Honor Killing: కులాంతర వివాహం చేసుకున్న అక్కను చంపిన తమ్ముడు.. రంగారెడ్డి జిల్లాలో లేడీ కానిస్టేబుల్ దారుణ హత్య-heartbreaking tragedy brother murders sister lady constable brutally killed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Honor Killing: కులాంతర వివాహం చేసుకున్న అక్కను చంపిన తమ్ముడు.. రంగారెడ్డి జిల్లాలో లేడీ కానిస్టేబుల్ దారుణ హత్య

Honor Killing: కులాంతర వివాహం చేసుకున్న అక్కను చంపిన తమ్ముడు.. రంగారెడ్డి జిల్లాలో లేడీ కానిస్టేబుల్ దారుణ హత్య

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 02, 2024 12:31 PM IST

Honor Killing: హైదరాబాద్‌లో మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గురైంది. కులాంతర వివాహం చేసుకున్న మహిళా కానిస్టేబుల్‌ను సొంత తమ్ముడే నరికి చంపాడు. కారుతో ఢీకొట్టి కొడవలిత నరికి హత్య చేశాడు.

హైదరాబాద్‌లో పరువు హత్య, మహిళా కానిస్టేబుల్‌ను నరికి చంపిన తమ్ముడు
హైదరాబాద్‌లో పరువు హత్య, మహిళా కానిస్టేబుల్‌ను నరికి చంపిన తమ్ముడు

Honor Killing: రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా పరువు హత్య చేసుకున్నందుకు మహిళా కానిస్టేబుల్‌ను సొంత సోదరుడు హత్య చేశాడు. ఇబ్రహీంపట్నంలో ఈ పరువు హత్య జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌‌లో ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది.

 రాయపోల్‌లో నివాసం ఉంటున్న మహిళా కానిస్టేబుల్‌ నాగమణిని ఆమె సోదరుడు పరమేష్‌ కారుతో ఢీకొట్టి కొడవలితో నరికి చంపాడు. నాగమణి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకోవడంతో కక్ష పెంచుకన్న పరమేష్ మాటు వేసి అక్కను చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాయపోలు నుంచి మన్యగుడ రహదారిపై ద్విచక్ర వాహనంపై కానిస్టేబుల్‌ నాగమణి ప్రయాణిస్తుండగా మాటు వేసి హత్యకు పాల్పడ్డాడు.  మృతురాలు నాగమణి స్వస్థలం రాయపోలుగా గుర్తించారు. ప్రస్తుతం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నాగమణి పనిచేస్తోంది.  నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్టు గుర్తించారు.  నాగమణి ప్రేమ వివాహం కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. 

2020 బ్యాచ్‌కు చెందిన నాగమణి నవంబర్ 1వ తేదీన శ్రీకాంత్‌ అనే యువకుడిని  వివాహం చేసుుంది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడంతో సోదరుడు ఆగ్రహంతో హత్య చేసినట్టు గుర్తించారు. హత్య తర్వాత పరమేష్ పోలీసులకు లొంగిపోయాడు. 

పోలీసుల నిర్లక్ష్యమే కారణం..

పెళ్లి తర్వాత రాయపోల్ గ్రామం నుంచి వెళ్లిపోయిన నాగమణి, శ్రీకాంత్‌ దంపతులు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. ఆదివారం సెలవు కావడంతో రాయపోల్‌లోని స్వగృహానికి వచ్చారు. ప్రేమ పెళ్లి తర్వాత  నాగమణి కుటుంబం నుంచి ప్రాణహాని ఉంటుందని పోలీసులను ఆశ్రయించారు. ఆ సమయంలో రాయపోల్ పోలీసులు నాగమణి  కుటుంబానికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. పోలీసుల సమక్షంలోనే ఆమె సోదరుడు వారి అంతు చూస్తానని బెదిరించినట్టు  నాగమణి భర్త శ్రీకాంత్ తెలిపాడు. 

కులాంతర వివాహమే కారణం…

ఆదివారం సెలవు కావడంతో గ్రామంలోని ఇంటికి వచ్చామని, సోమవారం ఉదయం విధులకు వెళ్లేందుకు బయల్దేరామని, నాగమణి కంటే పది నిమిషాల ముందు బయలు దేరి ఇబ్రహీంపట్నం చేరుకున్నానని, ఆ తర్వాత నాగమణి ఎక్కడ ఉందో ఫోన్ చేయగా మన్నెగూడ మీదుగా హ‍యత్‌ నగర్ వెళుతున్నట్టు చెప్పిందని శ్రీకాంత్ వివరించాడు.  

నాగమణి తనతో మాట్లాడుతుండగానే  ఆమెపై దాడి జరిగిందని, తన తమ్ముడు చంపడానికి  వచ్చాడని చెబుతుండగానే కాల్ కట్ అయినట్టు శ్రీకాంత్ వివరించాడు. వెంటనే తన కుటుంబసభ్యులకు  మన్నెగూడ సబ్‌స్టేషన్‌ వైపు వెళ్లమని చెప్పానని  తన అన్న వెళ్లే సరికి నాగమణి ప్రాణాలు కోల్పోయినట్టు వివరించాడు.  తమ కులాలు వేర్వేరు కావడంతోనే హత్య జరిగిందన్నాడు. నాగమణి పేరిట ఉన్న ఆస్తులు వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఆమె నిరాకరించిందని, ఆమె బంగారాన్ని ఇచ్చేయాలని నాగమణి కుటుంబ సభ్యులు గొడవ పెట్టుకున్నట్టు శ్రీకాంత్ సోదరి వివరించారు. 

Whats_app_banner