Keerthy Suresh: కీర్తి సురేశ్ డేటింగ్ పోస్టుపై సమంత, కాజల్, మాళవిక కామెంట్స్ వైరల్
Keerthy Suresh: కీర్తి సురేశ్ తన డేటింగ్ కన్ఫమ్ చేస్తూ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. అయితే దీనిపై సమంత, కాజల్, మాళవిక మోహనన్ లాంటి టాప్ హీరోయిన్లు చేసిన కామెంట్స్ కూడా అభిమానులు ఆకర్షిస్తున్నాయి.
Keerthy Suresh: టాలీవుడ్ నటి కీర్తి సురేశ్ తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ ఆంటోని తట్టిల్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈ మధ్యే వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. అయితే ఇప్పుడామెనే తన రిలేషన్షిప్ ను కన్ఫమ్ చేసింది. బుధవారం (నవంబర్ 27) ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ లో కీర్తి సురేశ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
కీర్తి సురేశ్.. 15 ఏళ్ల బంధం
కీర్తి సురేశ్ ఒకటి రెండు కాదు ఏకంగా 15 ఏళ్లుగా ఆంటోనీ తట్టిల్ తో రిలేషన్షిప్ లో ఉందంటే నమ్మగలరా? ఇన్నాళ్లుగా ఆమె తన డేటింగ్ ను సీక్రెట్ గా ఉంచింది. ఈ మధ్యే తన పెళ్లి వార్తలు బయటకు రాగా.. ఇప్పుడు తానే ఆంటోనితో ఉన్న రిలేషన్షిప్ ను కన్ఫమ్ చేసింది. "15 ఏళ్లు.. ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఇది ఎప్పుడూ.. ఆంటోనీ x కీర్తి (AntoNY x KEerthy)" అనే క్యాప్షన్ తో ఆంటోనీతో తన డేటింగ్ విషయాన్ని కీర్తి అధికారికంగా ధృవీకరించింది. ఈ పోస్టు వెంటనే వైరల్ గా మారింది. టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు సమంత, కాజల్, మాళవిక, సంయుక్త, కృతి శెట్టిలాంటి వాళ్లు కూడా కామెంట్స్ చేశారు.
కీర్తి పోస్ట్‌పై హీరోయిన్స్ కామెంట్స్
కీర్తి సురేశ్ బుధవారం (నవంబర్ 27) చేసిన పోస్టుపై పలువురు హీరోయిన్లు కామెంట్స్ చేశారు. మాళవికా మోహనన్ స్పందిస్తూ.. "మొత్తానికి చెప్పేశావ్.. లవ్ యు బోత్. అంతేకాదు NYKE పేరు కూడా ఇలా వచ్చిందని నాకు ఇప్పుడే తెలిసింది" అని కామెంట్ చేయడం విశేషం.
ఇక సంయుక్త కొన్ని స్మైలీ ఎమోజీలను పోస్ట్ చేసింది. అటు కృతి శెట్టి రెడ్ హార్ట్ ఎమోజీలనే కామెంట్ గా పెట్టింది. రాశీ ఖన్నా స్పందిస్తూ.. "మాకు ఇప్పుడే తెలిసింది. కంగ్రాచులేషన్స్ లవ్" అని కామెంట్ చేసింది. సమంత కూడా ఈ పోస్టుపై స్పందించింది. "కంగ్రాచులేషన్స్ మై లవ్. NYKE ఫరెవెర్" అని కామెంట్ చేయడం విశేషం.
కాజల్ అగర్వాల్ కామెంట్ చేస్తూ.. "కంగ్రాచులేషన్స్ డార్లింగ్ గర్ల్. ఈ సంతోష క్షణాలకు నువ్వు పూర్తిగా అర్హురాలివి" అని పోస్ట్ చేసింది. అనుపమ పరమేశ్వరన్ కూడా పలు ఎమోజీలను పోస్ట్ చేస్తూ కీర్తికి కంగ్రాట్స్ చెప్పింది.
వచ్చే నెలలోనే పెళ్లి?
కీర్తి సురేశ్ సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉంది. హైస్కూల్లో మొదలైన తమ ప్రేమను వీళ్లు ఇప్పుడు పెళ్లి పీటల మీదికి తీసుకెళ్తున్నారు. కేరళలోని కొచ్చికి చెందిన ఆంటోనీని వచ్చే నెల 11, 12 తేదీల్లో గోవాలో వీళ్ల పెళ్లి జరగనున్నట్లు ఈ మధ్యే ఓ రిపోర్టు వెల్లడించింది. ఆంటోనీ కేరళలోని ప్రముఖ రిసార్ట్ చెయిన్ కు ఓనర్ కావడం విశేషం. స్కూల్లోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు.
కీర్తి సురేశ్ పెళ్లి పనులు గోవాలో ఇప్పటికే మొదలయ్యాయి. ఆమె పెళ్లిపై తండ్రి, నటుడు, నిర్మాత అయిన సురేశ్ తోపాటు తల్లి మేనక కూడా కీర్తి పెళ్లిపై సంతృప్తిగా ఉన్నట్లు ఆ రిపోర్టు తెలిపింది. కీర్తి పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు కూడా చెప్పింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.