Aavesham Box office: మలయాళంలో మరో బ్లాక్‌బస్టర్.. రూ.100 కోట్ల మార్క్ దాటిన ఫహద్ ఫాజిల్ ఆవేశం
Aavesham Box office: మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. ఫహద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీ కూడా రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.
Aavesham Box office: మలయాళం ఇండస్ట్రీకి 2024 బాగా కలిసొస్తోంది. ఇప్పటికే ఆ ఇండస్ట్రీ నుంచి భ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, ది గోట్ లైఫ్ లాంటి సినిమాలు సక్సెస్ కాగా.. ఇప్పుడు ఫహద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీ కూడా ఆ లిస్టులో చేరింది. ఏప్రిల్ 11న రిలీజైన ఈ సినిమా కేవలం 13 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.
ఆవేశం బాక్సాఫీస్
మలయాళం సినిమాలు ఇన్నాళ్లూ కంటెంట్ పరంగా అందరినీ ఆకట్టుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు మాత్రం అడపాదడపా వచ్చేవి. కానీ ఈ ఏడాది మాత్రం బాక్సాఫీస్ దగ్గర కూడా దుమ్మురేపుతున్నాయి. ఒకదాన్ని మించి మరొక సినిమా వసూళ్లు వర్షం కురిపిస్తోంది. తాజాగా ఫహద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీ 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
ఈ ఘనత సాధించిన 7వ మలయాళం సినిమాగా నిలిచింది. ఈ ఏడు సినిమాల్లో నాలుగు ఈ ఏడాదివే కావడం విశేషం. ఈ ఏడాది ఇప్పటికే ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, ది గోట్ లైఫ్ సినిమాలు రూ.100 కోట్లకుపైగా వసూలు చేశాయి. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ ఆవేశం మూవీని జీతూ మాధవన్ డైరెక్ట్ చేశాడు. ఇందులో ఫహద్ నటనకు అభిమానులే కాదు పలువురు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లు సాధిస్తూనే ఉంది.
కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ఐదింతల లాభాలను తెచ్చిపెట్టడం విశేషం. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి జేబులు నింపుకోవడం ఎలాగో మలయాళం ఫిల్మ్ మేకర్స్ నుంచి నేర్చుకోవచ్చు.
ఆవేశం ఓటీటీ
ఆవేశం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పైనా బజ్ నెలకొంది. ఈ సినిమా మే 17 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు భావిస్తున్నారు. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లోనూ వస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇక ఆవేశం మూవీ విషయానికి వస్తే.. గ్యాంగ్‌స్టర్ కథకు మదర్‌సెంటిమెంట్, కామెడీని జోడించి దర్శకుడు జీతూ మాధవన్ ఆవేశం మూవీ కథను రాసుకున్నాడు. శాంతన్ (రోషన్ శాన్‌వాజ్), బీబీ (మిథున్ జై శంకర్), అజు(హిప్‌స్టర్) ఇంజనీరింగ్ చదవడానికి కేరళ నుంచి బెంగళూరు వస్తారుఈ ముగ్గురిని ర్యాగింగ్ పేరుతో సీనియర్లు వేధిస్తారు.
ఈ సినిమాలో సాజిన్ గోపు, రోషన్‌శాన్‌వాజ్, మిథున్ జైశంకర్, మన్సూర్ అలీఖాన్ కీలక పాత్రలు పోషించారు. ఆవేశం మూవీలో హీరోగా నటిస్తూనే ఈ సినిమానే తానే స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు ఫహాద్ ఫాజిల్. 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఐదింతల లాభాలను తెచ్చిపెట్టింది. మలయాలంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిన్న సినిమా ప్రేమలు మూవీని కూడా ఫహాద్ ఫాజిల్ తన స్నేహితులతో కలిపి ప్రొడ్యూస్ చేశాడు.
టాపిక్