Khammam Ragging : ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం, ఎంబీబీఎస్ విద్యార్థికి గుండు కొట్టించిన ప్రొఫెసర్
Khammam Ragging : ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ మెడికోకు కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ రహమాన్ గుండు కొట్టించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఖమ్మం మెడికల్ కళాశాలలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టారు. ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ నెల 12వ తేదీన ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. కాగా ఆ విద్యార్థికి చైనీస్ స్టైల్లో హెయిర్ కటింగ్ ఉండటంతో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అతడిని హెచ్చరించారు. సెకండియర్ విద్యార్థులు తనను కటింగ్ మార్చుకోమని చెప్పడంతో ఆ విద్యార్థి ట్రిమ్మింగ్ చేయించుకుని కళాశాలకు వచ్చాడు. దీంతో కళాశాలలో యాంటీ రాగింగ్ ఇన్ ఛార్జ్ గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ రహమాన్ ఆ విద్యార్థి కటింగ్ బాగోలేదని సెలూన్ కు తీసుకెళ్లి గుండు కొట్టించాడు. అయితే ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆ విద్యార్థికి గుండు కొట్టించడంతో ఆ విద్యార్థి ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన ప్రిన్సిపాల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రహమాన్ ను ర్యాగింగ్ కమిటీ బాధ్యతల నుంచి తప్పించారు. కాగా ఈ పరిణామం గోప్యంగా ఉంచినప్పటికీ ఆ నోటా ఈ నోటా పడి బయటికి పొక్కింది.
ర్యాగింగ్ బాధ్యులపై చర్యలు
ఖమ్మం వైద్య కళాశాలలో చోటు చేసుకున్న ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ర్యాగింగ్ పేరిట భవిష్యత్ పాడు చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై మంత్రి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి, తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అన్ని కాలేజీల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ సహకారం తీసుకోవాలన్నారు. ర్యాగింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం పడకుండా చూడాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. తమ జూనియర్లతో సీనియర్ స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ఉండాలి తప్పితే, ర్యాగింగ్ పేరిట వారిని భయాందోళనకు గురి చేయొద్దని హెచ్చరించారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి