Mulugu Encounter : ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో హైఅలర్ట్- తప్పించుకున్న మావోల కోసం గాలింపు
Mulugu Encounter : ములుగు జిల్లా మావోయిస్టుల ఎన్ కౌంటర్ తో ఉలిక్కిపడింది. ఆదివారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. మరో 7, 8 మంది తప్పించుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం చల్పాక ఫారెస్ట్ ఏరియాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ కలకలం సృష్టిస్తుండగా.. ములుగు, మహబూబాబాద్ జిల్లాల పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తప్పించుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ములుగు జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాల అటవీ ప్రాంతంలోని మండలాలైన కొత్తగూడ, గంగారం మండలాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా పోలీసులతో పాటు గ్రే హౌండ్స్, యాంటీ నక్సల్స్ టీమ్ సిబ్బంది అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అంతేగాకుండా ప్రధాన రహదారులపై వాహనాల తనిఖీ చేపడుతున్నారు. అనుమానాస్పదంగా కనిపించే వాహనాలు, వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. దీంతో ములుగు, మహబూబాబాద్ జిల్లాల సరిహద్దు మండలాల్లో హై అలర్ట్ వాతావరణం కనిపిస్తోంది.
ఎన్ కౌంటర్ సమయంలో 10 నుంచి 15 మంది?
చల్పాక ఎన్ కౌంటర్ కు ముందు పెట్రోలింగ్ టీమ్ సిబ్బందికి 10 నుంచి 15 మంది మావోయిస్టులు ఎదురైనట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ చెబుతున్నారు. కాగా ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు తేలగా.. ఇంకో ఏడెనిమిది మంది వరకు తప్పించుకున్నట్లు ఆయన భావిస్తున్నారు. ఎంతమంది తప్పించుకున్నారనే దానిపై పూర్తి స్పష్టత రాకపోయినా వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ములుగు ఏజెన్సీ ఏరియాలో పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అంతేగాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గూడేల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. అనుమానాస్పదంగా ఎవరూ కనిపించినా పోలీసులకు వెంటనే సమాచారం అందించాల్సిందిగా సూచించారు.
కొత్తగూడ, గంగారం మండలాల్లో హైటెన్షన్
ములుగు జిల్లా తాడ్వాయి మండలం చల్పాక ఫారెస్ట్ ఏరియాలో ఆదివారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. కానీ ఉదయం 11 గంటలు దాటిన తరువాత కూడా కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో ఎన్ కౌంటర్ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ చివరకు ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. కాగా ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టులు చల్పాక అటవీ ప్రాంతం నుంచి మహబూబాబాద్ జిల్లా వైపు వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కొత్తగూడ, గంగారం అటవీ ప్రాంతంలో కూడా పోలీసు బలగాలు, గ్రే హౌండ్స్, యాంటీ నక్సల్స్ టీమ్స్ భారీగా మోహరించాయి. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు చేపడుతూ మావోయిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలపై నిఘా పెట్టారు. దీంతో అటు ములుగు జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా పరిధిలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో కూడా హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కొద్దిరోజుల కిందటి వరకు సైలెంట్ గా ఉన్న అటవీ ప్రాంతంలో చాలాకాలం తరువాత బాంబుల మోత వినిపిస్తుండటంతో గొత్తి కోయలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని జనాల్లో కూడా భయాందోళన వ్యక్తమవుతోంది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి