APSRTC : ఆర్టీసీ గుడ్‌న్యూస్.. పంచ వైష్ణవ క్షేత్ర దర్శినికి ప్రత్యేక బస్సులు.. ప్యాకేజీ వివరాలు ఇవే
APSRTC : పుణ్యక్షేత్రాల యాత్ర చేసే భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పంచ వైష్ణవ క్షేత్ర దర్శిని పేరుతో పుణ్యక్షేత్రాలకు స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిసెంబర్ మాసంలో 4 రోజులు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
రాష్ట్రంలోని ఐదు వైష్ణవ ఆలయాల దర్శనానికి శ్రీకాకుళం నుంచి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్‌లు వేసింది. ఈ సర్వీస్‌లను యాత్రికులు వినియోగించుకోవాలని ఏపీఎస్‌ఆర్టీసీ శ్రీకాకుళం మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్ఎస్ శర్మలు కోరారు. ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బట్టీ, ప్రయాణికులు, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతి తక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని ఐదు వైష్ణవ ఆలయాల దర్శనానికి ఈ బస్సు సర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది.
ఏయే తేదీల్లో సర్వీసులు..
మార్గశిర మాసంలో పంచ వైష్ణవ క్షేత్రదర్శిన పేరుతో డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయా తేదీల్లో శ్రీకాకుళం బస్‌స్టేషన్ నుంచి రాత్రి 8 గంటలకు బస్సులు బయలుదేరుతాయి.
వైష్ణవ ఆలయాల సందర్శన..
తొలుత ద్వారకా తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శించుకుంటారు. అనంతరం అక్కడ నుంచి అంతర్వేది చేరుకొని అక్కడ శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శించుకుంటారు. ఆ తరువాత అప్పనపల్లి చేరుకుని, అక్కడ శ్రీబాల బాలజీ స్వామిని దర్శించుకుంటారు. అక్కడ నుంచి గొల్లలమామిడాడ చేరుకుని కోదండ రాముడిని దర్శించుకుంటారు. తరువాత అన్నవరం చేరుకుని అక్కడ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి శ్రీకాకుళం చేరుకుంటారు.
ప్యాకేజీ ఇదే..
సూపర్ లగ్జరీ సర్వీసులకు ఒక్కో టికెట్ ధర రూ.2,150లుగా నిర్ణయించారు. టిక్కెట్లను ఆన్‌లైన్‌లో https://www.apsrtconline.in/oprs-web/services/packagetours.do బుక్ చేసుకోవచ్చు. లేకపోతే శ్రీకాకుళం బస్‌స్టేషన్‌లో పొందవచ్చు. ఇతర వివరాల కోసం 9959225608, 99592 25610, 9959225609, 9959225611 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్ఎస్ శర్మలు తెలిపారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)