Vignesh Shivan: ధనుష్‌తో వివాదంలో నెటిజన్లకి దొరికిన నయనతార భర్త విఘ్నేశ్ శివన్..ట్రోలింగ్ దెబ్బకి ట్విట్టర్ నుంచి ఔట్
Vignesh Shivan Twitter account: హీరో ధనుష్‌ని కార్నర్ చేయబోయిన నయనతార భర్త విఘ్నేశ్ శివన్.. తానే దొరికిపోయాడు. దాంతో నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేయడంతో ట్విట్టర్ (ఎక్స్) నుంచి వైదొలిగాడు
తమిళ్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య వివాదం గత రెండు వారాలుగా కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై ఇప్పటికే ధనుష్ కోర్టుని ఆశ్రయించగా.. నయనతార కూడా లీగల్ ఫైట్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నోరుజారి.. నెటిజన్లకి అడ్డంగా దొరికిపోయాడు. దాంతో.. నెటిజన్లు అతడ్ని ట్రోల్ చేయడంతో ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసేశాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
నయనతార బయోగ్రఫీతో తెరకెక్కిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీని ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీలో నేనూ రౌడీనే సినిమాకి సంబంధించిన 3 సెకన్ల క్లిప్‌ను నయనతార వినియోగించారు. అయితే.. ఆ సినిమాకి నిర్మాత అయిన ధనుష్.. తన అనుమతి లేకుండా ఆ క్లిప్‌ను వాడినందుకు రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలని నోటీసులు పంపాడు.
బహిరంగ లేఖతో నయన్ ఘాటు రిప్లై
ధనుష్ నోటీసులపై నయనతార ఘాటుగా బహిరంగ లేఖతో రిప్లై ఇచ్చింది. 3 సెకన్ల క్లిప్‌కి రూ.10 కోట్లు ఏంటి? అంటూ ఎగతాళి చేస్తూనే.. మనసులో ఏదో ద్వేషం పెట్టుకుని ధనుష్ తనని వేధిస్తున్నట్లు ఆ లేఖలో రాసుకొచ్చింది. దాంతో.. నయన్‌కి మద్దతుగా ఒకప్పుడు ధనుష్‌తో కలిసి పనిచేసిన హీరోయిన్లు సైతం నిలబడగా.. కోలీవుడ్ నుంచి ధనుష్ వైపు కూడా కొంత మంది నిలబడ్డారు. దాంతో ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోవడంతో వివాదం తారా స్థాయికి చేరింది.
విఘ్నేశ్ శివన్ ఎందుకు టార్గెట్ అయ్యాడు?
వాస్తవానికి నేనూ రౌడీనే సినిమాతోనే విఘ్నేశ్ శివన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ మూవీలో విజయ్ సేతుపతి హీరోగా నటించగా.. నయనతార హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలవడంతో.. విఘ్నేశ్ శివన్ దర్శకుడిగా స్థిరపడ్డాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నయన్, విఘ్నేశ్ శివన్ ప్రేమ మొదలైంది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. నయనతార తన డాక్యుమెంటరీలో ఆ మూవీ క్లిప్‌ను వాడుకోవడాన్ని సెంటిమెంట్‌గా భావించింది. ధనుష్ బెదిరించినా.. ఆ క్లిప్‌ను తొలగించేందుకు ఇష్టపడలేదు.
నోరుజారి.. ట్రోలింగ్‌కి గురైన విఘ్నేశ్ శివన్
ధనుష్, నయనతార వివాదంలో.. ధనుష్‌ని కార్నర్ చేయబోయిన విఘ్నేశ్ శివన్ నోరుజారాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేనూ రౌడీనే సినిమాని చూసి.. అజిత్ తన మూవీ ఎంతవాడు గాని సినిమాలో పాటలు రాసే అవకాశం ఇచ్చాడని విఘ్నేశ్ శివన్ చెప్పుకొచ్చాడు. అయితే.. ‘ఎంతవాడు గాని’ మూవీ రిలీజ్ తర్వాతే.. నేనూ రౌడీనే సినిమా వచ్చింది కదా? మరి అజిత్ ఎలా ఆ సినిమా చూసి.. నీకు ఛాన్స్ ఇచ్చాడు అని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలెట్టారు. ధనుష్ ఫ్యాన్స్ అయితే.. అబద్ధాలు చెప్పడానికి కూడా ఓ హద్దు ఉంటుంది అంటూ శివన్‌ని ఏకిపారేస్తున్నారు. దాంతో శివమ్ విఘ్నేశ్ నుంచి సమాధానం లేకపోయింది. చివరికి ట్రోలింగ్‌ను భరించలేక.. ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్‌ను విఘ్నేశ్ శివన్ డీయాక్టివేట్ చేశాడు.