హిందూ ఆచార వ్యవహారాల్లో ఇంటి గుమ్మానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఇంటి గుమ్మాన్ని చూసి ఇంట్లో వాతావరణాన్ని చెప్పచ్చని చాలా మంది అంటుంటారు. అందుకే చాలా మంది ఇంటి గుమ్మాన్ని తోరణాలతో పూల దండలతో అందంగా అలంకరించుకుంటారు. తోరణాలు కేవలం అలంకరణ కోసమేనా లేక ఇతర ఆధ్యాత్మిక కారణాలేమైనా ఉన్నాయా అంటే కచ్చితంగా ఉన్నాయనే చెబుతోంది వాస్తు శాస్త్రం. హిందూ సిద్ధాంతాలు చాలా వరకూ వాస్తుపై ఆధారపడి ఉంటాయి. వాస్తు కేవలం నిర్మాణ శాస్త్రం మాత్రమే కాదు వేద శాస్త్రంతో అనుబంధం కలిగి ఉండి వ్యక్తి జీవనశైలి, పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. వాస్తు నియమాలను పాటించడం వల్ల వ్యక్తి తన పరిసరాలలో ఆనందం, ప్రశాంతత, సానుకూల ప్రభావాలను పొందగలడని నమ్మిక.
వాస్తు శాస్త్రంలో తోరణాలకు ప్రాముఖ్యత ఎక్కువ. సాధారణంగా ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను, బంతి పూలను తోరణంగా కడతారు. హిందువులుండే ప్రతి ఇంటి గుమ్మానికి తోరణాలు తప్పకుండా ఉంటాయి. ఇల్లు అందంగా కనిపించడం కోసం, అలంకరణలో భాగంగా మాత్రమే వీటిని కట్టరు. వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మానకి మామిడి ఆకు తోరణాలు కట్టడం వల్ల వాస్తు దోషాలు తొలగాపోతాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఇంటికి తోరణాలు కట్టడం వల్ల ఆర్థిక వృద్ధికి కారకురాలైన లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆకర్షించవచ్చు.ఆమె అనుగ్రహాన్ని సులువుగా పొందవచ్చు.