా పిల్లా పెద్దా అంతా కలసి అర్ధరాత్రి వరక ధర్నాకు దిగారు. గ్రామస్తులకు నచ్చజెప్పడానికి వచ్చిన ఆర్డీవో కళ్యాణిని బంధించారు. ఎట్టకేలకు ఎస్పీ జోక్యం చేసుకొని ఆర్డీవోను వారి నుంచి విడిపించి, పలువురి అరెస్ట్ చేశారు.
బుధవారం మరోసారి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మహిళలు పురుగుల మందు డబ్బాలతో రోడ్డు మీదికి వచ్చి అరెస్ట్ చేసిన వారి తక్షణమే విడుదల చేయాలని పట్టు బట్టారు. ఫాక్టరీని రద్దు చేయాలంటూ ఆందోళనకు చేపట్టారు. ఈ వ్యవహారం స్పందించిన కలెక్టర్ అభిలాష అభినవ్ గ్రామస్తులతో చర్చలు చేపట్టారు. అనంతరం ఫ్యాక్టరీ పనులు తక్షణమే నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమస్య ప్రభుత్వానికి నివేదిక పంపించామని, మరోసారి సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్ ఉమ్మడిదలాబాద్ జిల్లా, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం