మార్గశిర మాసంలో వచ్చే పర్వదినాలు, ఆ రోజు పాటించాల్సిన నియమాలు - ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ-margashira festivals and the rules to be followed by the renowned spiritual leader brahma sri chilakamarthi ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మార్గశిర మాసంలో వచ్చే పర్వదినాలు, ఆ రోజు పాటించాల్సిన నియమాలు - ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ

మార్గశిర మాసంలో వచ్చే పర్వదినాలు, ఆ రోజు పాటించాల్సిన నియమాలు - ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ

HT Telugu Desk HT Telugu
Dec 02, 2024 12:00 PM IST

బ్రాహ్మీ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యత కలిగినదో, సంవత్సరానికి స్వయం విష్ణుస్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది.

భగవద్గీత
భగవద్గీత (Stock Photo)

"మాసానాం మార్గశీర్షోహం" – అన్నారు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు వంటివారితో పాటు స్వయం భగవానుముఖతః ప్రకటితమైన, శ్రీమద్భగవద్గీత అవతరించిన మాసం మార్గశిరం. అందుకే మాసాలన్నింలోనూ మార్గశిర మాసానికి ప్రత్యేక విశిష్టత ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మార్గశిర మాసం విశిష్టత ఏంటి? ఈ మాసంలో వచ్చే పర్వదినాలె, ఆ రోజుల్లో పాటించాల్సిన నియమాలను గురించి ఆయన చెబుతున్నారో తెలుసుకుందాం.

yearly horoscope entry point

మార్గశిర మాస విశిష్టత:

మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. అలా చూసుకుంటే దక్షిణాయనం చివరిభాగం, ఉత్తరాయణం ముందు వచ్చే భాగమైన మార్గశిరం పగలుకు ముందు వచ్చే బ్రాహ్మీముహూర్తం వంటిది. బ్రాహ్మీ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యత కలిగినదో, సంవత్సరానికి స్వయం విష్ణుస్వరూపమైన మార్గశిర మాసం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది. లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతీరోజూ శుభప్రదమైనదే.

మార్గశిర మాసంలో వచ్చే పర్వదినాలు, పాటించాల్సి నియమాలు:

  • మార్గశిర మాసం తొలిరోజు కార్తీకమాసమంతా వ్రతాలు చేసిన వారు పోలిని స్వర్గానికి పంపిండంతో అనగా నదీ స్నానం చేసి దీపాలు వదలుటతో ప్రారంభమవుతుంది.
  • ఆనాడు నదీ స్నానం చాల పుణ్యప్రదం. కుదరని వారు గంగా, యమున వంటి నదులను స్మరించుకొని స్నానం చేయడం శుభప్రదమని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
  • మార్గశిర శుద్ధ తదియ నాడు ఉమామహేశ్వర వ్రతం చేసి శివపార్వతులను ఆరాధించడం కొన్ని ప్రాంతాలలో ఉంది.
  • అలాగే మార్గశిర శుద్ధ పంచమి నాడు నాగపంచమిని జరుపుకునే ఆచారం కూడా ఉంది. కొన్ని ప్రాంతాలలో శ్రావణమాసంలో, మరి కొన్ని చోట్ల కార్తీక మాసంలో ఈ వ్రతం చేస్తారు.
  • పురాణాల ప్రకారం మార్గశిర శుద్ధషష్ఠి సుబ్రహ్మణ్యస్వామి జన్మదినం. శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన శుభదినం ఇది. ఈ రోజు ఉపవాసం ఉండి, సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగతయాని నమ్మిక. సంతానం కోరుకునే వారు స్వామిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది. ఈ రోజున దేశంలో గల పలు సుబ్రహ్మణ్య ఆలయాలలో విశేషమైన పూజలూ, ఉత్సవాలూ, నాగప్రతిష్టలూ జరుగుతాయి.
  • మార్గశిర శుద్ధ అష్టమి పరమశివుడి ఉగ్రరూపమైన కాల భైరవుని జన్మదినం. దీనినే కాలభైరవాష్టమి అంటారు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం కాలభైరవావతారం. పురాణాల ప్రకారం కాలభైరవుడు కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ కాశీకి వచ్చిన, కాశీలో మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్కచూస్తుంటాడు. శునకం కాలభైరవ స్వరూపం కనక ఈ శునకాన్ని పూజించి, గారెలు వండి, దండగా గ్రుచ్చి, శునకం మెడలో వేస్తుంటారు.
  • మార్గశిర శుద్ధేకాదశి శ్రీమద్భగవద్గీత లోకానికి అందినరోజు. దీనినే వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి లేదా సౌఖ్యద ఏకాదశి అని కూడా పిలుస్తారు. సాక్షాత్ భగవత్స్వరూపాన్ని మానవులు తెలుసుకోగలిగే విధంగా, అంతేకాకుండా సులభమైన రీతిలో ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గాన్ని ఇందులో భగవానుడు చెప్పాడు.
  • భగవద్గీత నిత్యపారాయణ, నిత్య ఆచరణా గ్రంథమైనప్పటికీ, విశేషించి ఈనాడు శ్రీకృష్ణుని తలచుకుని గీతాపారాయణ, గీతా అధ్యయనం, అనుష్టానం చేస్తే మరింత పుణ్యఫలం దక్కుతుందని చిలకమర్తి వివరించారు.
  • మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు. ఈరోజున దశావతారాలలో తోలి అవతారమైన మత్స్య అవతారాన్ని పూజిస్తారు.
  • మార్గశిర శుద్ధపూర్ణ శ్రీ దత్తజయంతి. దీనినే కోరలపూర్నిమ, నరక పూర్ణిమ అని కూడా అంటారు. ఈనాడు అగ్నిపురాణం దానం చేస్తే మంచిది. సాక్షాత్ త్రిమూర్తులలోని విష్ణువు అంశగా అత్రి, అనసూయ దంపతులకు జన్మించిన దత్తాత్రేయుడు, మౌనముద్రతోనే ఉపదేశం చేసి, పరమగురువయ్యాడు. ప్రకృతిలోని 24 మంది గురువుల వద్ద విద్యను అభ్యసించి ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయుడు. ఆత్మతత్త్వాన్ని లోకానికి ఎరుకపరచి గురువులకే గురువైన అవధూతగా నిలిచాడు. ఈరోజున దత్తచరిత్ర పారాయణ చేసి, ఆ పరమగురువుని స్మరించుకోవడం అత్యంత శుభదాయకం.
  • మార్గశిరమాసంలో వచ్చే లక్ష్మివారం(గురువారం) నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకలైశ్వర్యాలూ కలుగుతాయని నమ్మకం. ఆ రోజున స్త్రీలు నియమానుసారంగా లక్ష్మీదేవిని పూజించి, వ్రతంలో చెప్పిన విధంగా నైవేద్యం సమర్పించి, వ్రతకథను చదువుకొనాలి. అలా అ మాసంలో వచ్చే అన్ని లక్ష్మివారాలూ ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్దిస్తుంది. పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా లక్ష్మీదేవిని పూజించి, ఆనాడు తమ శక్త్యనుసారం ముత్తైదువలకి భోజనం పెట్టి, పసుపు, కుంకుమ పువ్వులు, తాంబూలం మొదలగు మంగళద్రవ్యాలనివ్వాలి. ఇలా నియమం తప్పకుండా చేసేవారి ఇంట లక్ష్మీదేవి కొలువుంటుంది అని పురాణప్రోక్తం.
  • ఇంకా మార్గశిరమాసంలోనే విష్ణువుకి ప్రీతికరమైన ధనుర్మాసం వస్తుంది. ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుఝామున నిద్రలేచి, స్నానం చేయడం ఆచారమైంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

 బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner