Alipiri Foot Steps Way : అలిపిరి మెట్లమార్గం సమీపంలో వ్యక్తి మృతదేహం, కొంత దూరంలో జింక కళేబరం
Alipiri Foot Steps Way : తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా స్పెషల్ పార్టీ పోలీసులు...అలిపిరి-తిరుమల మెట్ల మార్గంలో కూంబింగ్ నిర్వహించారు. శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం, దానికి సమీపంలో జింక కళేబరం కలకలం రేపాయి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. అలిపిరి-తిరుమల మెట్ల మార్గంలో శ్రీ లక్ష్మి నరహింహ స్వామి ఆలయానికి సమీపంలో సుమారు 50-55 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తి మృతదేహం, గుర్తుపట్టలేని స్థితిలో పోలీసులకు కనిపించింది. ఈ నెల 4న పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని తిరుమల రెండో పట్టణ పోలీసులకు తెలియజేసి కేసు నమోదు చేశారు. ఈ వ్యక్తి సుమారు 15 రోజుల క్రితం మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, మరణానికి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు అన్నారు. పోస్ట్ మార్టం రిపోర్టులో పూర్తి విషయాలు తెలుస్తాయన్నారు.
ఏదో జంతువు వేటాడినట్లు
అదే రోజు స్పెషల్ పార్టీ పోలీసుల కూంబింగ్ లో... ఆ వ్యక్తి మృతదేహానికి సుమారు 70 మీటర్ల దూరంలో ఏదో ఒక జంతువు ఒక రోజు క్రితం వేటాడి తిని వదిలేసినట్లు ఉన్న జింక కళేబరాన్ని గుర్తించారు. జింక కళేబరానికి సుమారు 50 మీటర్ల దూరంలో 4 జతల చెప్పులు, తాగి పారేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉన్నట్లు గుర్తించారు. అయితే మనిషి మృతదేహానికి, జింక కళేబరానికి, చెప్పులకు ఎటువంటి సంబంధం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఈ విషయంపై సోషల్ మీడియాలో భక్తులను, ప్రజలను భయపెట్టే విధంగా వస్తున్న వదంతులను నమ్మొద్దని తిరుపతి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే రెండు మెట్ల మార్గాలలో అటవీ శాఖ, టీటీడీ, పోలీస్ శాఖ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
తిరుమల అన్నప్రసాదంలో జెర్రి
తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి పడిందని ఓ భక్తుడు ఆరోపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై టీటీడీ స్పందించింది. అన్నప్రసాదంలో జెర్రి పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారం అని టీటీడీ తెలిపింది. మాధవ నిలయంలోని అన్నప్రసాదంలో తాము తిన్న అన్నప్రసాదంలో జెర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు అవాస్తమని పేర్కొంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాదిమంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలను తయారుచేస్తారు. అంత వేడిలో ఏమాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రి ఉందని భక్తుడు పేర్కొనటం ఆశ్చర్యకరమని టీటీడీ తెలిపింది.
అవాస్తవాలను నమ్మొద్దు
ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియపెట్టి తరువాత పెరుగు కలుపుతారని, అటువంటప్పుడు ఏమాత్రం రూపు చెదరకుండా జెర్రి ఉండటం అనేది పూర్తిగా కావాలని చేసిన చర్యగా భావించాల్సి వస్తుందని టీటీడీ తెలిపింది. దయచేసి భక్తులు ఇటువంటి అవాస్తవాలను నమ్మకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
సంబంధిత కథనం