Saturday Motivation: సక్సెస్‍ను అలుసుగా తీసుకోవద్దు: పృథ్వి షా పతనం నుంచి తప్పక నేర్చుకోవాల్సిన 4 జీవిత పాఠాలు ఇవే-life lessons from cricketer prithvi shaw success to downfall saturday motivation ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation: సక్సెస్‍ను అలుసుగా తీసుకోవద్దు: పృథ్వి షా పతనం నుంచి తప్పక నేర్చుకోవాల్సిన 4 జీవిత పాఠాలు ఇవే

Saturday Motivation: సక్సెస్‍ను అలుసుగా తీసుకోవద్దు: పృథ్వి షా పతనం నుంచి తప్పక నేర్చుకోవాల్సిన 4 జీవిత పాఠాలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 30, 2024 05:00 AM IST

Saturday Motivation: కొండంత టాలెంట్‍తో మహామహులతో ప్రశంసలు పొందిన భారత యువ క్రికెటర్ పృథ్వి షా.. కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఐపీఎల్ వేలంలోనూ అతడు అమ్ముడుపోలేదు. తన కెరీర్ పతనమయ్యేందుకు పృథ్వి షా చేసిన సొంత తప్పులే ఎక్కువగా ఉన్నాయి. వాటి నుంచి అందరూ పాఠాలు నేర్చుకోవచ్చు.

Saturday Motivation: సక్సెస్‍ను అలుసుగా తీసుకోవద్దు: పృథ్వి షా పతనం నుంచి తప్పక నేర్చుకోవాల్సిన 4 జీవిత పాఠాలు ఇవే
Saturday Motivation: సక్సెస్‍ను అలుసుగా తీసుకోవద్దు: పృథ్వి షా పతనం నుంచి తప్పక నేర్చుకోవాల్సిన 4 జీవిత పాఠాలు ఇవే (PTI)

నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ అని ఒకప్పుడు ప్రశంసలు అందుకున్నాడు భారత యంగ్ క్రికెటర్ పృథ్వి షా. అతడిని సచిన్, వీరేందర్ సెహ్వాగ్, బ్రియాన్ లారాలతో కొందరు దిగ్గజాలు కూడా పోల్చారు. చిన్నతనంలోనే క్రికెట్‍లో చాలా సక్సెస్ చూశాడు పృథ్వి షా. దేశవాళీ క్రికెట్‍లో పరుగుల వరద సృష్టిస్తూ రికార్డులను బద్దలుకొట్టాడు. అతడి సారథ్యంలో అండర్-19 ప్రపంచకప్‍ను భారత్ గెలిచింది. టీమిండియాలో అరంగేట్రం చేసి టెస్టు సెంచరీ కూడా చేశాడు. దీంతో ఇక పృథ్వి షా గొప్ప క్రికెటర్ అవడం పక్కా అనే ధీమా కలిగి ఉంది. అయితే, ఇంతలోనే అతడి స్వయం కృతాపరాధాలతో ఏకంగా కెరీర్ ప్రమాదంలో పడింది.

ఐపీఎల్ 2025 కోసం ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో పృథ్వి షాను ఏ జట్టు తీసుకోలేదు. ఇంతకాలం అతడిని అట్టిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పట్టించుకోలేదు. ముంబై రంజీ జట్టులోనూ పృథ్వి చోటు కోల్పోయాడు. తర్వాతి టెండూల్కర్ అంటూ ఒకప్పుడు ప్రశంసలు పొందిన పృథ్వి.. మళ్లీ కెరీర్లో ఎప్పుడు పుంజుకుంటాడో తెలియని సందిగ్ధం నెలకొంది. ఈ పరిస్థితికి అతడు చేసిన పొరపాట్లే ప్రధాన కారణాలు ఉన్నాయి. అద్భుత సక్సెస్ నుంచి అనతి కాలంలోనే పతనం అయిన పృథ్వి షా పరిస్థితి నుంచి అందరూ కొన్ని జీవిత పాఠాలు నేర్చుకొని.. అలాంటి తప్పులు చేయకుండా ఉండాలి.

సక్సెస్‍ను అలుసుగా తీసుకోవద్దు

పృథ్వి షా క్రికెటర్ అయ్యేందుకు పదేళ్ల వయసు నుంచి చాలా కష్టపడ్డాడు. థానే నుంచి బంద్రాకు రోజూ 70 కిలోమీటర్లు ప్రయాణించి మరీ ప్రాక్టీస్ చేసేవాడు. క్రికెటర్ కావాలని కలలు కని శ్రమించాడు. అందుకు తగ్గట్టుగానే కష్టపడి వివిధ ఏజ్ గ్రూప్‍ల్లో చిన్నప్పటి నుంచే అద్భుత బ్యాటింగ్‍తో రికార్డులు సృష్టించాడు. టీమిండియాలోకి కూడా అడుగుపెట్టాడు. సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత కెరీర్లో తనకు దక్కిన సక్సెస్‍ను అతడు అలుసుగా తీసుకున్నాడు పృథ్వి షా. సరైన ఫిట్‍నెస్ మెయింటెన్ చేయకుండా, క్రమశిక్షణ పాటించకుండా ఇష్టానుసారం ప్రవర్తించాడు. గొడవలు, వివాదాల్లో చిక్కుకున్నాడు. మొత్తంగా కెరీర్‌ను డేంజర్‌లో పడేసుకున్నాడు. అందుకే జీవితంలో వచ్చిన సక్సెస్‍ను ఎప్పుడూ అలుసుగా తీసుకోకూడదు. అది మనతో కొనసాగాలంటే నిత్యం శ్రమిస్తూనే ఉండాలి. కష్టపడుతూ ముందుకు సాగాలి.

టాలెంట్ ఒక్కటే సరిపోదు

పృథ్వి షాకు కొండంత టాలెంట్ ఉంది. చిన్న వయసులోనే భారీ సక్సెస్ చూశాడు. అయితే, సుదీర్ఘ కాలంలో విజయవంతంగా కొనసాగాలంటే సక్సెస్ ఒక్కటే సరిపోదు. ఏ స్థాయికి వచ్చినా కష్టపడే తత్వాన్ని వీడకూడదు. క్రమశిక్షణను అలసత్వం చేయకూడదు. టాలెంట్‍తో పాటు అంకితభావం ఎప్పటికీ ఉంటేనే ఏ రంగంలో అయినా ఎక్కువ కాలం సక్సెస్‍ఫుల్‍గా ముందుకు సాగతుంది. ఓ దశలో సక్సెస్ చూశాక కష్టపడడం ఆపేసి ఇష్టానుసారం చేస్తే.. పతనం అయ్యేందుకు పెద్దగా సమయం పట్టదు. అందుకే టాలెంట్‍తో పాటు నిరంతరం కష్టపడే తత్వం, అంకితభావం కచ్చితంగా అలవరుచుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

టాలెంట్ తలుపు తెరుస్తుంది.. అంతే..

మనలో ఉన్న టాలెంట్ అవకాశం తలుపు తెరుస్తుంది. అయితే, అది అలాగే తెరిచి ఉండాలంటే కష్టపడాలి. అలుసుగా తీసుకుంటే అవకాశాల తలుపులు మూసుకుపోతాయి. పృథ్వి షాకు అది సరిగ్గా సూటవుతుంది. అతడికి ఉన్న అపారమైన టాలెంట్‍కు టీమిండియాలో, ఐపీఎల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో తలుపులు చాలా త్వరగా తెరుచుకున్నాయి. అయితే, అతడు నిర్లక్ష్యంతో ఇష్టానుసారం ప్రవర్తించడంతో ప్రదర్శన పడిపోయింది. దీంతో ఆ తలుపులు ఇప్పుడు మూసుకుపోయాయి.

డబ్బు తలకెక్కకూడదు

పృథ్వి షా.. తక్కువ వయసులోనే కోట్లాది డబ్బు సంపాదించేశాడు. ఇప్పుడు అతడికి వయసు ఇంకా 25 ఏళ్లే. 18 ఏళ్ల నుంచే అతడికి భారీగా ధనం దక్కింది. ఐపీఎల్ ద్వారానే చాలా డబ్బు సమకూరింది. సంపద కూడా పృథ్వి షా తలకు ఎక్కేసి.. అతడు పక్కదోవ పట్టేందుకు కారణం అయింది. డబ్బు వచ్చేయడంతో అతడు కష్టపడడం ఆపేసి, క్రమశిక్షణ తప్పి వ్యవహరించాడు. పతనాన్ని కోరి తెచ్చుకున్నాడు. ఒకప్పుడు టెండూల్కర్‌తో పోల్చిన వారే.. ఇప్పుడు పృథ్విని మరో వినోద్ కాంబ్లీ అంటున్నారు. అందుకే డబ్బు ఎంత వచ్చినా.. కెరీర్‌ విజయవంతంగా ముందుకు సాగేలా కష్టపడాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణాన్ని అలవరుచుకోవాలి. సక్సెస్‍కు నిర్వచనం డబ్బు కాదని, మీరు ఉన్న రంగంలో సుదీర్ఘంగా సక్సెస్‍ఫుల్‍గా ముందుకు సాగి ఇతరులకు ఆదర్శంగా ఉండడమే విషయాన్ని గ్రహించి ముందుకు సాగాలి.

పృథ్వి షాలో ఇప్పటికే కొండంత టాలెంట్ ఉంది. ఈ ఎదురుదెబ్బలతో అయినా అతడు మళ్లీ కష్టపడి, క్రమశిక్షణతో మెలగాలని అతడి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఆటపై దృష్టి పెట్టి, కృషి చేసి మళ్లీ ఫామ్‍లోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. పృథ్వి షా మళ్లీ కెరీర్లో పుంజుకొని టీమిండియాలో ఐపీఎల్‍లో చోటు దక్కించుకుంటాడో.. లేదా అతడి కెరీర్ ఇంతటితో అయిపోతుందా అనేది చూడాలి.

Whats_app_banner