AP TG Rains : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్.. స్కూళ్లకు సెలవు
AP TG Rains : తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పగపట్టాడు. ముఖ్యంగా ఏపీపై పంజా విసురుతున్నాడు. ఫలితంగా రెండ్రోజులుగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. సోమవారం కూడా ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఫెంగల్ తుపాను క్రమంగా బలహీనపడి, తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో సోమవారం వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం రాత్రి పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసింది. డిసెంబర్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఏపీలో భారీ వర్షాలు..
ఫెంగల్ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. సోమవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో కలెక్టర్ ముందస్తుగా సెలవు ఇచ్చారు.
నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. రెండు రోజులుగా ఏపీపై వరుణుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఫెంగల్ తుపాను ప్రభావం ప్రధానంగా తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, బాపట్ల జిల్లాలపై పడింది. భారీ వర్షాల కారణంగా.. రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట తుపాను పాలైంది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది.
ఏపీపై ఫెంగల్ తుపాను ప్రభావం కొనసాగుతోంది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి గం.10:30 నుంచి 11:30 మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరం దాటిందని ఐఎండీ వెల్లడించింది. తుపాను పశ్చిమ- నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడనుందని తెలిపింది. తుపాను ప్రభావంతో ఆదివారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి.