Lakshmi Devi Impression: లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం ఏమేం చేయాలి, చేయకూడనివేంటి
Lakshmi Devi Impression: తరతరాలుగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే అది కచ్చితంగా శుక్రవారమే సాధ్యమని ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటి ముఖ్యమైన రోజు సంతోషపడే కొన్ని పనులు చేస్తున్నా, చేయకూడని పనులు కూడా చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకున్నారా..
సకల మానవాళి ధన ధాన్యాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, శక్తి, శ్రేయస్సు, సంతోషంతో నిండిన జీవితాన్ని గడపాలంటే లక్ష్మీ కటాక్షం తప్పనిసరి. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాసాలు, పూజలు, వ్రతాలు, నోములు వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం, ఇవన్నీ చేయడానికి శుక్రవారం చాలా ప్రత్యేకం. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. సర్వలోక రక్షిణి, సర్వజ్ఞానప్రదాయిని, శక్తి స్వరూపిణి అయిన లక్ష్మీ దేవిని శుక్రవారం భక్తిశ్రద్ధలతో కొలిస్తే ఆమె అనుగ్రహం పొందవచ్చని నమ్ముతారు. అయితే అమ్మవారిని ఆరాధించడమే కాకుండా ప్రత్యేక పనులు చేయడం ద్వారా మరికొన్ని శుభాలను పొందొచ్చు. అదే సమయంలో లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు మరికొన్ని పనులు చేయడం నిషిద్ధమని నమ్ముతారు.
శుక్రవారం తీసుకున్న కొద్దిపాటి చర్యలు జీవితంలో పురోగతిని తెస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోండి.
శుక్రవారం లక్ష్మీదేవీ ప్రసన్నం చేసుకునేందుకు చేయాల్సినవి
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం పూజ అనంతరం ఆవుకు రొట్టె తినిపించాలి. ఆహారం దానం చేయడంతో అన్నదానం పూర్తవుతుంది. ఆ తర్వాత వస్త్రదానంగా నిరుపేదలకు బట్టలు దానం చేయాలి. వీలైతే శుక్రవారం ఉపవాసం పాటించాలి. లక్ష్మీ దేవికి నైవేద్యంగా పాయసం సమర్పించడం ద్వారా అమ్మవారు సంతోషించి భక్తులకు శుభాలు కలిగిస్తుందని నమ్ముతారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు ఈ రోజున లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని పూజించాలి. శ్రీ లక్ష్మీ సూక్త పారాయణం చేయాలి.
శుక్రవారం అస్సలు చేయకూడని పనులు
సర్వలోక రక్షిణి, శక్తి స్వరూపిణి అయిన లక్ష్మీ దేవీ ఒక చోట స్థిరంగా ఉండదు. ఎవరైతే మితిమీరిన అహంకార ధోరణితో వ్యవహరిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం సిద్ధించదు. శుక్రవారం రోజు మొత్తం డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండాలి. చాలామందికి శుక్రవారం నాడు ఇచ్చిన సొమ్ము తిరిగి రాదనే నమ్మకం ఉంటుంది. అందుకే ఆ రోజు ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదని పెద్దల మాట. ఈ రోజు మొత్తం ఎవరినీ కించపరచకూడదు. ముఖ్యంగా మహిళలు, బాలికలను అవమానించకూడదు. లక్ష్మీ దేవిని స్త్రీల నివాసంగా భావిస్తారు. శుక్రవారం రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. కొద్దిప్రాంతాలలో ఉన్న నమ్మకం ప్రకారం, ఈ రోజున పుల్లని ఆహారానికి దూరంగా ఉండాలి.
పూజలో మరిచిపోకూడనివి:
అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శుక్రవారం నాడు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఎరుపు రంగుతో కలిసి ఉన్న వస్త్రాలు ధరించాలి. అదే రోజు అమ్మవారి ముందు ఉదయం, సాయంత్రం సమయాల్లో తప్పకుండా నెయ్యి దీపం వెలిగించాలి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఎరుపు రంగు వస్తువులను సమర్పించాలి. ఎరుపు రంగు గాజులు, ఎరుపు గులాబీలు అమ్మవారి పూజలో ఉంచాలి. భక్తి శ్రద్దలతో ఉపవాస దీక్ష చేపట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన పాయసం నైవేద్యంగా పెట్టాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.