BRS Diksha Divas : తెలంగాణ గొంతు బీఆర్ఎస్ మాత్రమే... ఇంకెవరూ కాదు - దీక్షా దివాస్ లో కేటీఆర్-brs working president ktr hits out at cm revanth reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Diksha Divas : తెలంగాణ గొంతు బీఆర్ఎస్ మాత్రమే... ఇంకెవరూ కాదు - దీక్షా దివాస్ లో కేటీఆర్

BRS Diksha Divas : తెలంగాణ గొంతు బీఆర్ఎస్ మాత్రమే... ఇంకెవరూ కాదు - దీక్షా దివాస్ లో కేటీఆర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 29, 2024 09:00 PM IST

తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరముందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన దీక్షా దివస్ వేడుకల్లో మాట్లాడిన ఆయన.. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలు పెట్టాడని విమర్శించారు. తెలంగాణ ఆనవాళ్లు చెరిపేందుకు రేవంత్ ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.

దీక్షా దివాస్ వేడుకల్లో కేటీఆర్
దీక్షా దివాస్ వేడుకల్లో కేటీఆర్

చరిత్ర చదవకుండా.. భవిష్యత్‌ను నిర్మించలేమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన దీక్షా దివస్ వేడుకల్లో మాట్లాడిన ఆయన… తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవం, అస్తిత్వం, అస్మిత.. ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లవుతమని చెప్పుకొచ్చారు.

తెలంగాణ ఆనవాల్లు చెరిపేందుకు ప్రయత్నం…

“కేసీఆర్ ఆనవాళ్లు కాదు.. తెలంగాణ ఆనవాళ్లు చెరిపేందుకు రేవంత్ ప్రయత్నం చేస్తున్నాడు. కష్టమొస్తే రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భవన్ గుర్తొస్తోంది. తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ లా మారింది. సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడున్న రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలు పెట్టాడు. ఉద్యమంపై గన్ను ఎక్కుపెట్టిన రేవంత్.. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానని రెచ్చిపోతున్నాడు. సోనియమ్మ లేకపోతే తెలంగాణ అడుక్కు తినేదని అహంకారంతో వాగుతున్నడు కాంగ్రెస్ సీఎం” అంటూ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో కేటీఆర్ ఫైర్ అయ్యారు.

తెలంగాణ గొంతు బీఆర్ఎస్ - కేటీఆర్

తెలంగాణ అస్తిత్వంపై గుజరాత్ గులాములు ఓ పక్క, ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క దాడి చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. ప్రస్తుత పార్లమెంట్ లో తెలంగాణ గళం వినిపించే నాథుడే లేడని చెప్పారు. తెలంగాణ గొంతు బీఆర్ఎస్ మాత్రమే అని.. ఇంకెవరూ కాదని స్ప,్టం చేశారు.

లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్ విజయంగా కేటీఆర్ అభివర్ణించారు. గిరిజనులు, దళితులు, బీసీల, రైతులు కలిసిగట్టుగా సాధించిన విజయమని చెప్పుకొచ్చారు. “ఈ రియల్ ఎస్టేట్ బేహారీకి, పాలన తెలియదు. మీ భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ దందా చేయటం మాత్రమే తెలుసు. మరొక రూపంలో మీ భూములు కావాలంటూ మళ్లీ వస్తాడు. జాగ్రత్తగా ఉండాలే. ఈ ప్రభుత్వంపై ప్రతిఘటన మాత్రమే మనకు ఉన్న గత్యంతరం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్ ఇప్పుడు జనతా గ్యారేజ్ అయ్యిందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రయోజనం పొందాయని విమర్శించారు. కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతుందని ఉద్ఘాటించారు.

Whats_app_banner

సంబంధిత కథనం