లేడీ సూపర్ స్టార్ నయనతార చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. నయనతార జీవితం, పెళ్లి ఆధారంగా తెరకెక్కిన ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ గత నెల 18న ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కానీ.. ఆ డాక్యుమెంటరీలో వాడిన క్లిప్‌పై ఇప్పటికే హీరో ధనుష్ కోర్టుకి వెళ్లగా.. సోమవారం ఆమెకి కోర్టు నోటీసులు జారీ చేసింది.
నయనతార డాక్యుమెంటరీ విడుదలకు ముందు నటుడు ధనుష్ ఒక నోటీసుని నయనతారకి పంపించాడు. తాను నిర్మాతగా వ్యవహరించిన ఆ సినిమాలోని క్లిప్‌ను అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో వినియోగిస్తున్నందుకు రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలని పేర్కొన్నాడు. కానీ.. బహిరంగ లేఖతో ధనుష్‌కి సమాధానమిచ్చిన నయనతార.. ఆ క్లిప్‌ను అలానే డాక్యుమెంటరీలో కొనసాగించింది. దాంతో .. మరోసారి నోటీసులు జారీ చేసిన ధనుష్ కోర్టు మెట్లు ఎక్కారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. సమాధానం వివరణ ఇవ్వాల్సిందిగా నయనతారని ఆదేశించింది.
ధనుష్‌తో వివాదం కంటే ముందేనయనతారపై ఒక కేసు పెండింగ్‌లో ఉందని.. అందులో ఆమెకు శిక్ష పడుతుందని ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు పైల్వాన్ రంగనాథన్ చెప్పుకొచ్చాడు. కింగ్ 24×7 ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్.. కేరళ నుంచి వలస వచ్చింది. ఆమెపై ఇప్పటికే కేరళలో కూడా కేసులు ఉన్నాయి. ఒక సౌందర్య సాధనాలు, శానిటరీ న్యాప్‌కిన్స్‌లను అమ్మడానికి నయనతార కంపెనీకి ఏర్పాట్లు చేసింది. అయితే ఆమె కంపెనీ అమ్మే ఉత్పత్తులు ప్రామాణికమైనవి కావని.. ఐఎస్ఐ బ్రాండెడ్ కాదని సామాజిక కార్యకర్త కేసు దాఖలు చేశారు. ఈ కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది’’ అని పైల్వాన్ రంగనాథన్ వెల్లడించాడు.
‘‘నయనతారపై మరో కేసు కూడా ఉంది. కేరళలోని ఒక ప్రముఖ మ్యూజిక్ ఆల్బమ్‌లోని ఆల్బమ్‌ను తన యాడ్ ఫిల్మ్ కోసం వాడుకుంది. అయితే.. సదరు మ్యూజిక్ ఆల్బమ్ కంపెనీ నుంచి ఆమె నిరభ్యంతర పత్రం తీసుకోలేదు. ఫలితంగా మ్యూజిక్ కంపెనీ దావా వేసింది. ఈ కేసులో నయనతారకు కచ్చితంగా జరిమానా పడే అవకాశం ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు’’ అని పైల్వాన్ రంగనాథన్ చెప్పుకొచ్చారు.
ఈ మ్యూజిక్ ఆల్బమ్‌ను ఫహద్ ఫాజిల్ సినిమా అవేశంలోనూ ఉపయోగించారు. అయితే.. ఆవేశం టీమ్ ముందుజాగ్రత్తల్లో భాగంగా ఎన్‌వోసీ తీసుకుంది. ఇది నయనతారని మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది.
నయనతార డాక్యుమెంటరీలో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని కోర్టులో నయనతార లాయర్ స్పష్టం చేశారు. ‘‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ సినిమాలో చిత్రీకరించిన సన్నివేశాలను ఉపయోగించలేదు. కాబట్టి, మేము ఎటువంటి ఉల్లంఘనకు పాల్పడలేదు. ఇక్కడ కాపీరైట్ సమస్యే లేదు. ఈ డాక్యుమెంటరీలో సెట్స్‌లో తీసిన వ్యక్తిగత షాట్లను మాత్రమే ఉపయోగించాం. కాబట్టి ఇది నిబంధనల ఉల్లంఘన కిందకి రాదు’’ అని నయనతార లాయర్ కోర్టుకి విన్నవించారు.