Dinner Time: డిన్నర్ ఈ టైమ్‍లోగా చేయకపోతే రిస్కే! షాకింగ్ విషయాలు వెల్లడించిన నయా అధ్యయనం
Right Time for Dinner: డిన్నర్ ఎప్పటిలోగా తినాలో తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. అంతకు మించి ఆలస్యంగా తింటే డయాబెటిస్ వచ్చే రిస్క్ పెరిగిపోతుందని వెల్లడించింది. మరిన్ని సమస్యలు ఎదురవుతాయని పేర్కొంది.
రాత్రి భోజనం ‘డిన్నర్’ను ఎన్ని గంటల లోపు తినేయాలని చర్చలు చాలాకాలంగా సాగుతూనే ఉన్నాయి. సూర్యాస్తమయం లోపే డిన్నర్ చేసేస్తే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయని ఇప్పటికే చాలా మంది వైద్య నిపుణులు చెప్పారు. అయితే, ఏ టైమ్‍కు తినాలనే దానిపై డిబేట్ నడుస్తూ ఉంటుంది. డిన్నర్ తినే టైమ్ విషయంలో తాజాగా ఓ అధ్యయనం ఓ టైమ్‍ను చెప్పింది. ఆ సమయం మించి డిన్నర్ తింటే డయాబెటిస్ సహా వివిధ సమస్యల రిస్క్ పెరుగుతుందని పేర్కొంది. ఆ వివరాలివే..
సాయంత్రం 5లోపే..
డిన్నర్ తినే టైమ్ విషయంలో యూనివర్సిటీ ఆఫ్ ఒబెర్టా దె కాటలున్యా (యూఓసీ), కొలంబియా యానివర్సిటీ రీసెర్చర్స్.. ఓ అధ్యయనం చేశారు. సాయంత్రం 5 గంటలలోపే డిన్నర్ చేయడం ఆరోగ్యానికి మంచిదని వెల్లడించారు.
ఆలస్యమైతే డయాబెటిస్ రిస్క్
సాయంత్రం 5 గంటల తర్వాత తీసుకునే క్యాలరీల్లో 45 శాతానికి పైగా బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని, దీని ద్వారా డయాబెటిస్ వచ్చే రిస్క్ అధికమవుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. న్యూట్రిషన్ అండ్ డయాబెటిస్‍లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. డిన్నర్ ఆలస్యంగా తింటే గ్లూకోజ్ జీవక్రియకు, ఇన్సులిన్ పనితీరుకు ఆటంకంగా ఉంటుందని ఆ స్టడీ స్పష్టం చేసింది.
రాత్రివేళ శరీరంలో ఇన్సులిన్ తక్కువగా ఉండడం వల్ల సాయంత్రం తర్వాత ఆహారం తినకూడదని ఈ అధ్యయనం సహ రచయిత డయానా డియాజ్ రిజోలో తెలిపారు. “గ్లూకోజ్‍ను శోషించే చేసే శక్తి శరీరానికి రాత్రివేళలో పరిమితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. సర్కడేడియన్ రిథమ్ వల్ల కణాల సెన్సివిటీ తగ్గుతుంది” అని వెల్లడించారు.
అధ్యయనం ఇలా..
50 నుంచి 75 సంవత్సరాల మధ్య ఉన్న 26 మంది వ్యక్తులతో ఈ స్టడీ జరిగింది. డయాబెటిస్ టైప్ 2 ఉన్న వారు, లేని వారు వీరిలో ఉన్నారు. వీరిని రెండు గ్రూప్‍లుగా విభజించి ఒకే రకమైన ఆహారాన్ని, ఓ గ్రూప్ తొందరగా, మరో గ్రూప్ ఆలస్యంగా తినాలని అధ్యయనవేత్తలు చెప్పారు. డిన్నర్ ఆలస్యంగా చేసిన వారిలో గ్లూకోజ్ లెవెల్స్ అత్యధికంగా ఉన్నట్టు గుర్తించారు.
రాత్రి ఆలస్యంగా తింటే కలిగే నష్టాలు
క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని రాత్రి ఆలస్యంగా తింటే శరీరంపై చాలా దుష్ప్రభావాలు పడతాయి. ఆరోగ్యానికి ఇబ్బందులు ఏర్పడతాయి. డయాబెటిస్ లాంటి రిస్క్‌లు పెరుగుతాయి.
రాత్రి ఆలస్యంగా డిన్నర్ చేస్తే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రివేళ క్యాలరీలు ఎక్కువ బర్న్ అవవు. అందుకే వెయిట్ పెరిగే రిస్క్ ఉంటుంది. రాత్రి లేట్‍గా ఆహారం తీసుకుంటే నిద్ర కూడా సరిగా పట్టదు. జీర్ణం కాక నిద్రకు ఆటంకాలు ఏర్పడతాయి. నాణ్యమైన నిద్ర ఉండదు. నిద్రలేమి మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. ఆలస్యంగా తింటే ఛాతిలో మంట, అజీర్తి, గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలు కూడా ఎదురయ్యే రిస్క్ ఉంటుంది. తిన్న వెంటనే రాత్రి నిద్రించడం మంచిది కాదు. గుండె వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.