Tirumala Darshan Tickets: తిరుమలలో స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్లు జారీ… నెలకు 3వేల టోకెన్ల విడుదల-good news for locals tirumala releases 3 000 darshan tokens ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Darshan Tickets: తిరుమలలో స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్లు జారీ… నెలకు 3వేల టోకెన్ల విడుదల

Tirumala Darshan Tickets: తిరుమలలో స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్లు జారీ… నెలకు 3వేల టోకెన్ల విడుదల

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 02, 2024 11:16 AM IST

Tirumala Darshan Tickets: తిరుపతి, రేణిగుంట వాసుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలనే డిమాండ్‌ ఎట్టకేలకు నెరవేరింది. టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. తొలి విడతగా డిసెంబర్ నెల కోటాను విడుదల చేశారు.

తిరుపతి స్థానిక ప్రజలకు దర్శనం టోకెన్లను అందిస్తున్న టీటీడీ ఛైర్మన్‌, ఈవో శ్యామలరావు
తిరుపతి స్థానిక ప్రజలకు దర్శనం టోకెన్లను అందిస్తున్న టీటీడీ ఛైర్మన్‌, ఈవో శ్యామలరావు

Tirumala Darshan Tickets: టీటీడీ బోర్డు తొలి పాలక మండలి సమావేశంలో స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని తీర్మానం చేసిన మేరకు సోమవారం తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుతో కలిసి తిరుమల స్థానికులకు దర్శన టోకెన్ల జారీని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు.

స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరించేందుకు తొలి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. శ్రీవేంకటేశ్వరుని దర్శనం చేసుకునే అవకాశం కల్పించడం పట్ల స్థానికులు ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేశారని అన్నారు.

తిరుమల, తిరుపతి రూరల్, అర్బన్, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు దర్శన కోటా ఖరారు చేసేందుకు టీటీడీ అధికారులు తీవ్ర కసరత్తు చేశారన్నారు. సామాన్య భక్తులు, ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాకు ఎలాంటి అంతరాయం కలగకుండా స్థానికుల దర్శన కోటా పునరుద్ధరించామని చెప్పారు.

టిటిడి ట్రస్ట్ బోర్డు నిర్ణయం ప్రకారం డిసెంబర్ 03 మంగళవారం నుండి ప్రతి నెలలో మొదటి మంగళవారం స్థానికులకు దర్శనం కల్పిస్తారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లను జారీ చేశారు. స్థానిక భక్తుల దర్శనానికి టోకెన్లు తప్పనిసరి అని టీటీడీ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.

తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో 500 జారీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన ఉచితంగా టిక్కెట్లను జారీ చేస్తారు. దర్శన టోకెన్ పొందడానికి స్థానిక నివాసితులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుంది. ఆధార్‌ వివరాల ఆధారంగా టోకెన్లు జారీ చేస్తారు.

టోకెన్లను పొందిన యాత్రికులు వారి అసలు ఆధార్ కార్డుతో పాటు శ్రీవారి దర్శనం కోసం కాలినడకన దివ్య దర్శనం ప్రవేశ మార్గంలోకి (VQC)లోకి ప్రవేశించాలి. యాత్రికులకు సర్వదర్శనం టోకెన్ యాత్రికులతో సమానంగా ఒక చిన్న లడ్డూ ఉచితంగా అందిస్తారు. ఈ కేటగిరీలో ఒకసారి దర్శనం పూర్తి చేసుకున్న వారికి 90 రోజుల తర్వాత మాత్రమే దర్శనానికి అర్హత లభిస్తుంది.

చంద్రగిరి, తిరుపతి రూరల్, అర్భన్‌ మండలాలకు చెందినప స్థానిక ప్రజలకు ఉచితం టోకెన్లను మంజూరు చేస్తారు. ప్రతి నెల 1వ మంగళవారం చంద్రగిరి, తిరుపతి రూరల్, అర్బన్‌ మండలంలోని ప్రజలకు ఉచిత శ్రీవారి దర్శనం లభిస్తుంది. చంద్రగిరి, తిరుపతి మండలాల ప్రజలకు ఉచిత దర్శనం కల్పించాలని ఎమ్మెల్యే పులివర్తి నాని సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకులంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Whats_app_banner