Vajedu SI Suicide: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య, ప్రేమ వ్యవహారమే కారణం?
Vajedu SI Suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడరు. ఆదివారం రాత్రి రిసార్టులో బస చేసిన ఎస్సై సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని మృతి చెందారు. ఎస్సై ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హరీశ్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు.
Vajedu SI Suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై హరీశ్ గత కొద్ది రోజులుగా ఒత్తిడికి గురైనట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం విధులకు వెళుతున్నట్టు చెప్పి ఓ రిసార్టుకు చేరుకున్నారు. రాత్రి తన గదిలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విధి నిర్వహణలో ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు మొదట ప్రచారం జరిగింది.
హరీశ్ ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గత వారం వాజేడులో మావోయిస్టుల దాడిలో అన్నదమ్ములు మృతి చెందారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ల పేరుతో ఇద్దరిని నరికి చంపడంతో వాజేడు ఎస్సైపై ఉన్నతాధికారులు ఒత్తిడి పెంచినట్టు చెబుతున్నారు. పోలీసుల విచారణలో ప్రేమ వ్యవహారంలో ఒత్తిడి వల్లే హరీశ్ ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు.
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన హరీశ్ వాజేడు ఎస్సైగా పనిచేస్తున్నారు. గత రాత్రి ప్రియురాలితో కలిసి రిసార్ట్‌కు వచ్చినట్టు గుర్తంచారు. హరీశ్‌కు ఇటీవల కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మరోవైపు మరో యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. హరీశ్ ఆత్మహత్యకు ఉన్నతాధికారుల ఒత్తిడి కారణమని మొదట ప్రచారం జరిగింది. ఆ తర్వాత ప్రేమ వ్యవహారంగా మలుపు తిరిగింది.
ఏమి జరిగిందంటే…
ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీలో ఉంటున్న ఉయిక రమేశ్ పేరూరు పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తుండేవాడు. అతని తమ్ముడు ఉయిక అర్జున్ స్థానికంగా పశువులను మేపుకుంటూ ఉండేవాడు. కాగా ఉయిక అర్జున్ కొద్దిరోజులుగా ఇన్ ఫార్మర్ గా మారి పోలీసులకు సమాచారం చేర వేస్తున్నట్లు మావోయిస్టులు అనుమానించారు. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి కొంతమంది మావోయిస్టులు గ్రామంలోకి చొరబడి ఉయిక రమేష్ తో పాటు ఉయిక అర్జన్ ను వేట గొడ్డళ్లతో దారుణంగా హత్య చేశారు. దీంతో ములుగు జిల్లాలో కలకలం చెల రేగింది. విషయం తెలుసుకున్న పోలీసు వర్గాల్లో కూడా అలజడి మొదలైంది.
లేఖ విడుదల చేసిన మావోలు
అన్నదమ్ములను హత్య చేసిన అనంతరం భారత కమ్యూనిస్ట్ మావోయిస్ట్ పార్టీ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరున లేఖ కూడా రిలీజ్ చేశారు. దాని సారాంశం ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఉయికె అర్జున్ గ్రామంలో ఉంటూ పోలీస్ ఇన్ ఫార్మర్ గా మారాడు. అతను వాజేడు మండలంలో ఉంటున్నాడు.
అతను షికారు పేరుతో చేపల వేటతో పాటు పశువులను మేపే పేరుతో అడవికి వెళ్లి అంతా తిరిగేవాడు. అక్కడ మావోయిస్టుల దళం మకాంలు, కదలికలు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తున్నట్టు మావోయిస్టు పార్టీ నేతలకు అనుమానం కలిగింది. దీంతో పద్ధతి మార్చుకోవాల్సిందిగా చెప్పినా వినడం లేదని పేర్కొంటూ.. అదే కారణంతో ఉయికె అర్జున్ ను ఖతం చేస్తున్నాం అంటూ లేఖలో పేర్కొన్నారు.
ఉలిక్కిపడిన ములుగు
ఉయికె అర్జున్ ను హతమార్చేందుకు మావోయిస్టులు అతడిని తీసుకెళ్లగా.. అడ్డుకునేందుకు వెళ్లిన అన్న రమేష్ ను కూడా మావోలు గొడ్డలి వేటుతో హత మార్చారని స్థానికులు చెబుతున్నారు. కాగా ఇద్దరు అన్నదమ్ముల హత్యతో ములుగు జిల్లా మరోసారి ఉలిక్కిపడగా.. పోలీసులు అలర్ట్ అయ్యారు. గ్రామంలో పోలీసులు మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్థానికులు ఎవరూ భయాందోళనకు గురి కావొద్దని సూచిస్తున్నారు.
కాగా జిల్లాలో కొద్దిరోజులుగా మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందగా.. ఇప్పటికే నిఘా పెంచారు. అయినా గురువారం అర్ధ రాత్రి అన్న దమ్ముల హత్య జరగడంతో రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి ఉనికి చాటుకున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచిస్తున్నారు.
మావోయిస్టు హత్యల తర్వాత వాజేడు పోలీస్ సిబ్బందిపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే ఎస్సై హరీశ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ప్రచారం జరుగుతోంది.