HYD Cheating: పాతికేళ్ల వయసులోనే కోట్లలో మోసాలు.. సెలబ్రిటీలే బాధితులు, హైదరాబాద్‌లో విశాఖ యువకుడి నిర్వాకం
HYD Cheating: పాతికేళ్ల యువకుడు పెట్టుబడులు, లాభాల పేరుతో పలువురు ప్రముఖుల్ని మోసం చేశాడు. పదో తరగతి కూడా పాస్ కాకుండానే కోట్లలో కుచ్చుటోపీ పెట్టాడు.విశాఖకు చెందిన తొనంగి కాంతిదత్ వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్ సెలబ్రిటీలను షాక్‌కు గురి చేస్తోంది. బాధితులు అతని మాటలు ఎలా నమ్మారనేది ప్రశ్నగా మారింది.
HYD Cheating: చదివింది పదో తరగతి, పాతికేళ్ల లోపు వయసు, చీటింగ్ తెలివి తేటల్లో మాత్రం ఆరితేరిపోయాడు. అధిక లాభాల పేరుతో ప్రముఖులను పెట్టుబడుల ఉచ్చులోకి దించి కోట్లలో నిలువునా ముంచేశాడు. విశాఖపట్నంకు చెందిన తొనంగి కాంతిదత్ నిర్వాకంతో పలువురు ప్రముఖులు కోట్ల రుపాయలు పోగొట్టుకున్నారు. మోసం చేయడమే లక్ష్యంగా క్రిమినల్ తెలివి తేటలతో షార్ట్‌టైమ్‌లో కోట్లు కొల్లగొట్టాడు.
పదో తరగతి ఫెయిలైన తర్వాత జులాయిగా తిరిగిన కాంతిదత్ కొన్నేళ్ల క్రితం విశాఖపట్నంలో ఓ ఈవెంట్ నిర్వహించాడు. ఆ కార్యక్రమానికి కొందరు సెలబ్రిటీ లను పిలిపించాడు. ఆ తర్వాత వారితో పరి చయాలు పెంచుకున్నాడు. వారి ద్వారా పలువురు రాజకీయ, సినీ తారలతో పరిచయం చేసుకుని, వారితో ఫొటోలు దిగేవాడు. ఆ తర్వాత వారంతా తన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారని మరికొందరిని నమ్మించాడు. విశాఖపట్నంలో మొదట పింక్‌థాన్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాడు. డిజైనర్ శిల్పారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమం కోసం విశాఖపట్నానికి చెందిన శిరీ షారెడ్డి నుంచి రూ.60 లక్షలు వసూలు చేశాడు. 18ఏళ్ళ వయసులో 2018లో కుటుంబంతో పాటు హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. విశాఖలో నిర్వహించిన పింక్‌థాన్ కార్యక్రమంలో పరిచయమైన శిల్పారెడ్డితో కలిసి 'సస్టెయినబుల్ కార్డ్' పేరుతో జూబ్లీహిల్స్ కేంద్రంగా వర్యా వరణ హితమైన ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. అందులో శిల్పారెడ్డి కూడా రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టింది. క్రమంగా నష్టాలు రావడంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడంతో శిల్పా రెడ్డి ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు.
ఆ తర్వాత కోకాపేటలో నివాసం ఏర్పరచుకున్న కాంతిదత్ నయోమి హోటల్స్ పేరుతో జూబ్లీహిల్స్ తరువాత బంజారాహిల్స్, ఖాజాగూడ ప్రాంతాల్లో బ్రాంచీలు ప్రారంభించాడు. ఈ హోటల్స్ కోసం ఏపీకి చెందిన మాజీ మంత్రి కుటుంబంతో పాటు సినీనటుడి కుటుంబం భాగస్వాములుగా ఉన్నారని చెప్పి సౌమ్య అనే మహిళతో పాటు మరో మహిళ నుంచి రూ.1. 40 కోట్ల పెట్టుబడులు సేకరించాడు. ఆ తర్వాత బంజా రాహిల్స్, ఖాజాగూడలలో హోటల్స్ మూసేశాడు. పెట్టుబడులు పెట్టిన వారిని మోసం చేశాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత హైదరాబాద్‌లో తృతీయ జువెలర్స్ సంస్థను నెలకొల్పాడు. సినీ నటి ఒకరు అందులో భాగస్వామిగా ఉన్నట్టు ప్రచారం చేసి హైదరాబాద్‌కు చెందిన శ్రీజా రెడ్డి, ప్రవీణ్ అనే వారిని భాగస్వాములుగా చేర్చుకుని వారి నుంచి పెట్టుబడి పేరుతో రూ.5.8 కోట్లను వసూలు చేశాడు.
జువెలర్స్‌లో పెట్టుబడి పేరుతో డబ్బులు తీసుకుని కాంతిదత్ తనను మోసం చేశాడని గత ఫిబ్రవరిలో శ్రీజారెడ్డి జూబ్లీ హిల్స్ పోలీసులకు చేసిన ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరచడంతో 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
నిందితుడు కాంతిదత్ పలువురు రాజకీయ నాయకులు, ఆధ్యాత్మిక కేంద్రాల నిర్వాహకులు, సినీ ప్రముఖులతో పరిచయాలు చేసుకుని వారి ద్వారా మరికొందరిని ఉచ్చులో చిక్కుకునేలా తెలివిగా నేరానికి పాల్పడినట్టు గుర్తించారు. ప్రముఖులు హాజరయ్యే పార్టీలకు హాజరయ్యేవాడని వారితో పరిచయం చేసుకుని నేరాలకు పాల్పడినట్టు విచారణలో గుర్తించారు. బ్యాంకాక్‌కు చెందిన వారితో పెట్టుబడులతో పేరుతో చర్చలు జరుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
నిందితుడిపై ఇప్పటికే పలు పోలీస్ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది జులైలో మాదాపూర్‌లో కారుతో, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి రాపిడో డ్రైవర్ రాజశేఖర్ మృతి చెందిన కేసులో కాంతిదత్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జూబ్లీహిల్స్ పోలీసులు గత ఏడాది డిసెంబరులో ఫోర్జరీ కేసు నమోదు చేశారు. ఆ కేసులో ముందస్తు బెయిలు పొందాడు.
మోసాలు చేసి సంపాదించిన డబ్బుతో జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 82లో దాదాపు రూ.5.8 కోట్ల విలువైన ఇల్లు కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నట్టు గుర్తించారు. పెట్టుబడుల పేరుతో వసూలు చేసిన డబ్బులతో విలాసవంతంగా జీవిస్తున్నట్టు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా నిందితుడిపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు చెప్పుకున్న ప్రముఖులు అతని ఆర్ధిక లావాదేవీలతో తమకు సంబంధం లేదని పోలీసులకు వివరించారు.