Annavaram : కన్నుల పండువగా అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణ.. పోటెత్తిన భక్తకోటి
Annavaram : కార్తిక పౌర్ణమి సందర్భంగా అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణ జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ రత్న, సత్యగిరుల చుట్టూ 9.2 కిలో మీటర్ల మేర సాగింది. ఈ ప్రదక్షిణలో తెలుగు రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. రద్దీ ప్రభావం దర్శనం, వ్రతాలపై పడింది.
శుక్రవారం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు స్వామివారి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను.. పల్లకీలో తొలిపాంచా వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈవో రామచంద్రమోహన్ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు.
కొండ దిగువున తొలిపాంచా నుంచి వేలాది మంది భక్తులతో సత్య దేవుడు, అమ్మవార్లను ఊరేగింపు ప్రారంభం అయ్యింది. సుబ్బరాయపురం, మెయిన్ రోడ్డు మీదుగా బెండపూడి సమీపంలోని పుష్కర కాలువ వద్దకు చేరుకుంది. అక్కడ బెడపూడి గ్రామస్తులు స్వాగతం పలికారు. పుష్కర కాలువ పక్క నుంచి రత్నగిరి, సత్యగిరి కొండల మీదుగా ఉదయం 11 గంటలకు సత్యదేవుని పల్లకీ పంపా నదీ తీరానికి చేరుకుంది. మార్గ మధ్యలో రెండు చోట్ల స్వామి, అమ్మవార్లు విడిది చేశారు. అక్కడ పండితులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తిరిగి రత్నగిరికి చేర్చారు.
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వామివారు రథం మీద గిరి ప్రదక్షిణ నిర్వహించారు. సత్యరథంపై స్వామి, అమ్మవారిని ఊరేగిస్తూ గిరి ప్రదక్షిణ చేపట్టారు. భక్తుల కోసం ఐదు చోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పాలు, పండ్లు, మజ్జిగ, పులిహార, తాగునీరు పంపిణీ చేశారు. ప్రదక్షిణ చేసే భక్తులకు ఇబ్బంది కాకుండా రోడ్డును నీటితో తడిపారు.
సాయంత్రం 6 గంటలకు పంపా నది వద్ద తెప్పోత్సవ పంటుపై పంపా నదీ హారతి నిర్వహించారు. సత్యదేవునికి పూజలు చేసిన అనంతరం అర్చక స్వాములు పంపా నదికి చీర, సారె సమర్పించారు. పంపా నదికి పంచ హారతి సమర్పించి.. వాటిని భక్తులకు చూపిస్తారు. రాత్రి ఏడు గంటలకు తొలిపావంచా వద్ద సత్యదేవుని జ్వాలాతోరణం నిర్వహించారు.
గతేడాది వరకు కొండ దిగువన తొలిపావంచాల వద్ద సత్యరథానికి పూజలు చేసి ప్రదక్షిణ ప్రారంభించేవారు. భక్తులు వేలాదిగా పాల్గొంటుండటంతో ట్రాఫిక్ నియంత్రణ, సౌకర్యాల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో ఈసారి మధ్యాహ్నం 2 గంటలకు సత్యరథాన్ని ప్రారంభించారు. వైదిక కార్యక్రమాలన్నీ తొలుత నిర్వహించి ఆ తరువాత రథాన్ని ప్రారంభిస్తే.. ఉదయం నుంచే భక్తులు గిరిప్రదక్షిణలో ఉన్నారు. తద్వారా కొండ దిగువన, పైన ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)