Mulugu Encounter : ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్.. అసలు ఏం జరిగింది? 10 ముఖ్యమైన అంశాలు-10 important points related to the encounter in mulugu district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mulugu Encounter : ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్.. అసలు ఏం జరిగింది? 10 ముఖ్యమైన అంశాలు

Mulugu Encounter : ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్.. అసలు ఏం జరిగింది? 10 ముఖ్యమైన అంశాలు

Basani Shiva Kumar HT Telugu
Dec 02, 2024 10:54 AM IST

Mulugu Encounter : తెలతెల్లవారంగా తుపాకీ మోతలతో ఏటూరునాగారం అడవులు దద్దరిల్లాయి. ఏం జరిగిందో.. ఎట్ల జరిగిందో.. పుల్లెల తోగు ఇసుక రక్తంతో ఎర్రగా మారింది. క్షణాల్లోనే ఏడుగురు మావోయిస్టులు నేలకొరిగారు. ములుగు జిల్లా చల్పాక సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్ సంచలనంగా మారింది. దీని గురించి 10 కీలక విషయాలు.

ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్
ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్

ములుగు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉలిక్కిపడింది. ఏకంగా ఏడుగురు మావోయిస్టులు పోలీస్ బలగాల చేతిలో హతమయ్యారు. ఆదివారం తెల్లవారకముందే.. పచ్చని అడవుల్లో తుపాకీ తూటాలు గర్జించాయి. మావోయిస్టుల శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్లాయి. ఏటూరునాగారం మండలం చల్పాక పంచాయతీ పోలకమ్మ వాగు అటవీ ప్రాంతం పుల్లెల తోగు వద్ద ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. అసలు ఎన్‌కౌంటర్ ఎలా జరిగింది.. ఎప్పుడు ఏమయ్యిందో ఓసారి చూద్దాం.

10 ముఖ్యమైన అంశాలు..

1.శనివారం సాయంత్రం 6 గంటలకు గ్రేహౌండ్స్‌ పోలీసులు కూంబింగ్‌ కోసం పోలకమ్మ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు.

2.ఆదివారం తెల్లవారు జామున 5:30 గంటల నుంచి 6:18 గంటల మధ్య పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

3.ఉదయం 7:10 గంటలకు ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం బయటకు వచ్చింది.

4.ఉదయం 10:33 గంటలకు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్‌ ఎన్‌కౌంటర్ జరిగిన స్థలానికి వెళ్లారు.

5.మధ్యాహ్నం 2:10 గంటలకు ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుంచి ఎస్పీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.

6.రాత్రి 11:35 గంటలకు మావోయిస్టుల మృతదేహాలను ఏటూరునాగారంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

7.శనివారం రాత్రి వరకు ప్రత్యేక పోలీసు బలగాలు సుమారు 300 మంది అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లుగా అక్కడి ప్రజలు చెబుతున్నారు.

8.ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల తహసీల్దార్లు ఎన్‌కౌంటర్‌‌లో చనిపోయిన మృతులకు శవ పంచానామా చేశారు. ఒక్కొక్కరి కిట్‌ బ్యాగులు పరిశీలించారు. భద్రు కిట్‌ బ్యాగులో రూ.46 వేల నగదు దొరికినట్టు సమాచారం.

9.ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో మావోయిస్టుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మావోయిస్టులు సేద తీరిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఇద్దరవి, మరో నలుగురివి 600 మీటర్ల దూరంలో కనిపించాయి. జమున మృతదేహం కిలో మీటరు దూరంలో పడి ఉంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో వంట సామగ్రి, విప్లవ సాహిత్యం చిందరవందరగా పడిపోయాయి.

10.పీఎల్‌జీఏ వారోత్సవాలకు ముందే మావోయిస్టు పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ్టి నుంచి 8వ తేదీ వరకు వారోత్సవాలను జరిపేందుకు రాష్ట్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది. దీనికి ఒక రోజు ముందే ఈ ఎన్‌కౌంటర్ జరగడం చర్చనీయాంశంగా మారింది.

Whats_app_banner