ఈ టౌన్‌లో ఇంటర్నెట్ లేదు, ఫోన్ లేదు, వైఫై లేదు, మైక్ర్ వేవ్ కూడా లేదు.. వాడితే చర్యలు!
Digital Detox Destination : ఇటీవలికాలంలో ఫోన్ లేకుండా ఉండటం అనేది ఇంపాజిబుల్. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఫోన్ తప్పనిసరి. ఇక ఇంటర్నెట్ లేకుండా అయితే పిచ్చిలేస్తుంది. కానీ అమెరికాలోని ఓ టౌన్‌లో ఇవన్నీ నిషేధం.
ప్రస్తుతం కాలంలో టీవీలేని ఇల్లు ఉండదు, సెల్ ఫోన్ లేని చేతిని చూడటం అరుదు. కానీ అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునే అమెరికాలోని ఓ టౌన్‌లో మాత్రం టీవీ, ఫోన్, వైఫై, ఇంటర్నెట్‌లాంటి చాలా సదుపాయాలు ఉండవు. ఎవరైనా వాడుతూ కనిపిస్తే వారిపై చర్యలు ఉంటాయి.
అమెరికాలో ఉండే ఈ చిన్న పట్టణం పేరు గ్రీన్ బ్యాంక్. ఇది USAలోని వెస్ట్ వర్జీనియాలోని పోకాహోంటాస్ కౌంటీలో ఉంది. ఈ పట్టణంలో దాదాపు 150 మంది జనాభా ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరూ మొబైల్, టీవీ, రేడియో ఉపయోగించరు. గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ అని పిలిచే ప్రపంచంలోనే అతిపెద్ద స్టీరబుల్ రేడియో టెలిస్కోప్ ఇక్కడ ఉంది. గ్రీన్ బ్యాంక్‌కి వచ్చే సందర్శకులు పట్టణాన్ని సమీపించగానే జీపీఎస్ సిగ్నల్‌లు పనిచేయడం మానేస్తాయి. ఆ ప్రాంతంలో తిరిగేందుకు రహదారి చిహ్నాలను చదవాలి. ఈ ప్రదేశంలో రెండు చర్చిలు, ఒక ప్రాథమిక పాఠశాల, ఒక లైబ్రరీ, ప్రపంచంలోనే అతిపెద్ద స్టీరబుల్ రేడియో టెలిస్కోప్ ఉన్నాయి. వాషింగ్టన్ డీసీ నుండి కేవలం నాలుగు గంటల ప్రయాణంలో ఉన్నప్పటికీ ఈ చిన్న పట్టణంలో Wi-Fi కూడా అందుబాటులో లేదు.
గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ 485 అడుగుల పొడవు, 7,600 మెట్రిక్ టన్నుల బరువు కలిగి ఉంది. ఇది 1958లో స్థాపించారు. ఇది US నేషనల్ రేడియో క్వైట్ జోన్ (NRQZ)లో గ్రీన్ బ్యాంక్ ఉంది. ఇక్కడ అంతరిక్షం నుండి వచ్చే రేడియో తరంగాలను అధ్యయనం చేస్తారు. గురుత్వాకర్షణ తరంగాల నుండి బ్లాక్ హోల్స్ వరకు అన్నింటిని గుర్తించగల సామర్థ్యం ఉన్న అనేక టెలిస్కోప్‌లు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
టెలిస్కోప్ అంతరిక్షంలో 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సంకేతాలను అందజేస్తుందని చెబుతున్నారు. ఇది చాలా సున్నితమైన రేడియో తరంగాలను గుర్తిస్తుంది. మొబైల్ ఫోన్‌లు, టీవీ, రేడియో, ఐప్యాడ్, వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు, రిమోట్ కంట్రోల్ బొమ్మలు, ఫోన్‌లు, మైక్రోవేవ్ ఓవెన్‌లు ఈ ప్రాంతంలో నిషేధించారు. ఎందుకంటే ఈ పరికరాలు అంతరిక్షం నుండి రేడియో తరంగాలను గుర్తించకుండా టెలిస్కోప్‌ను నిరోధిస్తాయి.
గ్రీన్ బ్యాంక్ అబ్జర్వేటరీలో గ్రహాంతరవాసులపై పరిశోధనలు కూడా జరుగుతాయి. ఈ పని 1960 నుండి కొనసాగుతోంది. ఇక్కడ అంతరిక్షంలో ఇతర గ్రహాలపై జీవం రేడియో తరంగాల ద్వారా కనుగొంటారు. కొన్ని పరికరాలను టెలిస్కోప్ దగ్గర వారానికి ఒకసారి మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఈ పట్టణానికి వెళ్లితే గూగుల్ మ్యాప్స్ పని చేయదు. రోడ్డు మీద ఉన్న బోర్డులను చూసే ఎటు వెళ్లాలో తెలుసుకోవాలి.
గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్(GBT) అంతరిక్షం నుండి వచ్చే అత్యంత బలహీనమైన రేడియో తరంగాలను గుర్తించడానికి రూపొందించారు. Wi-Fi, సెల్ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వచ్చే సంకేతాలు కచ్చితమైన డేటాను సేకరించే టెలిస్కోప్ సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తాయి. రేడియో ఫ్రీక్వెన్సీ సాంకేతిక నిపుణులు అబ్జర్వేటరీ సాంకేతిక అమలుదారులుగా వ్యవహరిస్తారు. ఏవైనా అనధికార సంకేతాలు ఉన్నట్టుగా అనుమానించినట్లయితే నిషేధిత పరికరాల కోసం ఇళ్లను తనిఖీ చేస్తారు.