Winter: దాహం అవడం లేదని చలికాలంలో సరిపడా నీరు తాగడం లేదా? ఆరోగ్యానికి ఈ రిస్క్‌లు
Water Drinking in Winter: శీతాకాలంలో సరిపడా నీరు తాగకపోతే ఆరోగ్యానికి చాలా రిస్కులు ఉంటాయి. దాహం అవట్లేదని నీటిని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. తక్కువ నీరు తాగితే వచ్చే సమస్యలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
చలికాలంలో తరచూ దాహం వేయదు. వాతావరణం చల్లగా ఉండటంతో నీరు తాగాలని ఎక్కువగా అనిపించదు. దీంతో కొందరు శరీరానికి సరిపడా నీటిని శీతాకాలంలో తాగరు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. దాహం వేయకపోతే నీరు తాగడం ఎందుకని అనుకుంటారు. అయితే, చలికాలమైనా సరే రోజులో కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాల్సిందే. అంతకంటే తక్కువ తాగితే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయి. గుండె, కిడ్నీలకు ఇబ్బందితో పాటు మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. తగిన నీరు తాగపోతే కలిగే రిస్క్‌లు ఏవో ఇక్కడ చూడండి.
తలనొప్పి, అలసట
శీతాకాలంలో శరీరానికి సరిపడా నీరు తాగకపోతే తల నొప్పిగా ఎక్కువగా వస్తుంది. అలసినట్టుగా, నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. నీరు దాహం వేయకపోయినా శరీరంలో డీహైడ్రేషన్ జరుగుతూనే ఉంటుంది. అందుకే చలికాలంలో ప్రత్యేత శ్రద్ధ వహించి నీరు తాగాలి.
గుండెపై ప్రభావం
నీటి తగినంత తాకగపోతే శరీరంలో పొటాషియం, సోడియం ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బ తింటుంది. దీనివల్ల గుండె పని తీరుకు ఇబ్బంది కలుగుతుంది. గుండె స్పందనలో అసమతుల్యత ఎక్కువ అవుతుంది. నీరు తక్కువగా తాగితే శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగదు. దీనివల్ల కూడా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. మొత్తంగా సరిపడా నీరు తీసుకోకపోతే గుండెపై దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
జీర్ణ సమస్యలు
తగినంత నీరు తాకగపోతే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేయదు. దీంతో తిన్న ఆహారం ఎక్కువ సేపు జీర్ణం కాకుండా శరీరం భారంగా అనిపిస్తుంది. అలాగే నీరు తక్కువైతే శరీరంలోని వ్యర్థాలు బయటికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటాయి. వ్యర్థాలు పేరుకుపోతే అవయవాల పనితీరుపై చెడు ప్రభావం పడుతుంది.
కిడ్నీలకు రిస్క్
నీరు తక్కువగా తాగితే కిడ్నీలపై ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. రక్తం నుంచి వ్యర్థాలను వేరు చేసి బయటికి పంపడం మూత్రపిండాలకు కష్టమవుతుంది. దీంతో నీరు తక్కువగా తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు వచ్చే రిస్క్ పెరుగుతుంది. కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే మూత్రపిండాల పనితీరు ఆరోగ్యంగా, మెరుగ్గా ఉండాలంటే తగినంత నీరు తాగడం తప్పనిసరి.
కండరాలు, కీళ్ల నొప్పులు
చలికాలంలో సరిగా నీరు తాగకపోతే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సరిపడా ఉండవు. దీంతో కీళ్ల నొప్పులు అధికం అవుతాయి. ఆర్థరైటిస్ ఉన్న వారికి నొప్పులు మరింత తీవ్రం అవుతాయి. తక్కువ నీటి వల్ల కండరాల నొప్పి కూడా తలెత్తుతుంది. ఎముకల దృఢత్వానికి కూడా దెబ్బే.
చర్మానికి సమస్యలు
చలికాలంలో మామూలుగానే చర్మం ఎక్కువగా పొడిబారుతుంది. మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. దానికి తోడు నీరు సరిపడా తాగకపోతే ఈ చర్మ సమస్యలు మరింత తీవ్రం అవుతాయి. చర్మంలో తేమ ఇంకిపోయి మరింత పొడిగా అవుతాయి. ర్యాసెష్ ఎక్కువయ్యే రిస్క్ ఉంటుంది. నీరు తక్కువైతే పెదవులు పగలడం కూడా అధికమవుతుంది.
అందుకే చలికాలమైనా సరే శరీరానికి సరిపడా నీరు తాగాలి. రోజులో కనీసం మూడు లీటర్ల నీరు తీసుకోవాలి. దీంతో చాలా సమస్యలు దరిచేరకుండా ముందు జాగ్రత్త పడినట్టు అవుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు.